పుట:Abaddhala veta revised.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురోహితుడుగా పిచ్చి లక్షణాలున్న రామకృష్ణను చూపి, అవన్నీ దైవలక్షణాలని చెప్పి, మధురబాబు బంధువు హృదయ్ డబ్బు వసూలు చేస్తుండేవాడు. వచ్చినవారికి యీ లక్షణాల ఔన్నత్యం చెబుతుండటం విని, రామకృష్ణ ఒక సందర్భంలో హృదయ్ ను బాగా చివాట్లు పెట్టాడు. అంతేగాక కఠోర నియమాల వలన తనకు మానసిక స్థితి బాగాలేదని,ఉన్మత్త లక్షణాలు వచ్చాయని కూడా రామకృష్ణ స్పష్టంగా ఒప్పుకున్నాడు.(చూడండి.శివనాధశాస్త్రి 'మెన్ ఐహేవ్ సీన్ పుట 103)

మధురమోహన్ యీ విధంగా ఎందుకు చేశాడు? అతడు జమీందారుడుగా కర్కోటకుడు. రైతుల్ని హింసించి, డబ్బు పిండేవాడు. హత్యలు, దోపిడీలు చేయించేవాడు. రైతులు యితనిపట్ల జుగుప్సతో వుండేవారు. కసి తిర్చుకోడానికి సిద్ధంగా వుండేవారు కూడా. అలా ఆగ్రహావేశులైన రైతుల వద్దకు వెడుతూ, రామకృష్ణను వెంటబెట్టుకొని పోయేవాడు మధురబాబు. మత మనస్తత్వంగల ప్రజలు, ఎవరో మహానుభావుడు వచ్చాడని, రామకృష్ణను చూస్తూ పూజిస్తూ వుంటే, మధురబాబు తన పని తాను చూచుకునేవాడు. మధురబాబు తనతోబాటుగా యితర జమిందార్లను కూడా రామకృష్ణ దగ్గరకు తెచ్చాడు. అలా సన్నిహితమైన జమీందార్లలో బలరాంబసు ఒకడు. జమీందార్లు తమ నిరంకుశ పాలనకు రామకృష్ణను అడ్డం పెట్టుకుని వాడుకున్నారు.

మధురబాబు, రాష్ మణి జమీందార్లకు కుటుంబవైద్యుడు మహేంద్రరావ్ సర్కార్ తరచు రామకృష్ణకు చికిత్స చేస్తుండేవాడు. స్త్రీలను, బంగారాన్ని తాకితే దేహం స్థంభించిపొతుందని, ఆ విధంగా కామినీ కాంచనాలకు తాను దూరమని రామకృష్ణ చెప్పాడు. ఇదంతా నరాల బలహీనత జబ్బు లక్షణాలని డాక్టర్ సర్కార్ ఆయనకు వివరించాడు. రామకృష్ణ పూజించే కాళికామాత సంతాల్ జాతికి చెందిన ఆటవిక దేవత అనీ ఉత్తరోత్తరా ఆర్యులు తమ దేవతగా మార్చారని డా॥సర్కార్ వివరించి రామకృష్ణకు చెప్పాడు. రామకృష్ణ అవతారంకాదని అతడికే కుండబ్రద్ధలు కొట్టినట్లు చెప్పాడు. (చూడు: రామకృష్ణ కధామృతం. మహేంద్రనాథ్ లాల్ గుప్త రచన)

గొంతు కేన్సర్ తో రామకృష్ణ చావుబ్రతుకులమధ్య వున్నప్పుడు డా॥సర్కార్ చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. శిష్యులు మాత్రం పడకచుట్టూచేరి, యిదంతా లీల అనీ, ఆయన ఆడుకుంటున్నారనీ, యధాస్థితికి త్వరలోనే చేరుకుంటాదనీ అంటుండేవారు. గొంతులో ఏదీ మింగుడుపడక ఆయన యమయాతన పడుతుంటే, కాళికను అడగమని శిష్యులు కోరారు. ఇతరుల నోటిద్వారా ఆహారం స్వీకరిస్తున్నావుగదా అని కాళి చెప్పిందట. అయితే కేన్సర్ వచ్చే వరకూ ఎందుకు తిన్నట్లు, అప్పుడు యితరులు లేరా అంటే, అలాంటి ప్రశ్నలు వేయరాదంటారు. ఇదొక ఆధ్యాత్మిక ఆత్మవంచన. యోగశక్తితో కేన్సర్ ను నయం చేసుకోమని శిష్యులు కోరాగా, దైవ సాన్నిధ్యం నుంచి దృష్టి మరలించడం తనకిష్టంలేదనేవాడు. ఈ విధంగా తనకు తాను మోసం చేసుకుంటూ, ఇతరులను నమ్మిస్తూ బాధతో రామకృష్ణ చనిపోయాడు.