పుట:Abaddhala veta revised.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హోమియో పేరిట చాలాచోట్ల అలోపతి వైద్యం చేస్తున్నారు. కొన్నిచోట్ల పట్టుబడ్డారు. పాకిస్తాన్ లో దంకాప్ (Dumcap) తయారుచేసి, ఉబ్బసానికి హోమియో చికిత్సగా ప్రచారం చేసి అమ్ముతుంటే పట్టుకున్నారు. (చూడు 1986 ఏప్రిల్ 12 లాన్సెట్ పత్రిక 862-863 పుటలు) హోమియో పేర్కొనే ఔషధాల మోతాదు ఆధునిక రసాయనిక సూత్రాలకు విరుద్ధంగా వుంది. దీనినే అవగార్డొసూత్రం అంటారు. దీని ప్రకారం హోమియో చెప్పే 30X నుండి ఆపైన మోతాదుల్లో దేనిలోనూ మందులేదు చక్కెర, సారా మాత్రమే వుంది. మందు సూక్ష్మరూపంలో వున్నదనీ, అది శాస్త్ర పరికరాలకు అందదనీ హోమియో ప్రచారకులు చెబుతారు. అయినా హోమియో శాస్త్రీయం అంటారు. హోమియో వారే అలా అనగలరు.

హోమియో మందిస్తే రోగలక్షణం ప్రకోపించినట్లుంటే, మంచిదనీ, పెరిగిన తర్వాత తగ్గుతుందని కొందరు ప్రచారం చేస్తారు. ఇది కూడా నమ్మకమే. శాస్త్రీయ పద్ధతికి విరుద్ధమే కాన్సర్, ఎయిడ్స్ వ్యాధులు పెరిగిన తరువాత, తరగవు! తరిగేది మనిషే. అందుకు హోమియో బాధ్యత వహించదు.

కొన్నిటికి హోమియో బాగా పనిచేస్తుందని ప్రచారం చేసేవారున్నారు. కొన్నిటికీ పరిమితమైన చికిత్సా విధానం వుంటుందా! వైఫల్యాలకు ఇదొక ముసుగు. అనేక రోగాలు ఏ మందూ లేకుండా కొన్నాళ్ళకు సర్దుకుపోవడం, తగ్గిపోవడం కద్దు. అలాంటి సమయంలో హోమియో మందు తీసుకొని తగ్గిందంటే,అదే వారి ఖ్యాతిగా మిగులుతుందన్నమాట.ప్రతి చిట్కావైద్యంలోనూ యిలాంటివి వున్నాయి. గుండెపోటు వచ్చినప్పుడు, కలరా వంటి ప్రమాదకర అంటురోగాలు వచ్చినప్పుడు, రోడ్డు ప్రమాదాలలో ఎముకలు విరిగినప్పుడు, మెదడుకు సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు హోమియో చికిత్సకు పరిగెత్తరేం?

హోమియో వలన నాకు తగ్గిందనేవారు సైతం పైన పేర్కొన్న ప్రమాదాలలో అలోపతికి వెడుతున్నారెందుకని? కొందరు హోమియో వైద్యులు సైతం, రోగుల్ని అలోపతికి వెళ్ళమని చెబుతున్నారెందుకు? ఇవన్నీ చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయాలు. వైద్యం మనిషి ప్రాణానికి సంబంధించింది. దానితో హోమియో చెలగాటమాడుతున్నది. అందుకే అది అమానుషం. హోమియో మందులు ప్రమాదకరమైనవి కావనీ సైడ్ ఎఫెక్ట్స్ వుండవనీ, తగ్గితే సరేసరి, తగ్గకుంటే మందువల్ల హాని లేదనే ప్రచారం కూడా వుంది. ఇది మరీ మోసం. సీరియస్ జబ్బులలో సరైన సమయానికి వైద్యం లేకుంటే ప్రాణాపాయం వస్తుంది. హోమియో చౌకగా లభిస్తుందనీ, ప్రమాదం లేదనీ చికిత్స ప్రారంభిస్తే మనిషి చనిపోయే అవకాశం వుంది.

హోమియో వల్ల ఏదైనా ప్రమాదం వచ్చినా వైద్యులు ఎలాంటి చిక్కూ లేకుండా తప్పించుకుంటున్నారు. జీవిత ఆరోగ్య బీమా హోమియోలో లేదు. మందులో మందులేదు గనుక ఏ మందు యిస్తే రోగికి చిక్కువచ్చిందో తెలియదు. హోమియో మందులలో ఏ పాళ్ళలో