పుట:Abaddhala veta revised.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాకుండా చేయడం సాధ్యం కాదని ఆయన బ్రతికుండగానే నిర్ధారణ అయింది. యూరోప్ దేశాలలో, కలరా, ఇన్ ఫ్లూయంజా, రక్త విరేచనాలు, ఎల్లో ఫీవర్, ప్లేగు మొదలయినవి రావడమే గాక, లక్షలాది ప్రజలు తుడుచుకపోయారు. హానిమాన్ చనిపోయేనాటికి ఆధునిక అలోపతి వైద్యం బాల్యదశలో వుంది. ఆ తరువాతే అనేక విధాల అది పెంపొందింది.

హోమియో చుట్టూ చాలా ఆకర్షణీయ కథలు, చిత్రవిచిత్రాలు అల్లారు. కొందరు జ్యోతిష్యానికి ముడిపెట్టారు. ఆర్సనిక్,బెల్లడోనా వంటి ఔషధాలకు వ్యక్తిత్వ లక్షణాలున్నాయన్నారు. పెట్టుబడి అంతగా అవసరం లేని గిట్టుబాటు వ్యాపారంగా హోమియోపతి చాలా మందికి అక్కరకొస్తుంది కనుక హోమియోను శాస్త్రీయం కాదన్నా, రుజువు చేయమన్నా కోపం వస్తున్నది. గ్రామాల్లో సైతం చదువు అట్లే రానివారుకూడా చిట్కావైద్యంగా హోమియోను ప్రయోగిస్తున్నారు. హోమియో వైద్యుడికి అర్హతలు, డిగ్రీలు, అనుభవం అక్కరలేదు. పత్రికలలో చదివి, పొది పట్టుకొని వైద్యం చేస్తున్నవారున్నారు తగ్గితే తమ గొప్పతనంగానూ, తగ్గకుంటే రోగి కర్మగానూ చెప్పవచ్చు ఇదీ హోమియో పేరిట జరుగుతున్న తంతు.

హోమియోపతి శాస్త్రీయం అని చెప్పేవారు జీవశక్తి (Vital Force) ని ఎలా నమ్ముతారో వివరించవలసి వుంది. జీవశక్తి పనిచేసే తీరులో గందరగోళం ఏర్పడితే, రోగ లక్షణాలు వస్తాయని దీనికి చికిత్స చేసి, సామరస్యత ఏర్పరచాలని వారు నమ్మి రాశారు. ఇది శాస్త్రీయ పరిశోధనలో యిముడుతుందా?

హానిమాన్ పేర్కొన్న హోమియో మూలసూత్రాల్ని (ఆర్గానన్)శాస్త్రీయ పరీక్షకు పెట్టారా? రుజువయ్యాయా? రుజువు కానివి ఏవైనా వున్నాయా? ఉంటే వాటిని తృణికరించారా? శాస్త్రీయ పద్ధతిలో తప్పొప్పులు దిద్దుకుంటూ ముందుకు పోయే ధోరణి వుంది గదా. హోమియోలో ఏవి యింత వరకు తప్పు తేల్చారు? శాస్త్రీయ పద్ధతికి గురిచేసినట్లు ఆధారాలు ఏవి? మన దేశంలో హోమియోను శాస్త్రీయ పరీక్షకు గురిచేసిన ఆధారాలు మచ్చుకు ఒక్కటి చూపగలరా?

వ్యాదినిరోధకశక్తి (ఇమ్యునైజేషన్) సూత్రాన్ని అలోపతి కూడా చెబుతున్నది. హోమియో పేర్కొనే సారూప్య సిద్దాంతం కూడా ఇదే అని అసలు మూలసూత్రం హోమియోదే నని ప్రచారం చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. అలోపతి యిచ్చే టీకాలమందు హోమియో పేర్కొనే పలచబరిచిన ఔషధం కాదు. టీకాల మోతాదు తగ్గిస్తే ఫలితం రాదు. టీకాలమందు పలచబరిస్తే పనిచేయదు. శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచడానికి,రోగక్రిముల్ని చంపేయడానికి తగిన మోతాదుల్లో మందు ఎక్కిస్తారు. కనుక హోమియో సూత్రానికి భిన్నంగా టీకాల వైద్యం సాగుతున్నది. అది బాగా పనిచేస్తున్నట్లు రుజువైంది. అంటురోగాలతో లక్షలాది మంది తుడిచిపెట్టుకపోకుండా టీకాల వైద్యం ఆపింది. పోలియోవంటి వ్యాధులు రాకుండానూ టీకాలవైద్యం తోడ్పడింది.