పుట:Abaddhala veta revised.pdf/364

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

హోమియో చికిత్సకు ఇన్సూరెన్స్ లేదు. అలోపతికి వున్నది. ఎందుకని? హోమియో చికిత్సలో ఏ ఔషధాలు యిస్తున్నారో రోగికి చెప్పరు. ఎందుకని? హోమియోలో వైఫల్యాలు బయటపెట్టరు. తగ్గినవి మాత్రం బాగా ప్రచారం చేసుకుంటారు. లైసెన్స్ లేని హోమియో డాక్టర్లను నిర్బంధించమని కోరరు. అదంతా అమానుష ప్రక్రియే.

హోమియో చికిత్సలో మనిషి ముఖ్యం కాదు. తగ్గకపోతే, ముదిరిన తరువాత వచ్చావంటారు. అలోపతిలో అంతా చెడగొట్టుక వచ్చావంటారు. చనిపోతే, అసలు బాధ్యత వహించరు. కిక్కురుమనరు. అందుకే యిది అమానుష వైద్యం. వైఫల్యాలను స్వీకరించి, నిరంతర పరిశోధన జరిపి, మనుషుల్ని కాపాడటానికి కృషిచేస్తేనే వైద్యం శాస్త్రీయం అవుతుంది. వేదప్రమాణంవలె, హానిమన్ ఆరాధ్యుడంటూ జీవశక్తి నమ్మకాలతో, మనుషుల్ని హతమార్చడం మంచిదికాదు. రోగాల్ని ఎదుర్కొని, నయం చేసుకునె గుణం దేహానికి వుంది. హోమియోవారు ప్రచారం చేసుకుంటున్నారు. డాక్టరుపై విశ్వాసంతో పనిచేసే తీరువుంది. అదికూడా ప్లాసిబో ప్రభావంగా పేర్కొనక హోమియోవారు వ్యాపారం చేసుకొంటున్నారు. ఆరోగ్యవంతులకు హోమియో బాగా పనిచేస్తుందన్నమాట!

హార్ట్ ఎటాక్ వస్తే హోమియోకు పరిగెత్తం. అంటురోగాలొస్తే హోమియో కోసం వెళ్ళం. అలాంటప్పుడు హోమియో స్వీకరిస్తే ఫామిలీ ప్లానింగ్ వారికీ ఇక ప్రచారం అక్కరలేదు. అలోపతి పూర్తిగా నిషేధిస్తే, హోమియో మాత్రమే వుండాలంటే, జనాభా సమస్య దెబ్బకు తీరుతుంది!

ఇంతకూ మన ప్రశ్న అలాగే మిగిలింది. హోమియో శాస్త్రీయమని ఇండియాలో ఏమిటి రుజువు? ఒక్క ఉదాహరణ చూపమనండి విమర్శలు మానేద్దాం.

హోమియో శాస్త్రీయమని రుజువు చేయడానికి కంట్లోల్డ్ పరిశోధన గాని, డబుల్ బ్లయిండ్ టెస్ట్ గాని చేశారా? చెస్తే ఎవరు? ఎక్కడ? వివరాలేమిటి? ఒక ఆధారం ఇండియాలో చూపమనండి.

అమెరికాలో హ్యూమనిస్టులు ఒక నిపుణుల సంఘం నియమించారు. దానికి స్టీఫెన్ బారట్ అధ్యక్షులు. ఆయన ఆధ్వర్యాన జరిగిన పరిశీలనల ఫలితంగానే హోమియో శాస్త్రీయం కాదని తేలింది. మనుషుల ప్రాణాలతో ఆడుకోవద్దని వారు హెచ్చరిస్తున్నారు. సొంతవైద్యం చేసుకోమనే హోమియో ప్రచారం మరీ అమానుషం, బాధ్యతారహితం, అశాస్త్రీయం.

- హేతువాది, అక్టోబరు 1992