పుట:Abaddhala veta revised.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామకృష్ణానందకు ఉత్తరం రాశాడు వివేకానంద! కుటుంబాన్ని మరచిపోని సన్యాసిగా వివేకానంద చివరి వరకూ ఆస్తిపాస్తులకోసం ప్రయత్నించడం ఆయన కుటుంబ ప్రేమను సూచిస్తుంది. రాజయోగం పై రాసిన పుస్తకానికి డబ్బురాగా, అది బాంక్ లో వేసి, తన తదనంతరం తన తల్లికి యివ్వమన్నాడు. ఇదంతా వివరంగా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే, సన్యాసిగా అవసరార్ధం మారిన వివేకానంద, సన్యాసి ధర్మాన్ని పాటించలేకపోయాడని చూపడానికే. అమెరికాలో సైతం తన అభిమాని సెవియర్ ఇచ్చిన సొమ్మును కుటుంబానికే పంపిన వివేకానంద, ఇంటికి అలాగే పంపించమని కూడా ఆమెను కోరాడు.

రామకృష్ణ చనిపోయిన తరువాత, మఠాన్ని పోషించడానికి బ్రతికించడానికి జమిందార్లు పూనుకున్నారు. ఇందుకు నాంది పలికినవాడు మధుర మోహన్ అనే జమిందారు. ఆయన రామకృష్ణను బాగా వాడుకున్న జమిందారు. యాత్రల పేరిట రామకృష్ణ వెంట వెళ్ళి, కాశీలో జమిందార్లతో తన అవసరాల గురించి పట్టించుకున్న మధురమోహన్ చాలా తెలివైనవాడు. జమిందారుగా మధురమోహన్ నరరూప ఫాసిస్టు. అతిక్రూరుడు. ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేసి విలాసంగా బ్రతికిన జమిందారు. రైతుల్లో తీవ్ర అసంతృప్తి, ఆందోళన వున్నచోటుకు రామకృష్ణ పరమహంసను తీసుకెళ్ళి, భక్తిని ప్రదర్శించేవాడు. రైతులు ఏమీ చేయలేకపోయేవారు. ఆకలితో, అప్పులతో వున్న రైతులకు భక్తిని చూపడం మన దేశ సాంప్రదాయం. అది మధురమోహన్ బాగా గ్రహించాడు. రామకృష్ణ అందుకు కొరముట్టుగా ఉపకరించాడు. అలాగే మరికొందరు జమిందార్లు కూడా రామకృష్ణ అనంతరం ఆశ్రమం పట్ల ఆసక్తి కనబరచారు. డబ్బివ్వడానికి సంసిద్ధులయ్యారు. వివేకానంద తన గురువువలె జమిందార్ల దారుణ పాలనకు తోడ్పడ్డాడు. ఇదంతా వేదాంత భక్తి పేరిట, ప్రాక్టికల్ వేదాంతం అనే నినాదంతో సాగిపోయింది. ఆ సందర్భంగా వివేకానంద జాతీయ వాదోపన్యాసాలు కూడా చేశాడు. అవి జాతీయవాదుల్ని ఆకర్షించాయి. కాంగ్రెసులోని అతివాదులు కూడా వివేకానంద ప్రవచనాలకు ప్రేరితులయ్యారు. ఇది వివేకానంద వ్యక్తిత్వానికి మరో వైపు కనబడిన తీరు.

రామకృష్ణ ఆశ్రమాన్ని పోషిస్తున్న బెంగాల్ జమిందార్లు కష్టాల్లో పడ్డారు. ఆశ్రమాన్ని ఆదుకోలేని దుస్థితిలో వున్నారు కనుక బెంగాల్ వెలుపల జమిందార్లను ఆశ్రయించాల్సిన పరిస్థితిలో వివేకానంద పర్యటనకు బయలుదేరాడు.

వివేకానంద 1891లో ప్రారంభించి ఎక్కడ పర్యటించారో గమనించాం. జైపూర్, ఖెత్రి, అహమ్మదాబాద్, అళ్వార్, కథియవాడ్, జునాగఢ్, పోర్ బందర్, ద్వారకా, పైలితానా, బరోడా, ఖండ్వా, పూన, బొంబాయి, బెల్గాం, బెంగళూరు, మలబార్ తీరం, కొచ్చిన్, తిరువాస్కూరు, త్రివేండ్రం, మధురై, రాంనాడ్, ఆమేశ్వరం, కన్యాకుమారి. వివేకానంద పర్యటనలో రాజులు, దివానుల వద్ద అతిథిగా రాచమర్యాదలతో వుంటూ, మరో చోటకు వెళ్ళేముందు పరిచయపత్రాన్ని