పుట:Abaddhala veta revised.pdf/392

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లేవని స్పష్టపడింది. విశ్వమంతటా కాలం ఒకే తీరులో, స్థిరంగా వుంటుందని న్యూటన్ చెప్పింది కూడా సరికాదని స్పష్టపడింది.

కవల పిల్లల్ని ఉదాహరణగా తీసుకొని చూద్దాం. ఒకరు భూమి పైన వున్నారు. మరొకరు కాంతివేగంతో రాకెట్ లో సమీప నక్షత్రానికి వెళ్ళి వచ్చారు. వెళ్ళి రావడానికి పట్టిన సమయం రాకెట్ లో వున్న వ్యక్తికి గంటల్లో వుండగా భూమిపై వున్న వ్యక్తికి సంవత్సరాలు పడుతుంది. తన తోటి కవల కంటె ఎన్నో సంవత్సరాలు చిన్నవాడుగా రాకెట్ లో ప్రయాణం చేసిన వ్యక్తి తిరిగివస్తాడు! ఇదెలా జరుగుతుంది?

ఇరువురూ పరస్పరం కాంతి కిరణాల ద్వారా చూస్తారు. కాంతి ప్రయాణం చేసే కాలం యెక్కువసేపు పట్టిందంటే దూరం అంతగా వుందన్న మాట. చంద్రుడి నుండి ఒక సెకండ్ లో కాంతి కిరణం భూమిపైకి వస్తుంది. సూర్యుడి నుండి 8 నిముషాలలో కాంతి భూమిపైకి చేరుతుంది. అంటే 8 నిమిషాల క్రితం సూర్యుణ్ణి మనం చూస్తున్నామన్న మాట. కాని మనం చూచే నక్షత్రాలే యిప్పటివి కావు. కొన్ని సంవత్సరాల క్రితం బయలుదేరిన కాంతికిరనాలు భూమిపైకి చేరేసరికి మనం నక్షత్రాలను చూడగలుగుతున్నాం. సెకండుకు 1,86,000 మైళ్ళు పయనిస్తుంటే, మనం 4 కాంతి సంవత్సరాల క్రితం బయలుదేరిన కిరణాల్ని చూస్తున్నామంటే ఎంత దూరాన నక్షత్రం వుందో అంచనా వేయండి. ఇరువురు కవల పరిశీలకుల గడియారాలను పోల్చి చూస్తే తేడా కనిపిస్తుంది. ఇద్దరూ దూరంగా జరిగిపోతుండగా, వారి గడియారాలు నెమ్మదిగా పోతున్నాయనిపిస్తుంది. ఇద్దరూ చేరువ అవుతుంటే గడియారాల వేగం పెరుగుతుంది. కవలల్లో ఒకరు భూమి మీద వుండగా, రెండో వ్యక్తి నక్షత్రం దగ్గరగా కాంతివేగంతో వెళ్ళి వచ్చారనుకోండి. నక్షత్రదూరం పది కాంతి సంవత్సరాలనుకొండి. ఇరువురి గడియారాలు ఒకరితో ఒకరు పోల్చుకుంటే 2:3 రెట్లు నెమ్మదిగా సాగినట్లనిపిస్తుంది.

నక్షత్రానికి వెళ్ళి వచ్చిన వ్యక్తి 9.7 సంవత్సరాలకు (రాకెట్ టైం) భూమి మీదకు తిరిగివస్తాడు. 22.2 సంవత్సరాలు భూమి మీద వున్న వారికి గడచిపోతుంది. అంటే భూమి మీద వున్న వ్యక్తి తనకంటె 12.5 సంవత్సరాలు పెద్ద అయినట్లు కనుగొంటాడు. ప్రయాణం చేసిన వ్యక్తి కాంతివేగంతో రాకెట్ లో పోవడమే యిందుకు కారణం. ప్రయాణం చేసి తిరిగివచ్చిన వ్యక్తి రాకెట్ లో వేగాన్ని పెంచడం తగ్గించడం, భూమిపై అలాంటి అనుభవం లేకపోవడం విస్మరించరాదు.

భూమిపై వున్న వ్యక్తికి 10 కాంతి సంవత్సరాలు కాగా, రాకెట్ లో ప్రయాణం చేసే వ్యక్తికి 4.36 కాంతి సంవత్సరాలే అయినట్లుంది. అంటే కాలం కుంచించుక పోయిందన్నమాట. నక్షత్రం స్థిరంగా వుందని భావించి, రాకెట్ లో పోయే వ్యక్తి కాలాన్ని చూచుకుంటాడు. చలనంలో దూసుకుపోతున్న వ్యక్తికి కాలం కుంచించుకుపోవడమనేది, ప్రదేశపరంగా వుంటుంది. ఈ విషయమై హెన్ డ్రిక్ లారెజ్ (1853-1928), జార్జి ఫిజ్జరాల్డ్ (1851-1901) పరిశోధనలు జరిపి ఫలితాలు వెల్లడించారు.