పుట:Abaddhala veta revised.pdf/407

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బ్లాక్ హోల్స్ వుంటే వాటినుండి గామాకిరణాలు, ఎక్స్ రేలు వస్తుండాలి. పరిశోధకుడు బ్లాక్ హోల్స్ లోపడిపోతే ఛిన్నాభిన్నమైపోతాడు గనుక ఏం జరిగిందో అతడు మనకు చెప్పే అవకాశం లేదు. కాని అతని సాంద్రత మేరకు బ్లాక్ హోల్ పెరుగుతుంది గనుక, రేడియేషన్ రూపంలో తిరిగి విశ్వంలోకి వస్తుంది.

బ్లాక్ హోల్ లో ఏది పడినా ధ్వంసమైనట్లే. విశ్వం కూడా ఒకసారి ఎప్పుడో ధ్వంసమౌతుందని సిద్ధాంతీకరిస్తున్నారు. విశ్వం ప్రారంభం కావడం కూడా పెద్ద ప్రేలుడుతో మొదలయిందనుకుంటున్నారు.

ఈ విశ్వానికి అది అంతం వుందా? ఉంటే ఎలా జరిగింది అనేది సైన్సుకు పెద్ద సమస్యే. విశ్వం పెద్ద ప్రేలుడుతో ఆరంభమై విస్తరిస్తూ పోతున్నదంటారు. దీని ప్రకారం రేడియేషన్ గాని, పదార్ధంగాని చల్లబడుతూ పోతుంది. వేడి ఎక్కువగా వున్నప్పుడు కణాలు వేగంగా కదులుతూ, పరస్పర ఆకర్షణను తప్పించుకోగలవు. చల్లారుతున కొద్దీ కణాల మధ్య ఆకర్షణ పెరిగి, ఆకట్టుకుంటాయి. ఎక్కువ వేడి వున్నప్పుడు కణాలు, అందుకు వ్యతిరేక కణాలు జంటలుగా ఉత్పత్తి అవుతాయి. ఇవి కొన్ని పరస్పరం తారసిల్లి హరించుకపోతాయి. హరించేదానికంటే ఉత్పత్తి ఎక్కువగా వుంటుంది. వేడి తక్కువ అవుతున్నప్పుడు కణాలు తక్కువ శక్తితో వుంటాయి గనుక కణ-వ్యతిరేకకణజంటల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అప్పుడు పరస్పరం హరించుకపోవడమూ ఎక్కువగానే వుంటుంది.

పెద్ద ప్రేలుడుతో విశ్వం ఆరంభమైనప్పుడు వేడి విపరీతంగా వుండేది. తరువాత విశ్వవిస్తరణ ఆరంభమై రేడియేషన్ తగ్గింది. ఈ తగ్గుదల ప్రతి సెకండ్ కూ ఎక్కువగానే వుంది. అప్పుడు విశ్వంలో ఫోటాన్లు, యెలక్ట్రాన్లు, న్యూట్రినోలు, వాటి వ్యతిరేక కణాలు ఉండేవి. విశ్వం విస్తరిస్తూ చల్లబడుతుంటే కణం వ్యతిరేక కణోత్పత్తి తగ్గిపోయింది. యెలక్ట్రాన్లు-వ్యతిరేక యెలక్ట్రాన్లు హరించుకపోయి, ఫోటాన్లు యెక్కువకాగా, యెలక్ట్రాన్లు కొద్దిగా మిగిలాయి. న్యూట్రినోలు, వ్యతిరేక నూట్రినోలు బలహీనంగా పరస్పరం తారసిల్లడం వలన, అవి హరించుకపోగా, మిగిలాయి. పెద్ద ప్రేలుడు అనంతరం, వేడి తగ్గుతుండడం, విశ్వవిస్తరణ సాగుతుండడంతో, ప్రోటాన్లు, న్యూట్రాన్లు బిలీయమైన న్యూక్లియర్ శక్తి ఆకర్షణను తప్పించుకోలేక భారమైన హైడ్రోజన్ ను ఉత్పత్తి చేశాయి (డియోటేరియం) అయితే పెద్ద ప్రేలుడు జరిగిన కొద్ది గంటలకే హీలియం,ఇతర కణాల ఉత్పత్తి ఆగిపోయింది. ఆ తరువాత విస్తరణ జరుగుతూ పోయింది. యెలక్ట్రాన్లు, నుక్లైలు కలసి అణువులుగా రూపొందాయి. విశ్వంలో దట్టంగా పదార్ధం వున్నచోట విస్తరణ ఆలస్యంగా జరిగింది. గురుత్వాకర్షణే యిందుకు కారణం. అలాంటి చోట్ల మళ్ళీ పరిభ్రమణ జరగడం, కొన్ని నక్షత్రాలు పళ్ళెం ఆకారంగా, కొన్ని బంతి ఆకారంగా ఏర్పడ్డాయి.

ఈ విశ్వపరిణామంలో మన సూర్యుడు పరిభ్రమిస్తున్న గాస్ నుండి జనించడం, ఇందులో భారమైన కణాలు 2 శాతం వుండటం కద్దు. మరికొన్ని భారకణసముదాయం సూర్యుని చుట్టూ గ్రహాలుగా ఏర్పడ్డాయి. వీటిలో మన భూమి కూడా ఒకటి.