పుట:Abaddhala veta revised.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృషి చేశారు. వివేకానందుడి అమెరికా ప్రయాణానికి మద్రాసులో ఆయన శిష్యులు ప్రయత్నిస్తే అతికష్టం మీద 500 రూపాయలు వసూలయ్యాయి. జమిందార్లపై ఆధారపడిన వివేకానందుడు ఆ డబ్బును పేదలకు పంచేయమన్నాడు. జమిందార్లు బాగా కోపు వేసికొని అమెరికాకు సాగనంపారు. పెన్ న్ సులా స్టీమర్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ కొనిపెట్టి, కొంత డబ్బిచ్చి, ఇతర వస్తువులు కొనిచ్చారు. ఆ సందర్భంగానే కాషాయ సిల్కు వస్త్రాలు, సిల్కు తలపాగా జమిందార్లు కుట్టించారు. దివాన్ జగన్మోహన్ లాల్ తన జమిందారు ఉత్తరువులమేరకు స్వామీజీ అవసరాలన్నీ చూచి ప్రయాణానికి ఓడ ఎక్కేవరకూ బొంబాయిలో వున్నాడు. వివేకానందుడనే పేరుకూడా ఖెత్రిమహారాజా ఒక దర్బారులో ప్రకటించారు. అప్పటినుంచీ నరేంద్రనాధ్ కాస్తా వివేకానందుడై పోయాడు. కాని ఆయన కావాలనుకున్న పేరు సచ్చిదానంద మాత్రమే. హరిదాస్ మిత్రకు 1892 అక్టోబరులో వ్రాసిన లేఖలో సచ్చిదానంద అని సంతకం చేశాడు. కాని వివేకానంద అనే పేరు స్థిరపడి బహుళ ప్రచరానికి వచ్చింది. తలపాగా ధరించడానికి వివేకానందుడు తొలుత తటపటాయించాడు. అదే అతడికి ప్రతీకగా, సుప్రసిద్ధ చిహ్నంగా మారింది.

మహారాజా యిచ్చి పంపిన డబ్బును అమెరికాలో స్వామీజీ పారేసుకున్నాడు. ఆ విషయం తెలిసి వెంటనే 500 రూపాయలు స్వామీజీకి యివ్వమని 'మహారాజావారూ థామస్ కుక్ అండ్ సన్స్ కు కేబిల్ యిచ్చాడు. (ఫర్ గాటెన్ ఛాప్టర్స్-శర్మ పుట 34-94) ఇండియా నుండి జమిందార్లు స్వామీజీకి పార్సిల్స్ పంపుతూ,ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తూ వచ్చారు. ఈ విధంగా అమెరికాలో స్వామీజీ అవసరాలకు ఎలాంటి లోపం రాకుండా జమిందార్లు జాగ్రత్త వహించారు. అమెరికాలో వివేకానందుడిపై జరిగిన దుష్టప్రచారాన్ని కూడా ఖేత్రి, జునాగడ్ మహారాజాయే ఎదుర్కొని పరువు కాపాడారు.

చికాగోలో హిందూమత ప్రతినిధిగా పాల్గొని ఇండియాకు తిరిగి వచ్చిన వివేకానందకు జమిందార్లు ఎగబడి, పోటీబడి స్వాగతం పలికి సన్మానించారు. తొలుత రామనాడ్ రాజా, వివేకానందకు స్వాగతం పలికి, ఆయన విగ్రహం కూడా ప్రతిష్ఠించాడు. పేదలకు అన్నదానం చేసాడు. రాజా స్వయంగా వివేకానంద ఎక్కిన బండిని లాగాడు. అందుకు బదులుగా రాజావారికి రాజర్షి అని బిరుదును ప్రసాదించాడు వివేకానందుడు. రామనాధపురం జిల్లాలో రాజకీయంగా రాజావారు చేయని అవినీతి అంటూ లేదు. ప్రజల్ని పీల్చి పిప్పిచేశాడు. కాని, భక్తికి లోపంలేదు. తరువాత వివేకానందకు మద్రాసులో రాజాలు 'క్యూ'లో వుండి స్వాగతం పలికారు. (చూడు: గంభీరానంద:యుగనాయక్ వివేకానంద మొదటిభాగం 267-270 354-400) ఈ సభకు హెచ్.హెచ్.గైక్వార్ అధ్యక్షత వహించాడు. తరువాత కలకత్తాలో వివేకానందను సన్మానించారు. ఉత్తర పరరాజా ప్రియ మోహన్ ముఖోపాధ్యాయ, సోవాబజార్ మహారాజా, మహారాజా వినయ్ కృష్ణదేవ్ బహుదూర్, దర్భంగా మహారాజా, మహారాజా నరేంద్రకృష్ణ బహుదూర్, మహారాజా గోవిందలాల్ రాయ్ బహుదూర్, రాజారాజేంద్ర నారాయణ్ బహుదూర్ గారలు సన్మాన సంఘంగా ఏర్పడి ముందుకు వచ్చారు. రాజా రాధాకాంతదివ్ భవన ప్రాంగణలో