పుట:Abaddhala veta revised.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏది వుందో చూపించే పట్టిక వుండదు, రోగికి వచ్చిన జబ్బు, దానికి హోమియో చికిత్స స్పష్టంగా రాయరు. కనుక ఇతరులకు అది తెలుసుకునే అవకాశం రాలేదు. హోమియోలోనే ఇలాంటి రహస్య చికిత్స కొనసాగుతున్నది!

హోమియో చికిత్స వ్యక్తిగతంగా చేస్తారుగాని. సామాన్య లక్షణాలకు కాదనే వాదన వున్నది. అంటే టైఫాయిడ్ జ్వరం 10 మందికి వస్తే ఒక్కొక్కరికీ ఆయా వ్యక్తిని బట్టి చికిత్స వుంటుందన్నమాట. అందరికీ ఒకే మందు ఒకే పద్ధతి వుండదు. కనుక ఎంతమంది మనుషులున్నారో అన్ని చికిత్సా పద్ధతులుంటాయాన్న మాట. అలాంటప్పుడు హోమియోను రుజువు చేయమనడం ఎలా సాధ్యం? అయినా హోమియో శాస్త్రీయం అని యెందుకంటున్నారు? రోగాల్ని బట్టి ఫలానా మందు వేసుకోండని పత్రికలలో, పుస్తకాలలో చిట్కా వైద్యం యెందుకు ప్రచారం చేస్తున్నారు?

కేవలం హోమియో సూత్రాలకు భిన్నంగా ప్రవర్తించే యీ పద్ధతి వ్యాపార లక్షణమే ఆధునిక వైద్య ఉప్పెనకు తట్టుకోడానికి హోమియో ఏ స్థితికైనా దిగజారుతున్నదన్న మాట. డబుల్ బ్లైండ్ టెస్ట్, రాండం శాంపిల్ పద్ధతులు హోమియోలో కుదరవు! హోమియోపతి ప్రచారకులు యెప్పటికప్పుడు కొత్త యెత్తుగడలతో జనాన్ని మోసం చేస్తూనే వున్నారు. బాగా చదువుకున్నారనుకున్న అమెరికా, యూరోప్ లలోనే యీ మోసాలు చేస్తున్నారు. అలాంటప్పుడు వెనుకబడిన దేశాలు వారికి ఒక లెక్క కాదు.

పారిస్ లోని ఒక హోమియో సంస్థ పరిశోధన పేరిట అనేక కట్టుకథలు అల్లి సుప్రసిద్ధ సైన్సు పత్రిక నేచర్ కు పంపగా, వారు ప్రచురించారు. దీనిపై ఫిర్యాదులు రాగా, ఆ పత్రికవారే ఒక నిపుణుల సంఘాన్ని పంపారు. తీరా విచారిస్తే అంతా మోసం అని తేలింది. పరిశోధనా సంస్థలో హోమియో పేరిట శాస్త్రీయ పద్ధతిలో రుజువు చేశామన్నవారికి ఉద్వాసన పలికారు.

హానిమాన్ తరువాత అంతటివాడని హోమియో వైద్యులు ప్రచారంచేసే జేమ్స్ టైలర్ కెంటే కూడా ఎన్నో కాశీమజిలీకథలు ప్రచారంలోకి తెచ్చి అమెరికాలో హోమియో ప్రచారం చేశాడు. ఆయన రాసిన లెక్చర్స్ అనే హోమియోపతి మెడిసిన్ గ్రంథంపై మార్టిన్ గార్డినర్ వ్యాఖ్యానిస్తూ శాస్త్రీయాధారం ఏకోశానా లేకుండా 982 పేజీలు ఎలా రాసాడా అని ఆశ్చర్యపోయాడు. ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి పేరిట ప్రచారమవుతున్న పుక్కిటి పురాణాలు యిలాంటివేనని ఆయన సబబుగానే విమర్శించాడు. (ఆన్ ది వైల్డ్ సైడ్ - 1992 ప్రామిథియస్ బుక్స్ పుట 39)

హానిమాన్ కాలంలో అలోపతి వైద్యం చేస్తున్న పనుల పట్ల విముఖతతో హోమియో వైద్యం ప్రవేశపెట్టాడు. ఇందులో మోతాదు తగ్గిస్తూ శక్తి పెంచడం అనేది ఆకర్షణీయ విషయం. జంతువులు, మొక్కలు, ఖనిజాలు, రసాయనాల వంటి వాటినుంచి యీ మందులు తయారుచేశారు. ఇందులో కరిగే వాటిని నీళ్ళలోగాని, సారాలోగాని కలిపేవారు. ఒక పాళ్ళు ఔషధం, 99 పాళ్ళ సారా