పుట:Abaddhala veta revised.pdf/277

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రూపాయల్ని అజిత్ సింగ్ పంపాడు. బేలూరుమఠం నుండి 3 వేల రూపాయల్ని వివేకానంద అప్పుగా తీసుకొన్నాడు. కాని డబ్బు చాలనందున ఇంటి ప్రయత్నం విరమించాడు. (చూడు: మిసెస్ బుల్ కు వ్రాసిన లేఖ 1900 మే 18)

వివేకానందుడు ఎక్కడకు వెళ్ళినా సర్వసౌకర్యాలు కోరుకునేవాడు. అమెరికా వెళ్ళినప్పుడు బాల్టిమోర్ లోని ఫస్ట్ క్లాసు హోటల్ లో వుండాలనుకున్నాడు. ఉన్నాడు కూడా. ఇంగ్లండ్ లో తన శిష్యుడు ఎడ్వర్డ్ స్టర్జీ అతిథిగా వున్నందున, వివేకానందుడిలో సన్యాసత్వం లేదని తెలుసుకున్న శిష్యుడు నిస్పృహ చెందాడు. ఆయనతో సంబంధాలు తెంచేసుకున్నాడు.

ఖేత్రి మహారాజా యిచ్చిన డబ్బు తన పుస్తకం రాజయోగం (ఆంగ్ల ప్రతి) పై వచ్చిన డబ్బును కూడబెట్టి న్యూయార్క్ లో సెయింట్ ఫ్రాన్సిస్ లెహెట్ వద్ద వివేకానందుడు దాచాడు. ఇదంతా (వెయ్యి డాలర్లు) తన కుటుంబానికే ఉద్దేశించాడు. 1900 డిశంబరు 27న ఓక్ బుల్ కు వ్రాస్తూ తను చనిపోతే డబ్బంతా తన తల్లికి అప్పగించమన్నాడు. వివేకానందుడి అభిమాని శ్రీమతి సెవియర్ అమెరికాలో 6 వేల రూపాయలు యివ్వడమే గాక, తరచు డబ్బు పంపింది. ఆ విధంగా పంపడం మానేయవద్దని వివేకానందుడు కోరాడు. మరో వెయ్యి రూపాయలు అదనంగా యివ్వమని కూడా కోరాడు. అమెరికా, ఇంగ్లండ్ లలో స్వామీజీ విలాసంగా గడిపిన తీరు పట్ల అసంతృప్తి లియోన్ లాండ్స్ బర్గ్ తన శిష్యరికానికి స్వస్తి పలికాడు. (వివరాలకు చూడు: మేరీ బర్క్ : సెకండ్ విజిట్ పుటలు 71, 79, 81-82, 85-87, 379) సన్యాసిగా నివసించలేని వివేకానందుడు, తన కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి చేసిన ప్రయత్నాల వలన తోటి సన్యాసులకు, మఠంలోని వారికి చాలా యిబ్బంది కలిగింది. వారెంతగా చెప్పినా వివేకానందుడు మారలేదు.

రామకృష్ణ చనిపోయిన తరువాత బేలూరుమఠం ఆర్థిక చిక్కుల్లో పడింది. కొందరు భిక్షాటన చేశారు గాని ప్రయోజనం అట్టే లేకపోయింది. ఆ బాధ్యత తన నెత్తిన వేసుకొన్న వివేకానంద అఖిలభారత భిక్షాటనకు 1891లో బయలుదేరాడు. రెండేళ్ళపాటు దేశమంతా తిరిగాడు. ముఖ్యంగా స్వదేశీసంస్థానాలలో హిందువుల పాలన క్రింద వున్న వాటికి వెళ్ళాడు. ఎక్కువగా రాజాలు, దివాన్ల వద్ద బస చేశాడు. రాజాల వద్ద పరిచయపత్రాలు ఆధారంగా పర్యటన సాగించాడు. బాగా డబ్బు వసూలు చేసి మఠాన్ని పోషించాడు : వివేకానందుడు వసూళ్ళకై వెళ్ళిన జమిందారీ, స్వదేశీ సంస్థానాలు యివి, ఆల్వార్, జైపూర్, అజ్మీర్, ఖెత్రి, అహమ్మదాబాద్, కధీయవార్, జునాగఢ్, పోరుబందరు, ద్వారకా, పైలితానా, బరోడా, ఖండ్వా, బొంబాయి, పూనా, బెల్గాం, బెంగళూరు, కొచ్చిన్, మలబార్, తిరువాంకూర్, త్రివేండ్రం, మధురై, రామనాడ్, రామేశ్వరం, కన్యాకుమారి.

అమెరికాలో జరుగనున్న ప్రపంచ మత సమావేశానికి వెళ్ళమని ముగ్గురు జమిందార్లు వివేకానందుడిని ప్రోత్సహించి, డబ్బిచ్చి పంపారు. ఖెత్రి, రామనాడ్, మైసూరు మహారాజాలు యీ