పుట:Abaddhala veta revised.pdf/365

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
హోమియో సాంఘిక నేరమా? అమానుషమా?

అలోపతి (ఆధునిక విజ్ఞానిక వైద్యం) తప్పులు చేస్తుంది. తప్పులు ఒప్పుకుంటుంది. దిద్దుకుంటుంది. మానవుడికి మేలు చేయాలనే దీక్షతో అనేక పరిశోధనలు చేస్తుంటుంది. ఇది అనంతం. నిత్యకృత్యం. తాను చెప్పిందే వేదం అనదు. తన జ్ఞానం సంపూర్ణం అనదు. విమర్శలు స్వీకరిస్తుంది సహనం ప్రదర్శిస్తుంది. ఆ విధంగా ఆధునిక వైద్యం(అలోపతి) దినదినాభివృద్ధి చెందుతూనే వున్నది. ఇతర శాస్త్రీయ పరిశోధనా ఫలితాలను వైద్యరంగంలోకి స్వీకరిస్తుంది. దుష్పరిణామాలను తొలగించడానికి, తగ్గించడానికి చేతనైన ప్రయత్నం చేస్తుంది. పరీక్షలు జరిపి, తద్వారా చికిత్స చేస్తుంది. నమ్మకాలు విశ్వాసాలు ఆధారంగా వైద్యం తలపెట్టదు. ఇది శాస్త్రీయ పంథా. అలోపతి వైద్యం మానవులందరికీ సామాన్యమైంది. రష్యాలో, చైనాలో, అమెరికాలో ఎక్కడ వైద్యం కనిపెట్టినా అది ప్రపంచమంతటా దాపరికం లేకుండా వ్యాపిస్తుంది. మానవుల సొత్తుగా అలోపతి వైద్యం పరిణమించింది.

డాక్టర్లు తప్పులు చేస్తే అడిగే హక్కు,పరిహారం కోరే అవకాశం రోగులకు అలోపతిలో వుంది. వైద్యభీమా పద్ధతులు అమలులో వున్నాయి. రోగికి ఏమేమి మందులు ఎలా యిచ్చారో, చికిత్స ఎలా జరిపారో రికార్డు చేస్తారు. దీనివలన తప్పులు దిద్దుకునే అవకాశం లభిస్తుంది.

అంటురోగాలతో లక్షలాది చనిపోవడాన్ని ఆపింది అలోపతి మాత్రమే. అంతుబట్టని రోగాలను పరిశీలించి, పరిశోధనలు జరుపుతున్నది, అలోపతి వైద్యంలోనే సాధ్యం. ఇతర వైద్య విధానాల జోలికి అలోపతి వెళ్ళదు.

హోమియోపతి వైద్యం జర్మనీలో హానిమన్ అనే వైద్యుడు ప్రవేశపెట్టి, ప్రచారం చేశాడు. ఆయన బ్రతికుండగానే హోమియోపతి చిట్కా వైద్యమా కాదా అనే చర్చ ఆరంభమైంది. అ ది నేటికీ కొనసాగుతున్నది.

ఆధునిక వైద్యాన్ని (అలోపతి) తీవ్రంగా విమర్శిస్తూ హోమియో ప్రచారంలోకి వచ్చింది. హానిమన్ ఆరంభించిన యీ ప్రక్రియను హోమియో వైద్యులు విస్తృతంగా వాడుకుంటున్నారు.

హోమియోశాస్త్రీయమా కాదా, అనేది హేతువాదులు, మానవవాదులు శాస్త్రజ్ఞులు చేబట్టిన అంశం. ప్రపంచవ్యాప్తంగా యీ విషయమై పరిశోధన సాగింది. హోమియో శాస్త్రీయమేనని హోమియోపతి వైద్యవృత్తిలో వున్నవారు చెబుతూనే వున్నారు. ఆధారాలేమిటి అన్నప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నారు. హోమియో సూత్రాల్ని, మందుల్ని, చికిత్సను శాస్త్రీయ పరిశోధనకు పెట్టిన శాస్త్రజ్ఞులకు ఇది సైంటిఫిక్ అని ఆధారాలు ఎక్కడా అభించలేదు. శాస్త్రీయమని కొందరు హోమియోవాదులు ఇచ్చిన సాక్ష్యాధారాలు తప్పుడువని రుజువైంది. శాస్త్రీయ పద్ధతిని అనుసరించే యూరప్, అమెరికా వంటి చోట్ల హోమియో క్షీణించింది. వెనుకబడిన దేశాలలో హోమియో ఇంకా ప్రచారంలో వుంది.