పుట:Abaddhala veta revised.pdf/307

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సమాధానంచెప్పి,దాని నుండి నగరాన్ని కాపాడతాడు. ప్రజలు కృతజ్ఞతతో అతడిని రాజుగా ప్రకటిస్తారు. జూకాస్తాను తన తల్లి అని తెలియకుండానే పెళ్ళిచేసుకుంటాడు. థీబస్ లో ప్లేగువ్యాధిరాగా మళ్ళి డెల్ఫిక్ ఆరేకిల్ ను సంప్రదిస్తారు. లూయీ హంతకుడిని బహిష్కరించమంటుంది. తాను రోడ్డుపై చంపింది లూయీనేనని ఒడిపస్ కు తెలియదు. ఎవరైనాసరే, లూయీ హంతకుడు దేశం వదలిపోవాలని ఒడిపస్ ప్రకటిస్తాడు.

గ్రీసు రుషిగా పేరొందిన అంధుడు టెరిఫాన్ వచ్చి ఒడిపస్ తో మాట్లాడి ప్లేగు వ్యాధి పోవాలంటే భూమిలో పాముదంతాలు నాటినవ్యక్తి త్యాగం చేయాలంటాడు. జూకాస్తా తండ్రి మోనోసిన్ అప్పుడు పైకిలేచిరాగా, నగర ప్రజలు అతడి త్యాగాన్ని శ్లాఘిస్తారు. టెరిఫాన్ అప్పుడే రహస్యం వెల్లడిస్తూ, ఒడిపస్ నీ భర్తను చంపాడని జూకాస్తాకు చెబుతాడు. పెరిబోయా రాసిన లేఖ ద్వారా ఒడిపస్ దత్తత విషయం కూడా తెలుస్తుంది. వెంటనే జూకాస్తా వురిపోసుకొని చనిపోగా, ఒడిపస్ ఆమెనుండి ఒక పిన్నులాగి కళ్ళల్లో పొడుచుకొని గుడ్డి వాడౌతాడు.

ఇదీ ఒడిపస్ కధ. ఫ్రాయిడ్ యీ కధలో తనకిష్టమొచ్చిన భాగాలు స్వీకరించి, కొన్ని వదిలేసి, తల్లికీ, కొడుకుకూ లైంగికసంబంధంతో నరాల జబ్బుకు ముడిపెట్టాడు. లైంగిక సంఘర్షణలో రీతులను ఆకర్షణీయ పదజాలం అన్వేషించి పెట్టాడు. అందుకు ఒడిపస్ గాధను వాడుకున్నాడు.

ఒడిపస్ తన తండ్రిని చంపి తల్లిని పెళ్ళిచేసుకోవాలని తలపెట్టలేదు. పైగా అలాంటిదేమీ జరగకుండా చూడదలచాడు. తాను చంపింది తన తండ్రిని అని ఒడిపస్ కు తెలియదు. ఇది అచేతనంగా వున్నదని, తాను చంపుతున్నది ఎవరినో అనే విషయం ఆచేతనంగా(unconscious) ఒడిపస్ కు తెలుసని ఫ్రాయిడ్ భాష్యం చెప్పాడు.

ఒడిపస్ గాధలో లూయిస్ పాత్ర ఏమిటి? ఒడిపస్ కాంప్లెక్స్ వుంటే, కొడుకును చంపాలనుకున్న లూయిస్ కాంప్లెక్స్ మాటేమిటి అని థామస్ సాజ్ ప్రశ్నించాడు. ఈ గాధలో కుమారుడి హత్య అనే ధోరణి ప్రధానం గదా! తండ్రులందరికీ కుమారులను హతమార్చి, భార్యలను తమకే సొంతం చేసుకోవాలనే కోరిక వుంటుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా వున్నదని ఫ్రాయిడ్ సూచించలేదేమి? ఒడిపస్ చర్యను బట్టి ఆత్మరక్షణలో నిమగ్నమయ్యాడు.

ఒడిపస్ ను పసిబిడ్డగా వుండగానే చంపాలని లూయిస్ తల పెట్టడమేగాక డాలస్ రోడ్డుపై ఎదురైనప్పుడు మరోసారి చంపాలని భావించాడు. ఫ్రాయిడ్ యీ వాస్తవాలను తన సిద్ధాంతానికి యిమడనందున వదిలేశాడు.

ప్రాచీన గ్రీకులు తండ్రి హత్య, తల్లి కుమారుల లైంగిక సంబంధం గురించి మాట్లాడడానికి యిష్టపడేవారు కాదు. ఒడిపస్ తన ఉద్దేశాలను కప్పిపుచ్చి పరోక్షంగా వెల్లడించాడనే ఫ్రాయిడ్ వ్యాఖ్యానం కూడా యిమడదు. తననుతాను శిక్షించుకున్న ఒడిపస్ చర్యను మనోవిజ్ఞాన