పుట:Abaddhala veta revised.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేకుండా రాజకీయమే వృత్తిగా పెట్టుకున్నప్పుడు, తాను బతకడం ఎలా, కుటుంబాన్ని పోషించడం ఎలా అనే సమస్య వస్తుంది. మనదేశంలో రాజకీయమే వృత్తిగా గలవారు ప్రజలపైనే ఆధారపడుతున్నారు. ప్రకాశం కూడా ఆ కోవలో చేరాడు. "నేను సంపాదించినదంతా ఖర్చుపెట్టాను. కాబట్టి దేశం మీదబడి ఎంత వసూలు చేసినా ఫరవాలేదు" అనే ధోరణి అవలంబించిన ప్రకాశం చాలా బాధ్యతారహితంగా రాజకీయాలలో నీతి, అవినీతి అనే గీటురాయి లేకుండా చేశాడు. ఇటువంటి ధోరణిని ఎవరు అవలంబించినాసరే మంచిదికాదని డాక్టర్ లోహియా ఖండించాడు.

మద్రాసుకు సైమన్ కమిషన్ రాక సందర్భంగా ప్రకాశం పాత్ర గురించి చాలా మంది రాశారు.

కాని ప్రకాశంగారు 'నా జీవితయాత్ర'లో రాసిన విషయాలు గమనించాలి. మొదటిసారి సైమన్ కమీషన్ బొంబాయిలో 1928 ఫిబ్రవరిలో అడుగిడినప్పుడు మద్రాసులో నిరసన ఊరేగింపులు జరిపారు. ఆనాడు శ్రీనివాస అయ్యంగారు, వెనుక ప్రకాశంగారూ అనుచరులతో పోతుంటే మెరీనాబీచ్ లో పోలీసులు అటకాయించారు. "ముందడుగు వేయవలసిందనే ఆదేశం కాంగ్రెస్ ఇచ్చి ఉండలేదు. అందుకని కాస్త తటపటాయించా" అని ప్రకాశం రాశారు. (పేజీ 372) ఆ తరువాత సైమన్ కమీషన్ మద్రాసు వస్తున్న సందర్భంగా పూర్తి హర్తాళ్ పిలుపు యిచ్చారు. ప్రకాశం ఆనాడు కారులో బయలుదేరితే బీచ్ లో, మౌంట్ రోడ్ లో, ఫ్లవర్ బజారులో పోలీసులు అడ్డగించారు. ప్రకాశం వెనక్కు వెళ్ళాడేగానీ తుపాకీకి గుండె చూపలేదు. ఆ తరువాత పారిస్ కార్నర్ లో ఒక వ్యక్తి చనిపోయిపడివున్నాడు. అతన్ని చూడటానికి వెళ్ళనివ్వమని ప్రకాశం కోరాడు. "ఒక సిపాయి నా గుండెకు బారుచేసి తుపాకి పట్టుకున్నాడు నాకుదారి యివ్వవలసిందని వానిని నేను కోరాను. మీరు బలవంతంగా వెళ్ళదలిస్తే మేము కాల్చవలసి వస్తుందన్నాడు వాడు. నాపక్కన గుంపులోవున్న ఒక మహమ్మదీయ యువకుడు, ధైర్యం వుంటే కాల్చు. మేమంతా సిద్ధంగా వున్నాం ఆయనెవరో నీకు తెలియదల్లేవుంది" అని అరిచాడు.

"కొద్ది క్షణాల తర్వాత వాడు తప్పుకుని దారియిస్తూ దయయుంచి ఏ గడబిడా చేయవద్దని గుంపును కోరవలసిందని ప్రాధేయపడ్డాడు. నేను వచ్చే వరకూ శాంతంగానే వుండవలసిందని గుంపును కోరి ముందుకు సాగి గుండు దెబ్బలతో పడి వున్న, ఆ మృతదేహాన్ని చూసి, ఆ రోడ్డుకు ఎదురురోడ్డున హైకోర్టు వెనుకభాగాన వున్న ఒక భవనంలో ఆశీనుడయివున్న చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ చూడగోరాను.

ఇది ఆనాడు జరిగింది. టంగుటూరి ప్రకాశం కేంద్ర శాసనసభలో వుండగా మాలవ్యాపార్టీలో చేరాడు. కాంగ్రెసులో ఇమడలేకపోయాడు. అయితే గాంధీజీ పిలుపు ఇచ్చినప్పుడు ఉప్పు సత్యాగ్రహంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ జైలుకు వెళ్ళాడు.

గాంధీజీతోసహా ఎవరినిగురించీ ప్రకాశం మర్యాదగా మాట్లాడేవాడు కాదు. బహిరంగ