పుట:Abaddhala veta revised.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుట్టుకోస్తాయని ఒకప్పుడు నమ్మేవారు. నిర్జీవ పదార్ధం నుండి జీవం పుట్టిందని కూడా కొంతకాలం నమ్మేవారు. 17, 18, 19 శతాబ్దాలలో ఇలాంటి నమ్మకాలు బాగా విస్తరించి ఉండేవి. సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) 19వ శతాబ్దం మధ్యలోగాని కనిపెట్టలేదు. సూక్ష్మజీవులు ఉన్నాయని కనుగొన్న తరువాత, నిర్జీవ పదార్ధం నుండి దానంతటదే జీవం పుడుతుందనే నమ్మకం తొలిగిపోయింది. లూయీపాశ్చర్, ఎఫ్.ఎ.పోచే ఈ విషయాలపై పరిశోధనచేసి పరస్పర విరుద్ధమైన నిర్ణయాలకు వచ్చారు.

తమ పరిశోధన శాస్త్రీయమైనదే అని ఇద్దరూ భావించారు. పరిశీలన, పరిశోధన, తర్కాన్ని ఇరువురూ వినియోగించుకున్నారు. కాని పరిశోధన చేసేటప్పుడు అందుకు వినియోగించే పరికరాలు శుభ్రంగా ఉన్నాయా, లేదా, గాలిలో ఉండే ధూళి, సూక్ష్మజీవుల ప్రభావం లూయీపాశ్చర్ పరికరాలను వేడినీటిలో స్టెరిలైజ్ చేసి జాగ్రత్త వహించాడు. మిగిలినదంతా ఇరువురూ, శాస్త్రీయ పద్ధతిలోనే చేశారు. కాని ప్రధానమైన ఈ తేడా వలన నిర్జీవం నుండి జీవం పుట్టుకొస్తున్నట్లు పోచేకు తేలగా, అది అబద్ధమని పాశ్చర్ రుజువు చేసాడు. చివరకు పాశ్చర్ చేసిందే సరైనదని తేలింది. సాక్ష్యాధారాలు నిర్ధుష్టంగా కనుగొనటం వ్యయప్రయాసలతో కూడినపని. అందుకు ఓర్పు, జాగ్రత్త, ప్రశ్నించే స్వభావం, క్లిష్టపరీక్షకు నిలబెట్టే ధోరణి ఉండాలి. ఈ దృష్ట్యా మానవులపై శాస్త్రీయ పరిశోధన చేయటం జటిలమైన సమస్య. అందువలన శాస్త్రీయ పద్ధతిలో మానవులకు సంబంధించి మూడు విధాలైన రీతులను పాటిస్తున్నారు. ఒకటి 'కోహార్ట్' అధ్యయనం. కొందరు వ్యక్తులను చాలాకాలంపాటు పరిశీలించి వారి అలవాట్లకూ, ఆరోగ్యానికీ ఉన సంబంధాన్ని గమనించటం ఈ పద్ధతిలో ఉన్నది. తమలపాకు నమిలేవారికి గొంతు కేన్సర్ వస్తుందా? అనే పరిశీలన చేయాలంటే ఇటువంటి పద్ధతిని అనుసరిస్తున్నారు. 'క్రాస్ సెక్షన్ సర్వే' మరొక పద్ధతి. ఇందులో కొందరు వ్యక్తులను ప్రస్తుత స్థితిలో ఎలా ఉన్నారో చూచి, దాన్నిబట్టి వారి లక్షణాలనూ ఆరోగ్యస్థితిని పోల్చిచూడటం జరుగుతున్నది. లావుగా ఉన్నవారికి, గుండె జబ్బులు వస్తాయనే లక్షణాన్ని ఇలా పరిశీలించటం జరుగుతున్నది. మూడవ పద్ధతి 'కేస్ కంట్రోల్' అధ్యయనం. ఇందులో గతాన్ని ఆధారంగా వ్యక్తుల లక్షణాలు , ప్రస్తుతం ఉన్న స్థితి, గతానికి ప్రస్తుతానికీ ఉన్న సంబంధం చూస్తారు.

శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనల వలన ఉపయోగం ఏమంటే ఒకరు రుజువు చేసినదాన్ని మరే శాస్త్రజ్ఞుడైనా రుజువు చేయవచ్చు. అంటే క్లిష్టపరిస్థితి అనేది బహిరంగ సత్యమన్నమాట. శాస్త్రీయ పద్ధతిలో, క్లిష్ట పరీక్షకు నిలబడిన తరువాత ఎవరైనా నమ్మవలసిందే. మరొక శాస్త్రజ్ఞుడు అది తప్పని రుజువు చేసేవరకూ శాస్త్రీయ సత్యం నిలబడుతుంది. విజ్ఞానంలో ఏదీ శాశ్వతం కాదు. దేనినైనా, ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు. న్యూటన్ను, ఐన్ స్టీన్ ప్రశ్నించాడు. హైజన్ బర్గ్ వచ్చి ఐన్ స్టీన్ను తల్లక్రిందులు చేసారు. ఈ విధంగా కాలానుగుణంగా విజ్ఞానపరిధి విస్తృతమవుతున్న కొలదీ, కొత్తవి కనుగొనటం జరుగుతున్నది. పాతవాటికీ చారిత్రక విలువ మాత్రం ఉంటుంది.