పుట:Abaddhala veta revised.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనాలసిస్ ను యూదుల సిద్ధాంతంగా భావించాడు. యూదుగా వుండటమే అద్భుతమనీ, విశ్లేషణకు అందని సిద్ధాంతం యూదులే చెప్పగలరని 1936లో బార్బరాలో (Barbara Low)కు వ్రాసిన ఉత్తరంలో బయటపడ్డాడు. ఫ్రాయిడ్ చాలాకాలం యూదుల ఆచార సంప్రదాయాలు పాటించలేదు. కాని యూదులతో సమైక్యంగా భావించుకున్నాడు. బయట తాను మతంలేని నాస్తికుడుగా ప్రచారం చేసి, వారితో కలసిపోవడం, ఫ్రాయిడ్ ద్వంద జీవితనీతికి నిదర్శనం. తన సైకో ఎనాలసిస్ ను అడ్డం పెట్టుకుని వ్యతిరేకుల్ని భయపెట్టిన ఫ్రాయిడ్ యూదుమతాన్ని బాగా వాడుకున్నాడు.

1939లో 80వ సంవత్సరం పైబడగానే ఫ్రాయిడ్ మోసెన్ అండ్ మోనోథీయిజం అనే చివరి గ్రంథం వ్రాశాడు. ఇందులో యూదు వాద పుట్టుపూర్వోత్తరాలు ప్రస్తావించాడు. మోసెస్ తో తాదాత్మ్యం చెందాడు. క్రైస్తవులు, నాజీలు, యూదులపై జరిగిన అత్యాచారాలకు పగతీర్చుకునే ధోరణి ఫ్రాయిడ్ ప్రదర్శించాడు. పగ తీర్చుకోవడం ప్రతి మతం చేసే పనే. యూదులకిది ప్రత్యేక లక్షణంగా వున్నట్లు వారి పవిత్ర గ్రంథాలలోనే చెప్పారు. ఫ్రాయిడ్ ఆ సూత్రాల్ని పాటించాడు.

కార్ల్ యూంగ్ ఏమన్నాడు?:

మనోవిజ్ఞానంలో ఫ్రాయిడ్ తో పాటు పనిచేసిన యూంగ్ కూడా చాలా ప్రభావం చూపెట్టాడు. అంతర్జాతీయ సైకో ఎనాలసిస్ సంఘాధ్యక్షుడుగా కొన్నాళ్ళున్న యూంగ్ (1875-1961) వైద్యం చదివాడు. జ్యూరిచ్ సైకియాట్రి సంస్థలో పనిచేశాడు. కలలపై ఫ్రాయిడ్ వ్యాఖ్యానం 1900లో వెలువడిన నాటికే. యూంగ్ సైకియాట్రి గురించి అభిప్రాయం వెల్లడిస్తూ,అదొక మతం అన్నాడు. మానసిక రోగాల పరిధిలో మానవ, నైతిక దృక్పధాన్ని ఫ్రాయిడ్ ప్రవేశపెట్టాడని ఉద్దేశం. రోగి చెబుతున్నాడనేది గాక, రోగలక్షణాలు వాటి లెక్కలు సేకరించడంలో సైకియాట్రి వైద్యులు ఆసక్తి చూపారన్నాడు. మానసిక రోగులుగా, హిస్టీరియా లక్షణాలు చూపేవారు నటిస్తున్నారని 1906-1908 మధ్య యూంగ్ వ్రాశాడు.

ఒక మతం స్థానంలో మరో మతాన్ని మాత్రమే స్థాపించవచ్చని యూంగ్ 1910లో వ్రాస్తే, ఫ్రాయిడ్ అదిరిపడి, తనను మతస్థాపకుడుగా చూడొద్దని అన్నాడు. మతం అనే మాట ఫ్రాయిడ్ కు గిట్టదు. యూంగ్ దృష్టిలో అది మంచిదే. సైకో ఎనాలసిస్ లో జీవశాస్త్రం కంటె, ఆధ్యాత్మికత హెచ్చుగా ఉన్నదని యూంగ్ నిర్ధారణకు వచ్చాడు. ఫ్రాయిడ్ దీనిని వైద్యంగా శాస్త్రీయమైనదిగా ప్రచారం చేసి ఆచరించదలిస్తే,యూంగ్ ఇదొక మతంగా ఆధ్యాత్మికంగా భావించి ప్రచారం చేశాడు. థామస్ సాజ్ దృష్టిలో యూంగ్ సత్యానికి సన్నిహితంగా వున్నాడు. అంతటితో ఫ్రాయిడ్ ధ్వజమెత్తి యూంగ్ ను దుయ్యబట్టాడు. యూంగ్ మాత్రం రానురాను సైకోథెరపిలోని ఉపమానాలు, మతలక్షణాలు, ఆత్మ ఉపశమనం స్పష్టపరిచాడు. ఫ్రాయిడ్ దృష్టిలో నరాల జబ్బు, సైకోసిస్ అనేవి రోగాలే. యూంగ్ దృష్టిలో నరాల బలహీనత జబ్బు కాదు. సైకోసిస్ రోగం కావచ్చు.