పుట:Abaddhala veta revised.pdf/409

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గడియారంలో 4.84 సంవత్సరాలుగా చూపుతుంది. మరో పది సంవత్సరాలకు గాని భూమి మీదవున్న పృధ్వికి యీ సంగతి తెలియదు. అప్పటికి అతడి గడియారం ప్రకారం 21.1 సంవత్సరాలు అవుతుంది.

మొత్తంమీద 22.2 సంవత్సరాలకు ఆకాశ్ తిరిగి భూమి మీదకు వస్తాడు. తిరుగు ప్రయాణంలో వేగం హెచ్చించి 1.1 సంవత్సరంలోనే చేరుకుంటాడు. తిరిగి వచ్చిచూస్తే భూమిపై 22.2 సంవత్సరాలు గడిచాయి. భూమిమీద వున్న పృధ్వి తనకంటె 12.5 సంవత్సరాలు ముసలివాడైనట్లు కనుగొంటాడు. ఈ మార్పులన్నింటికీ, ఆకాశ్ ప్రయాణ వేగం, దానిలో మార్పులు కారణం. ఇందులో రెండు ప్రధానాంశాలు పనిచేస్తాయి. ఒకటి డాప్లర్ ప్రభావం అంటారు. మనకు దగ్గరగా కారు వస్తుంటే శబ్దం పెరిగిపోతున్నట్లు, దూరంగా పోతుంటే శబ్దం సన్నగిల్లుతున్నట్లు వుంటుంది. క్రిస్టియన్ డాప్లర్ (1803-1853) అనే శాస్త్రజ్ఞుడు పేర్కొన్న యీ సూత్రాన్ని కాంతికి అన్వయిస్తే, దూరంగా జరిగిపోతున్న వాటి నుండి వచ్చేకాంతి ఎర్రగానూ, దగ్గరగా వస్తున్న వాటి కాంతి నీలంగానూ వుంటుంది. పైన మనం చర్చించిన అంశంలో డాప్లర్ ప్రభావం చూస్తాం. రెండవది కాలం కుంచించుకపోవడం, ఇద్దరి పరిశీలకుల మధ్య ఎడం ఎక్కువ అవుతుంటే, వారి గడియారాలు నెమ్మదిగా తిరుగుతున్నట్లు, చేరువగా వస్తుంటే గడియారాలు తొందరగా తిరుగుతున్నట్లనిపిస్తుంది. సాపేక్షతా సిద్ధాంతం కాంతివేగాన్ని గురించి చర్చించగా వచ్చిన సారాంశమిది.

యాంటిమేటర్

ఆధునిక సైన్స్ పరిశోధనలలో బయటపడిన మరో ఆశ్చర్యకరమైన అంశం యాంటిమేటర్!

అందులో మీ ప్రతిబింబం కనిపిస్తే ముద్దుగానే వుండొచ్చు. కాని నిజలోకంలో అలా కనిపిస్తే షేక్ హేండ్ ఇవ్వద్దని స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించాడు. మన ప్రతిబింబం నిజలోకంలో మన వ్యతిరేక పదార్ధం. వ్యతిరేకపదార్ధాలు తారసిల్లితే రెండూ అంతమౌతాయి. మరి ఏమి మిగులుతుంది? రేడియేషన్ రూపంలో అది వస్తుంది. అంటే పదార్ధం నాశనం కాదు. రూపం మారుతుంది అనే దానికి సరిపోయుంది. రెండు అలలు ఢీకొంటే ప్రశాంతత ఏర్పడినట్టు,యాంటిపదార్ధం విశ్వంలో ఎక్కడైనా వుందేమో ఇంకా తెలియలేదు. సైన్సుకు తెలిసినంతవరకూ పదార్ధమేవుంది. సూక్ష్మలోకంలో అణువుల స్థాయిలో పదార్ధ వ్యతిరేక లక్షణాలున్నవని కనుగొన్నారు. వీటినే ఎలక్ట్రాన్లలో చూచి పాజిట్రాన్ అన్నారు. కణం - యాంటికణం ఢీకొంటే వాటిలోని ఎలక్ట్రిక్ ఛార్జి పరస్పర విరుద్ధ స్వభావం గనుక అది నాశనమౌతుంది. కాని వాటిలోవుండే ద్రవం హరించిపోదు. ద్రవ్యరాశి కూడా శక్తే. అది రూపం మార్చుకుంటుంది. అప్పుడే గామా కిరణాలు వస్తాయి. హరించుకపోయేముందు ఎంత మేరకు ద్రవ్యరాశి(మాస్) వునదో, అంత శక్తి కూడా గామా కిరణాలుగా వస్తాయి.