పుట:Abaddhala veta revised.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలా మార్పులు వచ్చాయి. వాషింగ్టన్ సెయింట్ ఎలిజబెత్ సైకియాట్రి ఆస్పత్రిలో యీ విషయాలు గమనించాను. థామస్ సాజ్ ను సిరక్యూస్ విశ్వవిద్యాలయంలో (న్యూయార్క్ రాష్ట్రం, అమెరికా) కలిశాను. ఆయన పుస్తకాలు, వ్యాసాలు గమనించాను. ఫ్రాయిడ్ శిష్యులు కూడా అనేక మార్పులు చేశారు. ఎరిక్ ఫ్రాం కూడా ఫ్రాయిడ్ గొప్పతనాన్ని గుర్తిస్తూనే, ఆయన లోపాల్ని చూపారు. థామస్ సాజ్ రచన ది మిత్ ఆఫ్ మెంటల్ ఇల్ నెస్ చదవమని కోరుతున్నాను.

- వార్త, అక్టోబరు 2002
ఇద్దరు నరేంద్రనాధ్‌లు

ఇద్దరూ నరేంద్రనాధ్ లే. ఇరువురూ బెంగాలీయులే. ఉభయులూ అవివాహితులే. ఆ యిద్దరూ ఉగ్రజాతీయవాదులే.

ఒక నరేంద్రనాధ్ 19వ శతాబ్దం చివరలో, మరో నరేంద్రనాధ్ 20వ శతాబ్దం ఆరంభంలో అమెరికాలో అడుగుపెట్టారు.

సందేహవాదిగా, విద్యార్థిదశలో, పేదరికం భరించలేని స్థితిలో, రామకృష్ణ పరమహంస దగ్గరకు నరేంద్రనాధ్ వెళ్ళారు. దేవుణ్ణి చూపిస్తానని అభయం ఇచ్చేసరికి సాష్టాంగపడిపోయాడు. ఆశ్రమవాసి అయ్యాడు. రామకృష్ణ శిష్యుడయ్యాడు. సన్యాసిగా మారాడు. ప్రచారకుడుగా పరిణమించాడు. సంప్రదాయానుసారం పేరు మార్చుకున్నాడు. నరేంద్రనాధ్ కాస్తా వివేకానంద అయ్యాడు. ఆ పేరుతోనే అమెరికాలోని చికాగో మతసమావేశంలో మాట్లాడాడు. హిందూమత ప్రచారం చేశాడు. అందులోనూ వేదాంత ప్రసారం గావించాడు. దేశంలో జాతీయవాదులకు మత ఉద్వేగాన్ని అందించాడు. అంతవరకూ బ్రహ్మసమాజం తలపెట్టి, పరిమితంగా ఆచరిస్తూ వచ్చిన పునర్వికాసాన్ని వివేకానంద వచ్చి అడ్డుకున్నాడు. జమిందార్ల సహాయ సహకారాలతో మతపునరుద్ధరణకు పూనుకున్నాడు. అమెరికాలో, ఇండియాలో అదే చేశాడు. ఇండియా ఆధునిక యుగంలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నాడు. మాటల గాంభీర్యతకు, ఉద్వేగప్రసంగాలకు ముగ్దులయ్యే జనానికి వివేకానంద వాగ్ధోరణి, ప్రసంగ పాఠాలు హత్తుకపోయాయి. ఆలోచించకుండా ఆమోదించేవారికి వివేకానంద బాగా గురి కుదిరాడు. రామకృష్ణను ఆయన గుడ్డిగా అనుసరిస్తే, జనం వివేకానందను ఆమోదించారన్న మాట.

మరొక నరేంద్రనాధ్ మత ఉద్రేకంతో ఆరంభించి, బ్రిటిష్ వారిని అదర్గొట్టి తరిమేయాలని, అందుకు జర్మనీ ఆయుధాలు సేకరించాలని ప్రయత్నించాడు. బ్రిటన్ కు జర్మనీ శత్రువు గనుక, శత్రువుకు శత్రువు మన మిత్రుడు అనే సూత్రాన్ని అనుసరించాడు. (ఉత్తరోత్తరా సుభాష్ చంద్రబోసు యిదే బాటలో నడిచాడు) ఆ వేటలో అమెరికా పశ్చిమతీరం చేరుకున్న నరేంద్రనాధ్ అచిరకాలంలోనే ఎవిలిన్ తో పరిచయంకాగా ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. న్యూయార్క్ లో అభ్యుదయవాదుల