పుట:Abaddhala veta revised.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాతావరణంలో పుట్టి పెరిగిన గదాధర్ కు అంతా కొత్తగా వింతగా వున్నది. తన అన్న పురోహితుడుగా జగదంబ విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పటికీ, గదాధర్ మాత్రం బజార్లో అటుకులు కొని తిన్నాడే తప్ప, అన్న భోగంలో పాల్గొనలేదు. వైష్ణవ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తాను జంతుబలి యిచ్చే శాక్తేయుల గుడిలో యిమడలేక, చివరకు ప్రసాదం కూడా స్వీకరించలేని స్థితిలో గదాధర్ సతమతమయ్యాడు. అన్న రాంకుమార్ ఎంత బ్రతిమిలాడినా గదాధర్ అంటరానితనాన్ని పాటించకుండా వుండలేకపోయాడు.(చూడండి లీలా ప్రసంగం)

తండ్రి తరువాత తండ్రివలె తనను చూస్తున్న పెద్దన్న రాంకుమార్ కూడా చనిపోయేసరికి,గదాధర్ మానసికంగా కుంగిపోయాడు. తనకంటె 31 సంవత్సరాల పెద్ద అయిన రాంకుమార్ మరణంతో, అసలే మూర్ఛలతో, రుగ్మతలతో బాధపడుతున్న గదాధర్ యింకా బలహీనపడ్డాడు.

దక్షిణేశ్వరంలో రాష్ మణి నిర్మించిన సత్రంలో సాధువులు తరచు వచ్చి బసచేస్తుండేవారు. గదాధర్ కు వారితో సంబంధం ఏర్పడింది. వారు చెఫ్ఫేది పాటించి, ఉపవాసాలంటూ, విశ్రాంతిలేని రాత్రులతో కాలం గడుపుతూ ఆరోగ్యం మరింత క్షీణింపజేసుకున్నాడు.

రాష్ మణి అల్లుడు మధురమోహన్ చాలా చురుకైనవాడు. ముందుచుాపుగలవాడు. గదాధర్ రోగలక్షణాలను పరిశీలించి వాటికి దివ్యత్వాన్ని అంటగట్టాడు. రాంకుమార్ వద్దని చెబుతున్నా వినకుండా గదాధర్ ను ఒక దేవాలయానికి పురోహితుడిని చేయించాడు. గదాధర్ మూర్ఛలు కేవలం మూర్ఛలు కావని, దైవలక్షణాలని మధురమోహన్ ప్రచారం చేశాడు. ఈలోగా గదాధర్ ఒక భైరవి వద్ద తాంత్రికవిద్యను అభ్యసించాడు. తన కామప్రవృత్తి అంతా తాంత్రికతతో తీర్చుకొన్నాడు. ఆధ్యాత్మిక చింతన,మధురప్రేమ పేరిట గదాధర్ తన కోర్కెల్ని తీర్చుకున్నాడు. భైరవి ప్రేరణ ప్రోత్సాహాలతో మధురమోహన్ ప్రచారంచేస్తూ, గదాధర్ దైవస్వరూపుడనీ, అవతారమని చెప్పాడు. ఈ విషయం నిర్ధారించటానికి ఒక సభ ఏర్పాటుచేశాడు. మధురబాబు చేతి చలవతో బ్రతుకుతున్న యిద్దరు పండితులు ఆ సభలో వున్నారు. అలాంటి వారంతా కలసి గదాధర్ ను అవతార పురుషుడన్నారు. మధురమోహన్ కథలు అల్లి,గదాధర్ ను రామకృష్ణుడని నామకరణం చేశాడు. తన కుటీరంలో నుంచి ఒకనాడు చూస్తుండగా, అటూ ఇటూ తిరుగుతున్న గదాధర్ తనవైపుకు వస్తుండగా కాళీకామాతగానూ, అటువైపు పోతుండగా సాక్షాత్తు శివుడుగానూ కనిపించాడనీ మధురబాబు చెప్పాడు. గదాధర్ అప్పటినుంచీ రామకృష్ణుడయ్యాడు. (చూడండి క్రిస్టోఫర్ ఈషర్ వుడ్ వ్రాసిన రామకృష్ణ అండ్ హిజ్ డిసైపుల్స్ పుట 54-1965) అంతటితో ఆగకుండా రామకృష్ణకు పరమహంస అని కూడా చేర్చి ప్రచారం చేశారు.

రామకృష్ణ కాళీ ఆలయ పురోహితుడుగా అతిగా నిష్టలు పాటించి,దేహాన్ని శిష్కింపచేస్తే, నరాల బలహీనత వలన, మూర్ఛలు రావడమే గాక, పిచ్చి లక్షణాలు కూడా స్పష్టపడ్డాయి. అలా పిచ్చెక్కినప్పుడు ఆయన్ను తాళ్ళతో కట్టేవారు. (చూడు:ధర్మప్రచారక్ 1384 ఆగస్టు 6)