పుట:Abaddhala veta revised.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురోహిత వర్గం అన్ని మతాలలో యీ భయాన్ని కట్టుదిట్టం చేసి, జనాన్ని గుప్పిట్లో పెట్టుకున్నది. కమ్యూనిస్టు పాలనలో సైతం యిది రూపుమాపలేకపోయారు.

శాస్ర్తీయ పద్ధతిని చిన్నప్పటి నుండే పిల్లలకు చెప్పడం ఒక్కటే ఈ భయాన్ని పోగొట్టగలదు. ఇది క్రమేణా జరగాలి.

సమస్యలు ఎదురైనప్పుడు ఎలా పరిశీలించాలో, ఎలా ఎదుర్కోవాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం. దీనికి ముందు ఒక్క సత్యాన్ని విస్మరించరాదని హెచ్చరిక చేయక తప్పదు.

సత్యసాయిని ఖండించే వారంతా మూఢనమ్మకాలకు వ్యతిరేకం అని భ్రమపడితే పెద్ద పొరపాటే. సత్యసాయి బోగస్ కానీ, షిర్డీ సాయి అనువైన వాడనేవారున్నారు. ఇదంతా కాదు, కేవలం తిరుపతి వెంకటేశ్వరుడే నిజమైన దేవుడనేవారూ వున్నారు. మనం చెక్కిన విగ్రహాలకు మనమే మొక్కుతూ బానిస మనస్తత్వంతో బ్రతుకుతున్నామని ఆర్యసమాజ్ వారన్నారు. అలాగని వారు వేదాల్లోకి వెనక్కుపోయి అక్కడే ఆగిపోదామంటున్నారు.

ఈ మతాల మధ్య కలహాలలో పరస్పరం దేవుళ్ళ మహాత్మ్యాలు బయటపడుతుండగా, అన్ని మతాల సమన్వయ వ్యాపారానికి దిగిన రామకృష్ణ పరమహంస వున్నారు. మూఢనమ్మకాలలో, తరతమభేదాలే తప్ప యిందులో మానవుని స్వేచ్చను కాపాడేవి ఒక్కటీ లేవు. అది గ్రహించగలిగితే వివిధ మూఢనమ్మకాలను, వాటి పేరిట జరిగే చికిత్సలను బట్టబయలు చేయవచ్చు. ఎలా చేయడం అనే దగ్గర జాగ్రత్త వహించాలి.

జ్యోతిష్యం శాస్త్రీయమనంటే?

జ్యోతిష్యం ఒక మూఢనమ్మకం అని హేతువాదులు అంటుంటారు. కాదు శాస్త్రీయమే అని మరొక వాదన వుంది. ఏదైనా శాస్త్రీయం అని ఎవరన్నాసరే సంతోషమే. ఒక విషయం శాస్త్రీయం అనగానే ఆహ్వానించాలి. శాస్త్రీయం అయితే బహిరంగంగా పరిశీలనకు పెట్టవచ్చు. ఎప్పటికప్పుడు వచ్చే మార్పులు చేర్పులకు అనుగుణంగా శాస్త్రీయ విధానం వుంటుంది. దీనినే శాశ్వతం అనదు. పూర్వకాలంలో రుషులు రాసారు గనుక అదే ప్రమాణం అని శాస్త్రీయం అంగీకరించదు. రుజువుకు నిలబడితే ఒప్పుకోవడం, లేకుంటే తృణీరించడం శాస్త్ర లక్షణం. తనను తాను దిద్దుకుంటూ సాగడం శాస్త్ర మూలం.

జ్యోతిష్యం శాస్త్రీయమేనని అనగానే, హేతువాదులు ఏమని అడగాలి? ఎలా పరిశీలించాలి? ఏది రుజువుకు పెట్టాలి? ఈ అంశాలు కూడ క్షుణ్ణంగా తెలిసి వుండాలి. గుడ్డిగా వ్యతిరేకించి కొట్టిపారేయరాదు. ఆ దృష్ట్యా మానవ, హేతువాదులకు సూచనలు యిస్తున్నాను. జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మనుషులపై ప్రభావం చూపుతాయి. సరే, బాగానేవుంది. ముందుగా గ్రహాల నుండి ఎలాంటి ప్రభావం వస్తుందో చూడాలి. ఇంత వరకు సైన్స్