పుట:Abaddhala veta revised.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొత్తం బంగారం చేయడం అనేది ఒక ఆశగానే మిగిలింది. కొలిమిని వాడి ఒక లోహాన్ని మరొక లోహంగా మార్చే మోటుప్రయత్నాలు చిరకాలం చేసి వూరుకున్నారు. న్యూక్లియర్ ఫిషన్ పద్ధతిలో ఇతర లోహాల నుండి బంగారం చేయవచ్చు. దీనికి అయ్యే ఖర్చు బంగారానికి మించి చాలా అవుతుంది. పూర్వం బంగారం చేయడానికి ముడిసరుకుగా ఇనుమును, మరోలోహాన్ని (పాదరసం, సీసం) అమ్లాన్ని కలిపేవారు. బాగా కొలిమిలో వేడిచేసి చల్చార్చేవారు. ఇలా చేయడంలో విషవాయువులు రావడం, చీకటి గదుల్లో జబ్బులకు గురికావడం, ఒక్కోసారి చనిపోవడం కూడా జరుగుతుండేది. కొందరు పిచ్చెక్కి తిరిగిన ఘట్టాలు లేకపోలేదు. ముడిసరుకును కలపడం, వేడి చేయడం, ఆరబెట్టడం, ఆమ్లంలో ముంచడం, వెన్నెలలో, సూర్యరశ్శిలో బంగారం తయారవుతుందని పడిగాపులు కాచి, నిరాశ చెందడం జరిగిన ఘట్టాలే. ఆమ్లంలో ముంచి కరిగించిన ముడిసరుకును ఆవిరి అయ్యేట్లు చేసి ఇదంతా జరగడానికి నెలలు,ఒక్కోసారి సంవత్సరాలు పడుతుండేది. ఓపికగా బంగారం వస్తుందనే అత్యాశతో యీ క్రమం పాటిస్తుండేవారు. చాలామంది యీ పద్ధతుల్లో హతమయ్యారు. ఉత్తరోత్తరా పొటాషియం నైట్రేట్ ను కొలిమి నుండి బయటకు తీసిన ముడిసరుకుకు కలిపేవారు. తుదిదశలో ముడిపదార్థాన్ని పేటికలో అమర్చేవారు. తరువాత చేయగలిగిందల్లా ఎదురుచూడటమే. ఏ దశలోనూ ఎవరికీ బంగారం రాలేదు. ఎన్ని మంత్రతంత్రాలు, రహస్య కార్యకలాపాలు సాగించినా నిరాశే మిగిలింది. ఆధ్యాత్మిక విద్యగా పవిత్ర చర్యగా బంగారం చేయడాన్ని చూచినా ఫలితం మాత్రం శూన్యం. సుప్రసిద్ధ మనోవిజ్ఞాని కార్ల్ యూంగ్ కూడా బంగారం చేసే విద్యలో నమ్మకం వుంచి, దానికి ఏవేవో మానసిక రీతుల్ని చెప్పేవాడు. మూకమనస్తత్వం అనే పదాన్ని వాడాడు. కలల్లో కనిపించే ఆశల్ని నిజం చేయడానికి మూకమనస్తత్వం, సామూహిక అచేతనం అన్వయిస్తారని చెప్పాడు. ఇవన్నీ కేవలం మాటలు తప్ప, అర్థాలు లేనివే.

బంగారం చేయడం సాధ్యమేననీ, ఆధునిక, భౌతిక, క్వాంటం సిద్ధాంతాల ఉదాహరణలు అందుకు సాక్ష్యమనీ కొందరు నమ్మకస్తులు అంటుంటారు. కాని ఆధునిక విజ్ఞానంలో అంచనాలు, పరిశోధనలు, ఫలితాలు అన్నీ రుజువుకు నిలిచాయని వీరు విస్మరించారు.

న్యూటన్ వంటి శాస్త్రజ్ఞులు కూడా బంగారం చేసేవిధానాల పట్ల ఆసక్తి కనబరచినా,అది రహస్యంగానే అట్టి పెట్టారు తప్ప,బయటకు చెప్పలేదు. రుజువుకు నిలవకపోవడమే యీ రహస్యానికి కారణం. నా యిష్టం నేను నమ్ముతాను అంటూ బంగారం తయారుచేయవచ్చు అనే వారిని అలా వదిలేయాల్సిందే.

- వార్త, 24 ఫిబ్రవరి,2002