పుట:Abaddhala veta revised.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వాగత సభ జరిగింది. గ్వాలియర్ మహారాజా వచ్చి పాల్గొన్నారు. తరువాత స్వామీజీ డార్జిలింగ్ వెళ్ళగా బర్ద్వాన్ మహారాజా తన భవనాన్ని వాడుకోమని వివేకానందకు యిచ్చాడు. ఇల్లు కట్టుకోడానికి కాశ్మీరు మహారాజా స్థలం యిచ్చాడు. అద్వైత ఆశ్రమ నిర్మాణానికి గాను భింగరాజా డబ్బిచ్చాడు. వివేకానందకు ఎటుచూచినా స్వదేశీసంస్థానాధిపతులు, జమిందారులు, యువరాజులు, సంపన్నులు అండగా నిలచారు. ఆదరించారు. రాజాలపట్ల తన ప్రేమను వెల్లడిస్తూ వివేకానంద 1897 మేలో జునాగడ్ దివాన్ కు ఉత్తరం వ్రాశాడు. సముద్ర ప్రయాణం చేసినందుకు తనను వెలివేస్తే, తనతో సాంగత్యం గల దేశీయ సంస్థానాధిపతుల్ని కూడా వెలివేయాల్సి వస్తుందని 1897 జులై 9న,సిస్టర్ మేరీకి వ్రాసిన లేఖలో పేర్కొన్నాడు. వివేకానంద సన్యాసి అయిన తరువాత ఆయనకు ఘనంగా మహారాజా వినయ్ కృష్ణదేవ్ బహద్దూర్ ఒక విందు ఏర్పరచాడు. (ది బెంగాలీ పత్రిక సంపాదకీయం 1895 మే 18)

దేశీయ ప్రభువుల్ని శ్లాఘించడంలో వివేకానంద వెనుకాడలేదు. బ్రిటిష్ వారి పాలనలో కరువు తాండవిస్తుండగా స్వదేశ సంస్థానాలు హాయిగా వున్నాయన్నాడు. (1899 అక్టోబరు 30 మేరీకి లేఖ) అంతటితో ఆగలేదు. బ్రిటిష్ వారిని తరిమేసి స్వదేశ సంస్థానాధిపతులకు పట్టం కట్టాలని ఉవ్విళ్ళూరాడు. అందుకుగాను ఒక కూటమి ఏర్పాటు చేయాలనుకున్నాడు. అవసరమైతే ఆయుధాలు ప్రయోగించడానికిగాను తుపాకులు తయారుచేసే సర్ హిరాం మాక్సింతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. (పరివ్రాజక్ పుట 123)

వివేకానందపై తిరుగుబాటు 1899 లో గిరీంద్ర,హరధన్ అనే యిరువురి నాయకత్వన కొందరు భక్తులు బేలూరు మఠం నుండి చీలిపోయి, వివేకానంద చర్యలకు నిరసనగా పేదల రామకృష్ణ సభను ఏర్పరచారు. స్వామీజీ సహజంగానే దీనిని అంగీకరించలేదు. ఎదురు తిరిగిన బేలూరు మఠం భక్తులు అక్కడ జరిగే ఉత్సవాలను, చివరకు రామకృష్ణ జన్మదినోత్సవాన్ని సైతం బహిష్కరించారు. సన్యాసిగా వుంటానన్న వివేకానంద జమిందార్ల సాంగత్యంలో చేసే పనులు నచ్చక యీ తిరుగుబాటు వచ్చినది.

అమెరికాకు రెండు పర్యాయాలు వెళ్ళిన వివేకానంద ప్రధానంగా ధనసేకరణకే ప్రయత్నించాడు. కాని కొంతవరకే సఫలికృతుడైనాడు. అమెరికాలో సంపన్నులు కొందరు శిష్యులైన పిమ్మట వివేకానందకు డబ్బు కొరత లేదు. ఇండియాకు తిరిగి వచ్చిన వివేకానంద దేశంలోని ఉగ్రవాదులకు (టెర్రరిస్టులు) ఉత్తేజాన్ని కలిగించాడు. అమెరికాలో వుండగా వివేకానందకు క్రైస్తవ సంఘాలతో, యూనిటేరియన్ చర్చితో బాగా సన్నిహిత పరిచయం ఏర్పడింది. వారి సేవాదృక్పధం ఆయన్ను ఉత్తేజపరచింది. క్రైస్తవ సోషలిస్టుల నినాదాలు, సేవలు ఆయన్ను ఆకట్టుకున్నవి. వీటన్నిటిని రంగరించి, ఇండియాలో రామకృష్ణ మిషన్ ఏర్పరచాడు. సాంఘిక సేవనేది మతపరంగా చేయడం సన్యాసులకు యిష్టం లేకున్నా వివేకానంద మాత్రం యీ విషయంలో పట్టుదలగా ముందుకు పోగలిగాడు.