పుట:Abaddhala veta revised.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రజ్ఞులు వ్యాఖ్యానిస్తూ లైంగిక విషయాలను అణచివేయడంగా పేర్కొన్నారు. ఇది కూడా సరికాదు. ప్లూటార్క్ తన గాధలలో హిప్పోపోటమస్ తన తండ్రిని చంపి తల్లిని బలవంతం చేసినట్లు రాశాడు. దీనినిబట్టి ప్రతివాడికీ హిప్పోపోటమస్ ధోరణి వున్నదంటామా? ఒడిపస్ ధోరణి అనేది ఫ్రాయిడ్ భాష్యం చెప్పినట్లుగా గ్రీక్ కధలో ఎక్కడా లేదని ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా పేర్కొన్నది. ఒడిపస్ ఉద్వేగాలు అతడిని పురికొల్పి యీ పనులు చేయించలేదనేది స్పష్టం. ఒడిపస్ ధోరణి అనేది సైకో ఎనాలసిస్ కు బాగా అక్కరకొచ్చింది. కనుక గాధల్ని,మతాన్ని, చరిత్రను,వ్యక్తి ప్రవర్తనను తమ యిష్టం వచ్చినట్లు చిత్రించి, శాస్త్రీయం అనే ముసుగువేసి చికిత్సపేరిట భాష్యం చెప్పిన సైకో ఎనలిస్టులు ద్రోహం చేశారు.

రాజు ధోరణి మార్చేసి ఒడిపస్ కు అంటగట్టిన ఘనత ఫ్రాయిడ్ దే. ఈ రంగంలో ఫ్రాయిడ్ జోలికి ఎవరూ పోలేదు గనుక యిష్టమొచ్చినట్లు పదజాలాన్ని ప్రయోగించి, నాటకం ఆడాడు. మానవ ప్రవర్తనను తనకు అనుకూలంగా మార్చి, తన సిద్ధాంతాలలో యిమిడ్చాడు. ఫ్రాయిడ్ కు చాలామంది అనుచరులుండడం, సైకో ఎనాలసిస్ ను ఆమోదించడంతో ఫ్రాయిడ్ కు ఆమోదముద్ర పడింది. ఒడిపస్ పాత్రకు ఫ్రాయిడ్ చేసిన భాష్యంవంటిదే లియొనార్డో హేమ్లట్, వుడ్రోవిల్సన్ పట్ల కూడా అన్వయించి,ఉన్నత లక్షణాలను దుష్టమైనవిగా, శ్లాఘనీయమైన విషయాలను గర్హనీయంగా చూపాడని థామస్ సాజ్ పేర్కొన్నారు. (ది మిత్ ఆఫ్ సైకోతెరపి)

ఒడిపస్ కాంప్లెక్స్ అనేది ఫ్రాయిడ్ కు యిష్టప్రీతి అయిన వ్యాఖ్యానం. అది శాస్త్రీయం అని చెప్పాడుగాని, తన సొంత ఆస్తిహక్కుగా చూచుకొని, ఎవరు దాని జోలికి వచ్చినా విరుచుకపడ్డాడు. ఒడిపస్ కాంప్లెక్స్ ను కనిపెట్టి వెల్లడించినందుకు ప్రపంచంలో చూపవలసినంత కృతజ్ఞత రాలేదన్నాడు.(సైకో ఎనాలసిస్ పై పరిచయ ఉపన్యాసాలు) ఒడిపస్ గాధ ఫ్రాయిడ్ కనిపెట్టింది కాదు. ఇందులో ఫ్రాయిడ్ కు ప్రపంచం ధన్యవాదాలు చెప్పాల్సిందేమీ లేదు. ఒడిపస్ కాంప్లెక్స్ విషయమై తాను భాష్యం చెప్పినట్లే సైకో ఎనాలసిస్ లో వుండాలని అటూఇటూ తప్పగూడదని ఫ్రాయిడ్ ఉద్దేశం. కాని ఆయన మాత్రం తన యిష్టం వచ్చినట్లు సమయానుకూలంగా ఒడిపస్ కాంప్లెక్స్ గురించి మాటలు మార్చేస్తుండేవాడు.ఒడిపస్ కాంప్లెక్స్ ప్రపంచవ్యాప్తంగా వున్నట్లు చివరిదాకా ఆయన పేర్కొన్నాడు. (అవుట్ లైన్ ఆఫ్ సైకో ఎనాలసిస్) ఇందుకు సాక్ష్యాధారాలు ఏమి చూపలేదు.కేవలం గ్రీకు కధకు అతడి వ్యాఖ్యానమే చూపాడు. కుమారులందరూ ఒడిపస్ కాంప్లెక్స్ లో పయనించక తప్పదన్నాడు. తండ్రి బలాన్ని చూచి ఈర్ష్యపడేగుణం కుమారుడికి వుంటే, వికలాంగుడు బలహీనుడైన తండ్రి వున్నచోట ఏమౌతుంది? తండ్రి చనిపోగా, తల్లి పెంచినచోట ఎలా వుంటుంది? షేక్స్ పియర్ పాత్ర హామ్లెట్ లో కూడా ఫ్రాయిడ్ ఒడిపస్ ధోరణి చూచాడు!

మామూలుగా వాడుకలో వున్న పదాలకు కొత్త ముసుగు వేయడం ఫ్రాయిడ్ కు కొట్టిన పిండిగా థామస్ సాజ్ చూపాడు. మనస్సు(Mind) ను మనోపరికరం(Physic apparatus) అనీ,