పుట:Abaddhala veta revised.pdf/329

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సభలలో వాడు, వీడు అనే పదప్రయోగాలు బాగా చేసేవాడు. శ్రీనివాసయ్యంగార్, రాజగోపాలాచారి గురించి "ఏదో విధంగా బినామీ మంత్రిపదవులనైనా స్వీకరించి తమ వాంఛలను తీర్చుకోవాలనే కోరిక ఆ యిరువురి నాయకులకూ మిక్కుటంగా ఉంది" అని ప్రకాశం రాశాడు. 1927లో సుబ్బరాయన్ మద్రాసులో ఏర్పరచిన మంత్రివర్గ సందర్భంగా ప్రకాశం చేసిన వ్యాఖ్య అది.

గాంధీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడం అవివేకం అనీ, బెల్గాం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీ ఒప్పుకోవడం, మనోదౌర్భల్యం అనీ ప్రకాశం రాశాడు. అంధ్ర కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తే, ముఠా రాజకీయాల పితామహుడు ప్రకాశం అనవచ్చు. ఆయనకు,ఇతర నాయకులకూ తరచు తగాదాలు వచ్చాయి. పట్టాభికి ఈయనకూ శాశ్వత కలహం వుండేది. అలాగే బులుసుసాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య మొదలైనవారితో పేచీలు పడ్డాడు. 1937లో మద్రాసు ప్రధాని కావాలని ప్రకాశం ప్రయత్నించినా, ఆంధ్రులే బలపరచలేదని తెన్నేటి విశ్వనాధం వాపోయాడు.

ఆ ముఠా తగాదాల్ని చివరకు జైళ్ళలో కూడా కొనసాగించారు. మళ్ళీ పదవిని వదల్లేక 1937లో ప్రజాపార్టీ అని పెట్టారు. అక్కడకు వెళ్ళిన ప్రకాశం, రంగాలు అందులో చేరారు. తర్వాత రంగా చీలి వేరే పార్టీ పెట్టారు. 1952 తొలి సాధారణ ఎన్నికలలో ప్రకాశం ప్రతిచోటకూ తిరిగి కాంగ్రెస్ మంత్రుల అవినీతిని బయటపెట్టాడు. వాళ్ళంతా ఓడిపోయారు. మద్రాసు బీచ్ నియోజకవర్గంలో నిలబడి తానూ ఓడిపోయాడు. అప్పట్లో సోషలిస్టులు కలిసి రాగా ప్రజా సోషలిస్టు పార్టీ ఏర్పడింది.

మద్రాసులో మంత్రిమండలి ఏర్పాటు సమస్య వచ్చింది. కాంగ్రెసువారు రాజాజీ కోసం ప్రయత్నించారు. రంగా పార్టీ అందుకు అండగా నిలిచింది. తన రాజకీయ జీవితమంతటా కమ్యూనిస్టులను తిట్టిన టంగుటూరి ప్రకాశం, ముఖ్యమంత్రి పదవి కోసం, ఒక ఫ్రంటు నాయకుడుగా వారితోనే కలిసి మంత్రిమండలి ఏర్పరచాలని విఫలప్రయత్నం చేశాడు. కుటిలనీతి రాజకీయాలలో కాంగ్రెస్ వారే నెగ్గారు. దానితో అప్పటికే 80 సంవత్సరాలు వచ్చిన ప్రకాశం కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రజాసోషలిస్టు పార్టీని తన్నేసి అంతవరకూ కుళ్ళిపోయిందని విమర్శించిన కాంగ్రెసుతోనూ, అవినీతిపరులని తిట్టిన సంజీవరెడ్డి వంటివారితోనూ చేతులు కలిపాడు. అయినా ప్రకాశం ముఖ్యమంత్రి పదవి కర్నూలులో కూడా అట్టేకాలం వుండలేదు.

రాజకీయాలలో నీతి చాలా అవసరం. మానవ విలువలు కావాలి. అవి రెండూ లేనప్పుడు సమాజాన్ని పరిపాలించడానికి అర్హత కోల్పోతారు. ఆంధ్ర రాజకీయాలలో ప్రకాశం ఎటువంటి నైతిక విలువల్ని కూడా చూపలేకపోయాడు. ఇంకా లోతుకు పోతే చాలా విషయాలున్నాయి. అందులో కొన్నిటిని "నా జీవితచరిత్ర"లో ప్రకాశం రాసినప్పటికీ క్రొవ్విడి లింగరాజు, తెన్నేటి విశ్వనాథం కొట్టి వేయించారని తెలిసింది. మున్సిపాలిటీ రౌడీ రాజకీయాలను రాష్ట్రస్థాయికి తెచ్చిన ప్రకాశం - ముఠా నాయకుడుగా తప్ప ఎదగలేకపోయాడు.