పుట:Abaddhala veta revised.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరైనదైతే, హోమియో శాస్త్రీయంగా రుజువైనట్లే. హోమియో ఔషధాలలో మందు వున్నట్లు రుజువు కాకున్నా, దాని శక్తి పనిచేస్తుందన్నమాట.

నేచర్ పత్రిక, వ్యాసమైతే ప్రచురించింది. కాని ఎంతో విమర్శ ఎదుర్కోవలసివచ్చింది. ఈ పరిశోధనలో సత్యాసత్యాలను తెలుసుకోడానికి నేచర్ పత్రిక సంపాదకుడు జాన్ మాడోక్స్, మేరీలాండ్ జాతీయ ఆరోగ్య సంస్థలోని జీవరసాయన శాస్త్రజ్ఞుడు వాల్టర్ స్టేవర్డ్, సుప్రసిద్ధ హ్యూమనిస్టు మాంత్రికుడు జేమ్స్ రాండి వెళ్ళారు. వారు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

డాక్టర్ జాక్ బెన్ వెనిస్టి పరిశోధనలు అంకెలదోషాలతో వున్నాయి. పరిశోధన మళ్ళీ మళ్ళీ జరిపే తీరులోలేదు. దోషాల్ని తొలగించే తీరు అమలుపరచలేదు. శాస్త్రీయ పరిశోధనకు నిలబడే స్థితి ఎక్కడా కనిపించలేదు. హోమియో మందులు తయారుచేసే కంపెనీలో ఇద్దరు కూడా బెన్ వెనిస్టి పరిశోధకులలో వున్నారని తెలిసింది. పరిశోధన పేరిట వీరు చేసిన పనికి ఆ కంపెనీ ఖర్చులు భరించింది. దీనిపై వ్యాఖ్య అనవసరం.

సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు డా॥స్టీఫెన్ బారెట్ యీ విషయాలన్నీ పరిశోధించి కన్సూమర్ రిపోర్ట్స్ లో (1987 జనవరి) ఇలా రాశాడు. "హోమియో ఔషధాలు శారీరకంగా ప్రభావం చూపలేనంత పలచబడి వున్నాయి. వైద్యశాస్త్రం ప్రకారం యీ ఔషధాలు అర్థంపర్థం లేనివి. ఇందులో ఎలాంటి వసలేదని, పనిచేయవని అమెరికాలో 49 ఫార్మసీస్కూల్స్ ఫాకల్టీ సభ్యులు పేర్కొన్నారు. రోగాలు వాటంతట అవే కుదురుకునే సందర్భాలలో పంచదార మాత్రల ప్రభావం మాత్రమే హోమియో ఔషధాలకు వుంటుంది. అలాంటి ఔషధాలు, డిగ్రీలున్న డాక్టర్లు వాడినా, చిట్కావైద్యులు వాడినా రోగులకు ప్రమాదమే. రోగి ఒకపక్క జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతుంటే, పనిచేయని ఔషధాలు యివ్వడం ప్రమాదం. హోమియో ఔషధాలు ప్రయోగించడం హానికరం. సొంతవైద్యం మరీ యిబ్బంది. జబ్బు విపరీతంగా వున్నప్పుడు, నొప్పి ఏమిటో తెలియకుండానే మాత్రలిచ్చే హోమియో చికిత్స వలన రోగి చనిపోవచ్చు. కేన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులకు హోమియో ఔషధాలు యివ్వరాదని కూడా 1988లో ఫెడరల్ డ్రగ్ సంస్థ ఆదేశించింది.

శాస్త్రీయం అని రుజువుపరచలేక, హోమియో డాక్టర్లు చౌకబారు రచనలతో, కరపత్రాలు, పుస్తకాలతో జనాన్ని ఆకట్టుకుంటున్నట్లు స్టీఫెన్ బారెట్ విమర్శించారు.

హోమియో మందుల్ని ఎలాంటి శాస్త్రీయ పరిశీలన లేకుండానే సరాసరి జనానికి అమ్మడం,మందులో ఏముందో చూపకపోవడం కూడా విమర్శలకు గురైంది. మనుషులకు యిచ్చే ఔషధాలు ఫెడరల్ డ్రగ్ నియమాల్ని పాటించకపోవడం, అమానుషచర్యగా భావిస్తున్నారు. ఎవరికి వారు హోమియో డాక్టర్లుగా ముద్రవేసుకొని, జనాన్ని దోచుకుంటూ,డబ్బుచేసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది.