పుట:Abaddhala veta revised.pdf/411

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అక్యూపంక్చర్ పెర్కొనే దేహస్థానాలు (జ్యోతిష్యంలో రాసులవలె) ఆనాడు యీనాడు శాస్త్రీయంగా రుజువుకాలేదు. దేహంలో జీవశక్తి ప్రవహిస్తుందని, ఇది స్త్రీ పురుష అంగాలలో భిన్న తీరులలో వుంటుందనేది కేవలం నమ్మకం మాత్రమే.

మూత్రపిండాలు (కిడ్నీ), మానవశక్తి (యిచ్ఛ) కీ, భయానికి కేంద్రం అని, కాలేయం (లివిర్) వలన కన్నీళ్ళు వస్తాయని, ఆలోచనకు కూడలి (స్ప్లీన్) ప్లీహం అనీ అక్యూపంక్చర్ నమ్మకాలలో పేర్కొనదగినవి. దేహమంతటికీ చెందిన ఆక్యూపంక్చర్ స్థానాలు చెవులలో వున్నాయని వీరి విశ్వాసం.

దేహంలో యే భాగం ఎక్కడవుందో ఆధునిక వైద్యవిజ్ఞానం పరిశోధించి చెబుతున్నది. ఇందుకు అక్యూపంక్చర్ పూర్తిగా భిన్నం, విరుద్ధం కూడా. సూదులు గుచ్చి, సుఖ ప్రసవం చేయించవచ్చని, బాధా నివారణకు ఆక్యూపంక్చర్ మంచిదనీ ఆపరేషన్లకు (అనస్తేషియా) మత్తుమందువలె యిది ఉపకరిస్తుందనీ ప్రచారంతెచ్చి, బాగా వ్యాపారం చేస్తున్నవారున్నారు. కొందరు డాక్టర్లు తాము దేహంలో కొత్త స్థానాలు కనుగొన్నామంటూ, వాటికి తమ పేరు పెట్టి వైద్యం పేరిట డబ్బు గుంజుతున్నారు.

మావో చివరి రోజులలో చైనాలో ఆక్యూపంక్చర్ ప్రచారం చేశాడు. అందువలన కమ్యూనిస్టులు కొందరు యిది పార్టీపరంగా స్వీకరించి,ప్రచారసాధనంగా వాడుకుంటున్నారు. అక్యూపంక్చర్ ను వివిధ రీతులలో మావో ప్రచారం చేయించాదు. ప్రభుత్వ ప్రచారాలు చేసినట్లే, కొందరు రోగులు ఆపరేషన్ సమయంలో మావోను పొగడుతూ కులాసాగ కబుర్లు చెబుతున్నట్లు ఫోటోలు చూపి ఫిల్ం తీసి అక్యూపంక్చర్ ఒక చైనా కమ్యూనిస్టు విధానంగా ముద్ర వేశారు!

చైనాలో ప్రాచీన మూఢనమ్మకంగా బయలుదేరిన అశాస్త్రీయ విధానం కమ్యూనిస్టు మావో ప్రచారంవలన ప్రపంచం వ్యాప్తమయింది.

అక్యూపంక్చర్ లో మందులులేవు, కనుక మందులవలన కలిగే చెడు యిందులో లేదనీ ప్రచారం చేస్తున్నారు.

అక్యూపంక్చర్ విధానంలో వాడే సూదులు పొరపాటున, దేహస్థానంలో సరైన చోటగాని, కొంచెం పక్కన గుచ్చినా, జీవశక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేయజాలదని చెప్పారు? అదేమోగాని, కొన్నిచోట్ల నరాలలోకి గుచ్చిన సూదులు ప్రమాదాలకు దారితీసిన సందర్భాలున్నాయి. నేడు గుచ్చే సూదుల వలన ఎయిడ్స్ వ్యాధి (ఇది వస్తే నయంకాదు ఇంకా మందు కనుక్కోలేదు గనుక) రావచ్చు. అంటువ్యాధులు ఒకరివి మరొకరికి రావచ్చు. కేవలం నొప్పి నివారణే చికిత్స కాదు. రోగనిర్ధారణ ముఖ్యం. అక్యూపంక్చర్ కు అది తెలయదు.

ఆధునిక వైద్య విజ్ఞానం కనుగొన్న దేహంలోని నరాలు,ఇతర సున్నిత భాగాలు యేవీ అక్యూపంక్చర్ కు తెలియవు.