పుట:Abaddhala veta revised.pdf/363

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సైన్స్ రచయిత మార్టిన్ గార్డినర్ హోమియో మోసాల్ని, అశాస్త్రీయతను ఎండగట్టాడు. కేన్సర్ వంటి రోగాల్ని నయం చేస్తామంటూ జనాన్ని చంపుతున్న ఉదాహరణలు చూపాడు.

హోమియోపతి డాక్టర్లు విమర్శలకు సమాధానాలు చెప్పలేక, శాస్త్రీయం అని రుజువు చేయలేక, వీధినబడి తిట్లకు లంకించుకున్న ఉదాహరణలు గార్డినర్ ఉదహరించాడు.

బెన్ వెనిస్టి పరిశోధనలు బోగస్ అని తేలేసరికి, హోమియో సంస్థ అతన్ని 1989లో సస్పెండ్ చేసింది.

హోమియో అద్యంతాలు మోసంతో కూడిన, అర్థంలేని వైద్యవిధానంగా గార్డినర్ చిత్రికబట్టాడు, జేమ్స్ టైలర్ కెంట్ ను, హోమియో వారంతా హానిమన్ తరువాత, మహాత్మునిగా ఆరాధిస్తారు. ఆయన రాసిన లెక్చర్ ఆన్ హోమియోపతిక్ మెడిసన్ అనే 982 పేజీల గ్రంథం అయోమయపు అశాస్త్రీయ పులుముడు అని గార్డినర్ విమర్శించాడు. కెంట్ రచనలో ఏ పేరాకూడా సాక్ష్యాధారాలకు నిలబడదన్నాడు. (గార్డినర్ ఆన్ ది వైల్డ్ సైడ్ 1992 పుట 39)

హానిమన్ "జీవశక్తి"ని నమ్మాడు. హోమియో శాస్త్రీయం అనేవారు దీనిని ఎలా రుజువు చెస్తారు?

హోమియో పేరిట, పుస్తకాలు చదివి, జనానికీ మందులిస్తూ, వారికి నయం చేశాం, వీరికి ఇంగ్లీషు మందుల ద్వారా తగ్గనిచోట హోమియో ద్వారా తగ్గించాం, అని ప్రచారం చేసేవారున్నారు. అమెరికాలో ఇలా చేసిన వారిని పట్టుకొని జైల్లో వేశారు. ఫ్లారిడా రాష్ట్రంలో 1985లోనే ఇది జరిగింది. అలాంటి స్థితి మనదేశంలో ఎప్పుడు వస్తుందో మరి!

హోమియో డాక్టర్లు సెనేటర్లను పట్టుకొని హోమియో లైసెన్సు బోర్డులు ఏర్పరచడానికి అమెరికాలో ప్రయత్నిస్తున్నారు. శాస్త్రీయం అని రుజువుపరచలేకపోయినా, ఇలాంటి లాబీ చేయడంలో వారు సుప్రసిద్ధులు. మనదేశంలో కూడా ఇదే తంతు. కీలకస్థానాల్లో వున్నవారిని పట్టుకొని హోమియోకు నిధులు సమకూర్చుకోవడం ఆనవాయితీ అయింది. శాస్త్రీయమని బోకరించడం తప్ప. ఒక్క ఆధారం కూడా చూపని వారికి ఆగ్రహం రావడం సహజం. వృత్తి దెబ్బతింటుంది గనుక యిది అర్థం చేసుకోవచ్చు.

వైద్యరంగంలో ఏ చట్టమూ హోమియోకు వర్తించరాదంటున్నారు. అలాచేస్తే హోమియో నిలబడదు. కాబట్టి పైరవీలు (సిఫారసులతో), ప్రచారంతో పత్రికలలో వచ్చి అబద్ధాలతో ప్రాకులాడుతున్నారు. అమాయక జనాన్ని మోసం చేస్తున్నారు. అలోపతి వైద్యరంగంలోని విషయాల్ని తెలివిగా హోమియో ప్రచారానికి వాడుకుంటుననరు.

విదేశాల్లో విమర్శలు తట్టుకోలేక, శాస్త్రీయం అని రుజువుపరచే ప్రయత్నాలన్నా చేశారు. మనదేశంలో అలాంటి ప్రయత్నం అసలే లేదు.