పుట:Abaddhala veta revised.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒడిపస్ కాంప్లెక్స్ ప్రకారం తండ్రి పట్ల ద్వేషం, తల్లీ పట్ల కామం వుండాలి. అవి ఒడిపస్ కథలో లేవు. అయినా ఫ్రాయిడ్ ఒడిపస్ కాంప్లెక్స్ సృష్టించాడు. ఒక ప్రాచీన గాథను తన సిద్ధాంతానికి అనుగుణంగా మార్చుకోవడమేగాక, అది శాస్త్రీయమని చెప్పడం ఫ్రాయిడ్ బుకాయింపుతనం. ఇది సైకో ఎనాలసిస్ మూలాధారం. అది ఎవరూ పరీక్షకు పెట్టకుండా చాలాకాలం అంగీకరించడం విశేషం! ఫ్రాయిడ్ వాడి, ప్రచారంలో పెట్టిన సూపర్ ఈగో, ఇద్, ఈగో వంటి పదాలని ఆకర్షణ వున్నదేగాని శాస్త్రీయ పరిశోధనగాని, ఆధారాలతో కూడిన రుజువుగాని లేదు. అయినా కథకుడువలె ఫ్రాయిడ్ తరచు యీ పదజాలాన్ని వాడుతూ పోయాడు. అలా వాడగా, అదే నానుడిగా మారి, మూలాధారణ ఏమిటో అని అడగడం మరచిపోయారు జనం.

స్త్రీలు-ఫ్రాయిడ్

స్త్రీల పట్ల ఫ్రాయిడ్ ధోరణి, అవగహన అశాస్త్రీయతకు పరాకాష్ఠ. ఆడపిల్ల పెరగడంలో ఆమె లైంగికంగా చిదికిపోవడం పెద్దమలుపు అంటాడు. పిల్లలు పుట్టించకుండా ఎద్దుకు వట్ట చితకకొడతారు. అలాగే పురుషాంగం స్త్రీలలో చితికిపోవడమే స్త్రీ లైంగిక లోపంగా ఫ్రాయిడ్ చిత్రించాడు. లైంగిక లోపాన్ని కప్పిపుచ్చుకోవడం స్త్రీ జీవిత పర్యంతం అవస్థగా మారిందంటాడు. మిగిలిన విషయాలలో మాత్రం స్త్రీకి వ్యక్తిగా గౌరవం వుంటుందన్నాడు. సెక్స్ సిద్ధాంతాలకు ఆద్యుడు, మూలపురుషుడు అని భ్రమపడేవారు తెలుసుకోవాల్సిన సత్యమిది. స్త్రీ పురుషుల మధ్య సెక్స్ సంబంధంలో ఆప్యాయతలు, ప్రేమ, వ్యక్తిత్వ వెల్లడి వంటివేమీ ఫ్రాయిడ్ దృష్టిలో లేవు.

ఆద్యంతాలూ యూదు జాతీయత

తన స్వీయగాథలలో ఫ్రాయిడ్ రాస్తూ తాను యూదుగానే వున్నానన్నాడు. అబ్రహాం, ఫెరెంకిలకు రాసిన ఉత్తరాలలో కూడా తన జాతీయతత్వం గట్టిగా చెప్పాడు. మనోవిశ్లేషణ ఉద్యమాన్ని, చికిత్సను, సిద్ధాంతాన్ని వ్యతిరేకించడాన్ని, విమర్శించడాన్ని యూదు వ్యతిరేకతగా ఫ్రాయిడ్ చూపిన సందర్భాలు లేకపోలేదు. యూదులలో మార్మిక దృష్టి లేదనీ, కనుక వైజ్ఞానిక దృష్టికి వారు బాగా పనికొస్తారని ఫ్రాయిడ్ ఉద్దేశం.

ఫ్రాయిడ్ పలుకుబడి, బహుళ ప్రచారం వల్ల అతడి సిద్ధాంతాన్ని ఆనాడు ఎవరూ టెస్ట్ కు పెట్టలేదు. సైంటిఫిక్ కాదను ఎవరైనా అంటే, విరుచుకుపడడం తప్ప, శాస్త్రీయ సమాధానం ఎన్నడూ రాలేదు. మతాలలో ఆత్మను అడ్డం పెట్టుకున్నట్లే, మానసిక రంగంలో సైకో ఎనాలసిస్ కారుడు అవ్యక్తం, ఉపవ్యక్తం వంటి పదాలను కవచాలుగా వాడారు. అది ఫ్రాయిడ్ ప్రచార సాధనం. అదే ప్రచార గొప్పతనం. ఫ్రాయిడ్ పై చాలా పరిశోధనలు జరిగాయి. అందులో థామస్ సాజ్ అతిముఖ్యమైన విమర్శలు చేశాడు. ఈ రచనకు ప్రధానాంశాలు అతని రచనల నుండి స్వీకరించాను. ఫ్రాయిడ్ సైకో ఎనాలసిస్ చికిత్సా విధానాన్ని అక్షరాలా పాటించడం మానేశారు.