పుట:Abaddhala veta revised.pdf/393

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

న్యూటన్ పేర్కొన్న ప్రదేశ-కాల సత్యాలు ఐన్ స్టీన్ సూచించిన ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతంలో కలసిపోయాయి. ఆ తరువాత 1915లో వచ్చిన సాధారణ సాపేక్షతా సిద్ధాంతంలో ఇవన్నీ మిళితమయ్యాయి. న్యూటన్ గతిసూత్రాలు తప్పు అనం. కాని ఐన్ స్టీన్ సిద్ధాంతానికి లోబడి పరిమిత సత్యాలుగానే వాటికి విలువ వుంటుంది. విశ్వమంతటికీ అవి చెల్లవన్నమాట. సైన్స్ లో ఇలా నిరంతర ప్రగతి సాగుతూ వుంటుంది.

మార్పు

మనం చూస్తున్న వాటిల్లో కొన్ని ఎన్నడూ మారనట్లు, నిత్యం తెల్లవారడం పొద్దుకుంగడం గమనిస్తాం. కొండలు సముద్రాలు అలాగే వుంటాయి. కాని మనం మాత్రం మారుతుంటాం. పుట్టుక, పెరుగుదల, మరణం మార్పులో భాగమే. అలాగే కొన్ని వస్తువులు తుప్పుపడుతుంటాయి. మరికొన్ని శిథిలమవుతుంటాయి. మారనిది అంటూ ఏదీలేదు. ఎంతసేపట్లో మారతాయనేదే ప్రశ్న. మార్పుకు పట్టే కాలాన్ని బట్టి కొన్ని అసలు మారనట్లే అనిపిస్తాయి. మార్పుతో ముడిపడి కాలం వున్నది. మనం దీనినే గతం, వర్తమానం, భవిష్యత్తు అని విభజించాం. భౌతిక విజ్ఞానం గతం-భవిష్యత్తునే పేర్కొన్నది. కాలాన్ని విడిగా చూచిన తీరును ఐన్ స్టీన్ మార్చేసి, కాలం-ప్రదేశం కలిపేడు.

విశ్వంలో ఎన్నో వస్తువులు వుండగా వాటిలో మార్పులు వివిధ రకాలుగా కనిపిస్తున్నవి. సైన్సులోని భిన్నశాఖలు ఆయా రంగాలలోని మార్పుల్ని అధ్యయనం చేసి చెబుతున్నాయి.

- హేతువాది, ఫిబ్రవరి 1992
నేనెలా పుట్టాను?

పిల్లలందరు అడిగే ప్రశ్న నేనెలాపుట్టాను?

ఎప్పుడోకప్పుడు అమ్మను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం రాదు, అబద్ధాలు చెప్పి తప్పుకుంటారు. దేవుడు పుట్టించాడంటారు. ఏవో కట్టుకధలు అల్లి మాట తప్పిస్తారు. కనుక పిల్లలకు అదొక వింతగా, మిగిలిపోతుంది. చాలాకాలానికి గాని అసలు విషయం తెలియదు. అప్పటికే చాలా అసంబద్ధ నమ్మకాలు నాటుకపోయి వుంటాయి.

పిల్లలకు నిజం చెప్పాలి. చెప్పేది ఆకర్షణీయంగా వాస్తవంగా వుండాలి. అసత్యం పలకాల్సిన అవసరం లేదు.

తల్లి కడుపులో సూక్ష్మమైన అండాలు వుంటాయి. తండ్రి పొత్తికడుపులోనూ సూక్ష్మమైన జీవరేతస్సు కణాలు వుంటాయి. తల్లిదండ్రులు కలుసుకున్నప్పుడు సంపర్కంవలన తండ్రి రేతస్సు,తల్లి అండం చేరడానికి ప్రయత్నిస్తాయి. అలా కలిసినప్పుడు తల్లికడుపులో బిడ్డ పుట్టటం మొదలౌతుంది.