పుట:Abaddhala veta revised.pdf/389

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రానికి, సాంకేతికానికీ తేడా ఉన్నది. సాంకేతికం శాస్త్రం ఆధారంగా వస్తుంది. ఉదాహరణకు మనం రోజూవాడే రేడియో, టెలివిజన్, టేప్ రికార్డర్లు సాంకేతికపరమైనవి. విద్యుత్-అయస్కాంత తరంగాల గురించి శాస్త్రం పరిశోధించి కనుగొన్నది. అది సిద్ధాంతం.దాన్ని అన్వయిస్తే సాంకేతికమౌతుంది. విద్యుత్-అయస్కాంత తరంగాల అన్వయీకరణే రేడియో, అలాగే ఆటంబాంబు సాంకేతికపరమైనది. పదార్ధాన్ని శక్తిగానూ, శక్తిని పదార్ధంగానూ పరస్పరం మార్చుకోవచ్చుననేది రుజువైన శాస్త్రీయ సిద్ధాంతం. శాస్త్రం బహుళ ప్రచారంలోకి రాదు. నిపుణులైన కొందరికే ఇది పరిమితం. దీనిని మరికొందరు నిపుణులు సాంకేతికంగా మారుస్తారు. మన నిత్య జీవితంలో ఆటంబాంబు-ఆయుధాలు మొదలైన సాంకేతిక విషయాలను చూస్తున్నాం కనుక, అదే సైన్సు అనుకొని మానవాళిని సైన్స్ నాశనం చేస్తుందని విమర్శిస్తుంటాము. సైన్స్ ను దుర్వినియోగపరచటం సద్వినియోగం చేయటం అనేది సాంకేతిక శాస్త్రానికి చెందినది. ఈ ప్రధానమైన తేడాను గమనించాలి.

ఆధునిక శాస్త్రీయ పద్ధతిలో ముఖ్యమైన దశలు కొన్ని ఉన్నాయి. పరిస్థితిని పరిశీలించి తదనుగుణమైన విషయామన్నిటినీ సేకరించటం, ఆ విషయాలాధారంగా అంచనా వేయటం, అంచనాలను పరిశీలనకు పెట్టడం. శాస్త్రీయ పద్ధతిలో క్రొత్త ప్రతిపాదన రుజువుకు నిలబడితే అది కూడా శాస్త్రంలో భాగం అవుతుంది. ఐన్ స్టీన్ గురుత్వాకర్షణకు కాంతికిరణాలు గురి అవుతాయని, అవి శక్తిని మోసుకెళుతుంటాయనీ, అందువలన నక్షత్రాలనుంచి వచ్చే కాంతి కిరణాలు సూర్యుని గురుత్వాకర్షణకు ఒంగుతాయని సిద్ధాంతీకరించాడు. ఇది వాస్తవమేనని శాస్త్రజ్ఞులు పరిశోధన ద్వారా రుజువు చేసారు.

మార్క్సిజం శాస్త్రపద్ధతికి నిలబడదు

సామాజిక విషయాలలొ కూడా తరచు శాస్త్రీయ పద్ధతిని గురించి వింటుంటాం. మార్క్సిజం శాస్త్రీయమైన సిద్ధాంతమని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని చర్చిద్దాం. మార్క్స్, ఏంగిల్స్ శాస్త్రజ్ఞులు కారు. 19వ శతాబ్దంలో ఉన్న శాస్త్రాలను చదివి తదనుగుణంగా సిద్ధాంతీకరణ చేసారు. వారి అంచనాలేవీ క్లిష్టపరీక్షకు నిలబడలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో కమ్యూనిస్టు విప్లవం వస్తుందనీ, కార్మిక నాయకత్వం ఏర్పడుతుందని చెప్పారు. ఇది ఎక్కడా జరగలేదు. ఇందుకు భిన్నంగా రష్యా,చైనా వంటి దేశాలలో కమ్యూనిస్టు విప్లవం వచ్చింది. కార్మిక నియంతృత్వం ఏర్పడలేదు. కమ్యూనిస్టు సమాజంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, రాజ్యం హరించిపోతుందనీ మార్క్స్ చెప్పాడు. అది ఎప్పటికి జరుగుతుందో చెప్పలేదు. కమ్యూనిస్టు దేశాలలో ఈ ధోరణి అమలు జరగటం లేదు. మార్క్సిజం విఫలం కావటానికి పరిస్థితులపై నెపం వేస్తున్నప్పటికీ, అసలు ఎలాంటి శాస్త్రీయ పరీక్షకూ నిలబడే అవకాశం లేదు. మార్క్స్, ఏంగిల్స్ అనంతరం సాపేక్ష సిద్ధాంతం - న్యూక్వాంటం సిద్ధాంతం, పార్టికల్ సిద్ధాంతం, జెనెటిక్స్ (జన్యుశాస్త్రం) వచ్చాయి. వీటన్నిటికి ఆధారాలు రుజువయ్యాయి.