పుట:Abaddhala veta revised.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాంటిమేటర్ లక్షణాలు గల యాంటి ప్రోటాన్, యాంటి న్యూట్రాన్ లు కలిపితే 1965లో యాంటిహైడ్రోజన్ నూక్లియర్ ఏర్పడింది. అలాగే యాంటి హీలియం కూడా రూపొందించారు. ఇదంతా సూక్ష్మలోకములో పరిశోధనల ఫలితమే. స్థూల ప్రపంచములో యిలా యాంటిమేటర్ భారీగా వున్నట్లు తేలలేదు. అలాంటిది వుండే అవకాశం లేకపోలేదు.

ఎక్కడైనా నక్షత్రం యాంటిమేటర్ తో వుంటే అక్కడ గ్రహంలో మనుషులుంటే, వారికి మనం యాంటిమేటర్ గా కనిపిస్తామన్నమాట!

- హేతువాది, మార్చి,మే,జూన్ 1993
సూదుల మందు (అక్యూపంక్చర్)

నమ్మకమా? శాస్త్రీయమా?

ఆక్యూపంక్చర్ వైద్య విధానం ప్రాచీన చైనాలో వుండేది. సైన్సు అభివృద్ధి చెందక పూర్వం, చైనాలో యిదొక నమ్మకంగా ప్రబలింది. దేహమంతటా జీవశక్తి ("కి") ప్రవహిస్తుంటుందని, సూదులు గుచ్చడం ద్వారా, అనారోగ్యంగావున్న వ్యక్తిలో జీవశక్తిని ప్రభావితం చేయవచ్చునని చైనీయులు కొందరు నమ్మేవారు. మొదట్లో దేహంలో 365 చోట్ల సూదులు గుచ్చవచ్చని గుర్తించారు. అవి రానురాను పెరుగుతూపోగా, ప్రస్తుతం 2 వేల స్థానాలు పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల యివి 2500 వరకూ వున్నాయి! ఆక్యూపంక్చర్ విధానాన్ని పాటించే వారిలో బేదాభిప్రాయాలున్నాయి. నాలుగు వేల సంవత్సరాల క్రితం చైనాలో ఆక్యుపంక్చర్ ఆరంభమైనప్పుడు, పంచభూతాలు-నీరు,లోహం, భూమి,అగ్ని, చక్క-దేహంపై ప్రభావం చూపెడతాయని నమ్మారు. దేహంలోని జీవశక్తికి స్త్రీ, పురుష(ఇన్,యంగ్) లక్షణాలున్నాయన్నారు. వీటి మధ్య సమన్వయం సాధించడానికి, సున్నితమైన సూదులు వాడి, దేహంలోని 14 స్థానాలలో వున్నవాటిని ప్రేరేపించవచ్చుననీ, ఉత్తేజపరచడం సాధ్యమనీ భావించారు. ఒక్కొక్క స్థానం ఒక అంగానికీ, ఒక్కొక్క పనికే చెందుతాయన్నారు. సున్నిత సూదులు ఆయా స్థానాలలో గుచ్చి, జీవశక్తిని తగిన రీతిలో మలుస్తారన్నారు. గుచ్చిన సూదుల్ని కొన్ని నిమిషాలు అట్టిపెట్టి, తీసేసిన తరువాత,సూదులు గుచ్చినచోట్ల ఆకులతో స్వల్పంగా కాల్చేవారు.

వ్యక్తికి వున్న రోగలక్షణాల బట్టి,ఏ స్థానాలలో సూదులు గుచ్చాలో నిర్ధారిస్తారు. నాడిని చూచి, స్త్రీపురుషులకు వేర్వేరుగా, యీ సూది చికిత్స చేస్తారు. దేహంలోని 12 అంగాలకు ప్రాతినిధ్యం వహించే నాడిని గుర్తించి,చికిత్స చేస్తారు. సూదులు గుచ్చడం, తీయడం, ఎంతసేపు వుంచాలనడం, ఎక్కడ గుచ్చాలనడం, ఆయా వ్యక్తులకు వచ్చిన రోగాన్ని బట్టి వైద్యుడు నిర్ధారిస్తాడు.

చైనా చరిత్రలో ఆక్యూపంక్చర్ కు ఆదరణ, అనాదరణ వుంటూ వచ్చింది. కొన్నాళ్ళు బ్రహ్మరధం పట్టడం ఒక్కోసారి యీసడించి పక్కన బెట్టడం చైనా సుదీర్ఘ చరిత్రలో జరిగింది.