పుట:Abaddhala veta revised.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హోమియో వైద్యాన్ని ప్రవేశపెట్టిన హానిమన్ (1755-1843) తొలుత అలోపతి డిగ్రీ పొందాడు. ఆనాడు రోగాలకు హెచ్చు మోతాదుల్లో మందులివ్వడం పట్ల హానిమన్ అభ్యంతరపెట్టాడు. తన డిగ్రీ చదువును వదిలేసి హోమియో పద్ధతి పరిశీలించి, చిన్న మోతాదుల్లో మందులివ్వాలని, రోగలక్షణం ఔషధ లక్షణం ఒకటే అయినప్పుడు చికిత్స కుదురుతుందన్నాడు. మందులలో మోతాదు తగ్గిస్తూ పోవడంతోబాటు, వాటి శక్తి పెంచే రీతి కూడా పేర్కొన్నాడు. హోమియో సూత్రాలను క్రోడీకరించాడు. ఔషధ లక్షణాలు గ్రంథస్తం చేశాడు. ఇవన్నీ ఒక వైపున చేస్తూనే, ప్రతి మనిషికి జీవశక్తి(వైటలిజం) వుంటుందని హానిమన్ నమ్మాడు.

మనుషులందరి లక్షణాలను మూడు రకాలుగా వర్గీకరించాడు. సిఫిలిస్, సోరా, సైకో అనే యీ లక్షణాలకుగాని, జీవశక్తికిగాని, సూక్ష్మీకరించే మందులలో శక్తి పెరుగుతుందనడంలో గాని ఎక్కడా శాస్త్రీయ పద్ధతి లేదు. శాస్త్రీయ పరిశోధనలకు హానిమన్ తన సూత్రాల్ని పరీక్ష పెట్టలేదు. ఒక మహర్షి వలె చెప్పి, ప్రవర్తించాడు. మూలపురుషులంతా అంతేనేమో.

హానిమన్ రుజువులనేవి శాస్త్రీయ పద్ధతికి నిలబడేవి కావు. అలాగే ఆయన శిష్యులు చెప్పిన రుజువులు కూడా రుజువులు కావు. వాటిని అనుభవాలు అంటే సరిపోతుంది. వ్యక్తిగత అనుభవాలను శాస్త్రీయరంగంలో పరీక్షకు పెట్టిన ఉదాహరణలు ఎన్నోవున్నాయి. శాస్త్రీయ పద్ధతి తెలిసినవారు అలా చేస్తారు. సింకోనా బెరడు నోట్లో వేసుకుంటే చలి ఒణుకు మొదలైన మలేరియా లక్షణాలు హానియన్ కు వచ్చాయట. అదే ఆయన రుజువుగా పేర్కొన్నాడు. దీనిపై సిద్ధాంతీకరించి, ఆచరణకు పూనుకున్నాడు. కాదన్న వాళ్ళని తిట్టాడు. మత ప్రచారకుడివలె అసహనం ప్రదర్శించాడు. కొత్త పద్ధతి కొందర్ని ఆకర్షించగా, జనాకర్షణను హానిమన్ తెలివిగా వాడుకున్నాడు. హోమియో వైద్యం తొలుత అంతగా సఫలం కాకపోయినా రానురాను ప్రచారం ప్రబలి, డబ్బు సంపాదన జరిగింది.

జర్మనీలో హానిమన్ హోమియో పలుకుబడితో ముందుకు పోతుండగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన చికిత్స చేసిన యువరాజు షవార్జన్ బర్గ్ (Schwartzenberg) 1819లో చనిపోయాడు. జనం రెచ్చిపోయి, హానిమన్ పుస్తకాల్ని,మందుల్ని తగలబెట్టారు. అంతటితో జర్మనీ వదలి, ఫ్రాన్స్ పారిపోయి, అక్కడ ఒక సంపన్న యువతిని పెళ్ళాడాడు. హోమియో వైద్యులకు ఆదర్శప్రాయమైన పనికూడా హానిమాన్ చేపట్టాడు. పలుకుబడిగల ప్రభు వర్గాలనే ఆయన ఆశ్రయించి వారి అండదండలతో తన వృత్తి ప్రాబల్యాన్ని పెంచుకునేవాడు. గ్రాండ్ డ్యూక్ ఫెర్డినాండ్ అండతో అలా కొనసాగాడు. 80వ సంవత్సరంలో తనకంటె 45 సంవత్సరాల తక్కువ వయసు గల ఫ్రెంచి సంపన్న యువతిని పెళ్ళాడిన హానిమన్ బాగా డబ్బు కూడా ఆర్జించాడు.

హానిమన్ సూత్రాలు అన్వయించి రోగాల్ని నయం చేయడం, కనీసం తగ్గించడం,