పుట:Abaddhala veta revised.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జోస్యం విని,తిరిగి కొరింత్ ప్రాంతానికి కాకుండా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. డాలిస్ ప్రాంతంవైపు వెడుతుంటే ఒకచోట ఇరుకుదారిలో రథంపై వస్తున్న లాయిస్ ఎదురౌతాడు. ఇద్దరూ ఎదురెదురుగా తప్పుకొని వెళ్ళేటంత వెడల్పు లేదు. ఒడిపస్ ను తప్పుకోమని లూయిస్ హుకు చేస్తాడు. ఒడిపస్ నిరాకరిస్తాడు. రథం ముందుకు సాగగా, లూయిస్ రథచక్రాలు ఒడిపస్ కాలును నలిపేస్తాయి. ఆగ్రహంతో లూయిస్ ను, రథసారధిని ఒడిపస్ చంపేస్తాడు. తాను చంపుతున్నది తన నిజ తండ్రినే అని ఒడిపస్ కు తెలియదు. థీబ్స్ వెళ్ళగా అక్కడ చిక్కు ప్రశ్నలు ఆ చిక్కు ప్రశ్నల్ని విప్పి, నగరాన్ని పీడిస్తున్న స్ఫినిక్స్ ను వదిలిస్తాడు. నగరవాసులు ఆనందంతో అప్పుడే విధవగా మారిన జొకాస్తా రాణిని ఇచ్చి ఒడిపస్ కు పెళ్ళి చేస్తారు. ఆమె తన నిజమైన తల్లి అని ఒడిపస్ కు తెలియదు. థీబ్స్ ప్రాంతానికి ప్లేగువ్యాధి వ్యాపిస్తుంది. డెల్విక్ దేవతను అడిగితే, లూయిస్ రాజును చంపినవాడిని వెళ్ళగొట్టమంటుంది. తానే చంపినట్లు ఒడిపస్ కు తెలియక, హంతకుడిని తరిమేస్తానంటాడు.

గ్రీసులో గౌరవపాత్రుడైన టైరియస్ అనే అంధుడు, ఒడిపస్ కలిసి, నగరం కోసం ఒక వ్యక్తి ఆహుతి కావాలంటాడు. తాను త్యాగం చేయటానికి సిద్ధమని జొకాస్తా రాణి తండ్రి ప్రకటిస్తాడు. కాని అసలు రహస్యం మరొకటి వున్నదనీ, దేవతలు బలికోరే వ్యక్తి వేరే వున్నాడనీ చెబుతాడు. తన కుమార్తె జొకాస్తాను పెళ్ళాడిన ఒడిపస్ ఆమె కుమారుడనీ, అతను చంపింది అతని తండ్రి లూయిస్ నేనని బయటపెడతారు. ఒడిపస్ పొరుగురాజుకు ఎలా దత్తపుత్రుడో వెల్లడౌతుంది. జొకాత్సా ఆ కఠోర సత్యం విని ఉరి వేసుకుంటుంది. ఆమె దగ్గరే ఒక పిన్ను లాక్కొని, కంట్లో పొడుచుకొని, ఒడిపస్ అంధుడౌతాడు.

ఇదీ ఒడిపస్ గాథ. ఫ్రాయిడ్ ఉదహరించే ఒడిపస్ కాంప్లెక్స్ ఈ గాథ నుండే స్వీకరించాడు. అదెలాగో పరిశీలిద్దాం. అసలు గ్రీక్ కథను ఫ్రాయిడ్ యథాతథంగా స్వీకరించలేదు. తన సెక్స్ సిద్ధాంతానికి అనుగుణంగా కథను మలచుకొని, భాష్యం చెప్పాడు. ప్రచారం చేశాడు. అది ఫ్రాయిడ్ సిద్ధాంత ప్రచారబలం.

ఒడిపస్ తన తండ్రిని చంపదలచుకోక వెళ్ళిపోయాడు. అసలు తండ్రి ఎవరో అతనికి తెలియదు. అడ్డొచ్చిన వ్యక్తిని చంపుతున్నప్పుడు తాను హతమారుస్తున్నది తన తండ్రినే అని ఒడిపస్ కు తెలియదు. తల్లిని పెళ్ళి చేసుకుంటున్నప్పుడు ఆమే తన తల్లి అనేది కూడా ఒడిపస్ కు తెలియదు. తల్లితో చిన్నతనం నుండే లైంగిక సంబంధం పెట్టుకోవాలని అతను కోరుకోలేదు. కనుక ఫ్రాయిడ్ సిద్ధాంతానికి ఒడిపస్ కథ యిమడదు. అయినా అదే కథను తీసుకొని, ఒడిపస్ చేసిందంతా అవ్యక్త అచేతన మనస్తత్వ బలం వల్ల అని చెప్పి లోకాన్ని నమ్మించడం ఫ్రాయిడ్ ప్రచార బలానికి నిదర్శనం.