పుట:Abaddhala veta revised.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఎంత గొప్ప సైంటిస్టు చెప్పినా అది వ్యక్తిగత అభిప్రాయం అయితే దానిని ప్రమాణంగా స్వీకరించరాదు. జ్యోతిష్యాన్ని గురించి న్యూటన్,యూంగ్ చెప్పాడంటే అది సైన్స్ లో భాగం కాదు. ఈ విషయం గ్రహించక తరచు సైంటిస్టుల పేరు చెప్పి బోల్తా కొట్టించే వారి విషయం జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఈ విషయాన్ని మరో కోణం నుండి చూద్దాం.

సూరి భగవంతం సైంటిస్టుగదా. అలాంటి వ్యక్తి సత్యసాయిబాబా భక్తుడై అతని దేవుడని నమ్మాడుగదా. ఏమంటారు అని అనేకమంది అడుగుతుంటారు. అలా సమస్య వచ్చినప్పుడు సామాన్యవ్యక్తులు అవును నిజమే అంతటి సైంటిస్టే నమ్ముతుంటే ఏమీ లేకపోతే ఎందుకు గుడ్డిగా పాదాక్రాంతుడౌతాడంటారు.

హేతువాదులు ఆ క్లిష్టసమస్యను ఎదుర్కోవడంలొ ముందుగా గమనించవలసిన విషయాలున్నాయి. సూరి భగవంతం ఫిజిక్స్ లొ ఒక భాగమైన క్రిస్టలోగ్రఫీ నిపుణుడు. అది గొప్ప సైన్సు. ఆ విషయాలు ఏవైనా సూరిభగవంతం చెబితే అందుకు రుజువులు, ఆధారాలు, పరిశోధనలు, పరిశీలనలు వుంటాయి. ఆయన చెప్పేవి నిజం అవునోకాదో ఇతరులు అవే పరిశోధనలు చేసి కనుగొనవచ్చు. కాని సత్యసాయిబాబా విషయం కేవలం వ్యక్తిగత నమ్మకం. ఫిజిక్స్ లో ఆయన చదివిన దానికీ, యీ మూఢవిశ్వాసానికీ ముడిపెట్టకూడదు. కాని జనం అలా రెండింటినీ పెనవేసి, ఒకేగాటిన కట్టేసి చూస్తారు. అదే లోపం. శ్రీ పాదగోపాలకృష్ణ మూర్తి ఫిజిక్స్ ప్రొఫెసర్ కాని ఆయన జిల్లెళ్ళమూడి అమ్మ భక్తుడు. ఆ రెండింటికీ సంబంధం లేదు. ఈ విషయాలను విడమరచి చూడకపోవడంలోనే తేడా వస్తున్నది.

భగవతి ఒక జడ్జి. ఆయన సాయిబాబా భక్తికీ, న్యాయమూర్తిగా ఆయన చట్టనైపుణ్యతకూ పొందిక లేదు. ఇలాగే ఎవరి విషయంలోనైనా చెప్పవచ్చు.

జనంలో వీరారాధన తత్వం వుంది. అందులో అరలు పొరలు వున్నాయి. సినిమా హీరోలను, రాజకీయవాదులను గొప్ప ఆరాధ్యులుగా చూచేవారున్నారు. వారికోసం ప్రాణాలు తీసుకునేవారూ వున్నారు. అలాంటివారే బాబాలకు భక్తులుగా వున్నప్పుడు, వారిని ఆరాధించే తీరు సంగతి చెప్పాలా?

జనంలో వున్న యీ బలహీనతల్ని, వీరారాధన తత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను తాకట్టుపెట్టే ధోరణి బాగా వాడుకుంటున్నారు. స్వేచ్ఛకు దూరంగా జరుగుతూ ఎవరికో, ఒకరికి లొంగిపోయి అదే హాయి అనే ధోరణి జీవిస్తున్నారు. దీనికి కర్మవాదం తోడైంది.

భయం వలన భక్తిగా వుండటం సర్వసాధారణం, చిన్నప్పటినుండే పిల్లల్ని కొట్టి, తిట్టి, గుడులకు మసీదులకు, దేవాలయాలకు తీసుకెళ్ళి, గుడ్డిగా వల్లెవేయించిన ఫలితంగా యీ భయం గూడు కట్టుకొనివుంటుంది. అది పెద్ద అయినా పోవడం లేదు. ఆ భయం చుట్టూ క్రతువులు,పూజలు, మొక్కుబడులు,యజ్ఞాలు,యాగాలు ఒకటేమిటి, ఎన్నో అల్లేశారు.