పుట:Abaddhala veta revised.pdf/316

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఫ్రాయిడ్ మూలాధారం అవ్యక్త మనస్సు. అదే వ్యక్తుల్ని కదిలించి, నడిపించి, మాట్లాడిస్తుంది. అంటే మానవుడిని అవ్యక్త మనస్సు నిర్దేశిస్తుంది. మానవుడు స్వేచ్ఛగా ఇచ్ఛాపూర్వకంగా ప్రవర్తించే శక్తిమంతుడు అనుకోవడం సరికాదు. మానవుడి ప్రవర్తన గురించి 'ది సైకోపాథాలజీ ఆఫ్ ఎవ్విరిడే లైఫ్' లో ఫ్రాయిడ్ వివరించాడు. దీని ప్రకారం స్వేచ్ఛగా ప్రవర్తించే అవకాశం లేదు. అవ్యక్త మనస్సు నడిపిస్తుంది. అవ్యక్తత నుండి ప్రవహించేవన్నీ మన చేతన దశను ప్రభావితం చేస్తాయి. ఇది తిరుగులేని విషయంగా ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. మార్టిన్ లూథర్, లియొనార్డో వంటి సుప్రసిద్ధ వ్యక్తుల ప్రవర్తన తన అవ్యక్త సిద్ధాంతాన్ని బలపరుస్తున్నట్లు చెప్పుకున్నాడు. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో చాలా వినూత్న ప్రయోగాలు, పదాలు, ఉపయోగాలు, కథలు కనిపిస్తాయి. అందులో గ్రీకుకథగా వుంటూ వచ్చిన ఒడిపస్ విషయాన్ని ప్రాయిడ్ స్వీకరించాడు. దీనినే ఒడిపస్ కాంప్లెక్స్ అంటారు. అనోవిశ్లేషణలో కీలకపాత్ర వహించిన ఒడిపస్ కథను 1910లో మొదటిసారి ఫ్రాయిడ్ రంగం మీదకు తెచ్చాడు. ఫ్రాయిడ్ సెక్స్ సిద్ధాంతంలో మూల విషయంగా యిది పరిణమించింది. చిన్నతనంలో ఆరంభమయ్యే సెక్స్ ఆలోచన, ప్రవర్తన పెద్దదయిన తరువాత ఎలా ప్రభావితం చేస్తుందో చూపడానికి యీ కథను ఫ్రాయిడ్ వాడుకున్నాడు. ఫ్రాయిడ్ ప్రకారం ఏడాది వయస్సుకే పిల్లవాడికి తల్లిపై లైంగికప్రేమ అంకురార్పణ జరుగుతుంది. ఆడపిల్లలకు తండ్రిపై అలాంటి యిచ్ఛ వుంటుంది. ఇదే తండ్రిపై ద్వేషంగా పిల్లవాడిలోనూ, తల్లిపై ద్వేషంగా కుమార్తెలోనూ అంకురార్పణ అవుతుంది. దీనినే ఒడిపస్ కాంప్లెక్స్ గా చెబుతున్నారు. కానీ అసలు కథకి ఎన్నో వక్రీకరణలు చేశారు. కనుక మూలం ఏమిటో తెలిస్తే గానీ ఫ్రాయిడ్ విశ్లేషణల విశ్వసనీయత బయటపడదు.

ఒడిపస్ కథ ఏమిటి?

మనోవిశ్లేషణలో మూలసూత్రంగా స్వీకరించిన ఒడిపస్ సూత్ర కథ ఏమిటి? ఇది గ్రీకు గాథ. థీబ్స్ అనే ప్రాంతానికి రాజు లూయిస్. అతనికి పిల్లలు లేరు. ఆరకిల్ కొండ దేవతను అడిగితే, పిల్లవాడు పుడతాడు కాని వాడే నిన్ను చంపుతాడని చెబుతుంది. ఆ మాటలు నమ్మిన రాజు లూయిస్ తన భార్య జొకాస్తకు దూరంగా వుంటాడు. దీనికి ఆమె ఆగ్రహిస్తుంది. అతన్ని బాగా తాగించి, అతనితో జతకడుతుంది. ఆ తర్వాత పిల్లవాడిని కంటుంది. రాజు ఆ పనివాడిని లాక్కొని రెండు కాళ్ళు కలిపి మేకులు కొట్టి సిథారన్ పర్వతంపై పడేస్తాడు. లాయిస్ అనుకున్నట్లు ఆ పిల్లవాడు కొండపై చనిపోలేదు. ఒక పశువుల కాపరి చూసి కొరింత్ ప్రాంతానికి తీసుకువచ్చి, ఒడిపస్ అని పేరు పెడతాడు. ఆ ప్రాంతానికి రాజు అయిన పోలిబన్, రాణి పెరిబోయాకు పిల్లలు లేకుంటే,వారికి ఒడిపస్ ను ఇచ్చేస్తాడు. పిల్లవాడు పెరిగి,యవ్వనదశకు వస్తాడు. అతణ్ణి చూసిన స్నేహితులు తల్లిదండ్రుల పోలికలు అతనిలో లేవని నెపం వేస్తారు. సంప్రదాయానుసారం ఆరికల్ కొండ దేవత దగగ్రకు వెళ్ళి తనను గురించి అడుగుతాడు. "నువ్వు నీ తండ్రిని చంపి, నీ తల్లిని పెళ్ళాడతావు ఫో" అంటుంది. తల్లిదండ్రులను విపరీతంగా ప్రేమించిన ఒడిపస్ ఈ