పుట:Abaddhala veta revised.pdf/275

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నప్పటినుండీ రోగాలతో బాధలు పడిన రామకృష్ణను పురోహితుడుగా రాష్‌మణి జమిందారిణి, పరమహంసగా మధురబాబు జమిందారూ బాగా వాడుకున్నారు. గ్రామస్తులు, బంధువులు, ఇంట్లోవారు మాత్రం రామకృష్ణను వాయురోగంతో బాధపడే కాముకునిగానే చూచారు.

రామకృష్ణకు చదువులేదు. ప్రాధమిక పాఠశాల దశలోనే ఆయన చదువు ఆగిపోయింది. బెంగాలీ తప్ప మరో భాషరాదు. అదికూడా మాట్లాడటమేకాని, చదవడం వ్రాయడం ఆయన వంతుకాదు. కాగా జ్ణాపకశక్తి ఎక్కువగా వుండేది. ఇంట్లో పౌరోహిత్య సంప్రదాయం వలన మాటకారి అయ్యాడు. శిష్యులుచేరి ఆయన చెప్పిన మాటలంటూ మనకందించిన వాటిలో అతిశయోక్తులు వున్నా, అనుకోకుండా కొన్ని నిజాలు చెప్పారు.

రామమోహన్‌రాయ్ చనిపోయిన తరువాత రామకృష్ణ పుట్టాడు. పునర్వికాస ఉద్యమం ఆరంభమైన బెంగాల్‌లో రామకృష్ణ ప్రభావం వలన దేశం వెనుకంజ వేసింది. కాంగ్రెసుపార్టి పుట్టిన మరుసటేడు ఆయన చనిపోయాడు. కాని ఆయన పేరిట వేదాంత ప్రచారం చేసి, మఠాలు స్థాపించి రామకృష్ణ పేరును నిలబెట్టిన ఖ్యాతి వివేకానందకు దక్కుతుంది. మేధావుల పట్ల యిష్టత కనబరచని రామకృష్ణ తన పేరు ప్రతిష్టలు యినుమడింప జేసుకోడానికి వివేకానందను గట్టిగా పట్టుదలగా వెంటపడి ఆకర్షించాడు. అదే రామకృష్ణకు ఎంతో ఉపయోగకారి అయింది. వివేకానంద కొన్నాళ్ళు కనిపించకపోతే రామకృష్ణ స్వయంగా ఆయనింటికి వెళ్ళేవాడు. వివేకానందకు పెళ్ళిచేయాలని తల్లిదండ్రులు తలపెట్టగా, చేయిజారిపోతున్నాడని రామకృష్ణ అడ్డుపడ్డాడు. భగవంతుడిని తాను చూచానని చెప్పేసరికి, రామకృష్ణలో గురికుదిరిన వివేకానందుడు, సందేహాలను వదలి గురువును గౌరవించడం, ఆదరించడం, ప్రచారం చేయడం మొదలెట్టాడు. రామకృష్ణుడు తన లక్ష్యాన్ని సాధించాడు.

-హేతువాది, ఫిబ్రవరి 1985
చిత్తశుద్ధి లేని వివేకానంద (నరేంద్రనాధ్)

వివేకానందకు అమ్మ నాన్న పెట్టిన పేరు నరేంధ్రనాధ్. 1863 జనవరి 12న కలకత్తాలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు. అక్కడే బి.ఎ.వరకూ చదివాడు. ఇంటర్‌మీడియట్ చదువుతుండగా, ఇంగ్లీషు లెక్చరర్ మాటల సందర్భంలో రామకృష్ణ విషయం ప్రస్తావించాడు. తొలిసారి ఆవిధంగా చూచాయగా పేరు విన్న వివేకానందుడు, ఎప్పుడైనా రామకృష్ణను చూడాలనుకున్నాడు. విద్యార్థిగా ఆయనకు సందేహాలుండేవి. దేవుణ్ణి చూచినవారెవరైనా వున్నారా అనేది ప్రధాన సంశయం. అంతేగాని నాస్తికుడుగా ఏనాడూ వివేకానందుడు లేడు. ఎవరైనా గట్టిగా చెబితే నమ్మడానికి సిద్ధంగా వున్న వివేకానందునికి "తాను చూచానని" రామకృష్ణ తడుముకోకుండా చెప్పేసరికి వివేకానంద నమ్మేశాడు.