పుట:Abaddhala veta revised.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యువరాజు, దివాన్ ల దగ్గర తీసుకెళ్ళేవారు. రామకృష్ణ మఠానికి తగిన నిధుల్ని వివేకానంద సమకూర్చగలిగారు. ఈ పర్యటనలో వివేకానందకు అనేకమంది శిష్యులు, భక్తులు, అభిమానులు సమకూడారు. జాతీయోద్యమంలో నాయకుడు తిలక్ కూడా ఆయన్ను కలసిన వారిలో వున్నారు.

వివేకానంద స్వయంగా భక్తిగీతాలాపన చేసేవాడు. సంగీతం నేర్చిన వ్యక్తిగా ఆయన పర్యటనలో అది చాలా ఆకర్షించింది. ఉద్వేగ పూరితంగా పేదరికం గురించీ, స్త్రీల పట్ల విచక్షణ గురించి వివేకానంద మాట్లాడేవాడు. గీత చదివే బదులు ఫుట్ బాల్ ఆడడం మంచిదని ఉపన్యాసాల ధోరణి వుండేది. ఇదంతా జనాన్ని ఆకర్షించగా జాతీయ ఉద్యమకారుల్ని ఉత్తేజపరచింది. దేశవ్యాప్తంగా మధ్యతరగతిలో వివేకానందకు ప్రచారం లభించగా ఉన్నత వర్గాలవారు ఆయన్ను పోషించారు. ఆ విధంగా దేశ పర్యటన ముగించుకున్న సందర్భంలో, ప్రపంచ మత సమావేశం షికాగాలో జరగబోతున్నట్లు ఇండియాకు వార్త వచ్చింది. అది మరొక పెద్ద మలుపు. స్వదేశీ సంస్థానాదిపతులు తమ ఘోరకృత్యాలు, ప్రజాపీడన కప్పిపుచ్చుకోడానికి వివేకానందని అడ్డం పెట్టుకున్నారు. బ్రిటిష్ పాలనకంటె దేశీయ ప్రభువుల పాలన మెచ్చుకుంటూ వివేకానంద వారికి వత్తాసు పలికారు. ఉభయులూ చెట్టాపట్టాలు వేసుకొని, సామాన్య ప్రజల్ని పట్టించుకోలేదు. వివేకానంద పేదవారిపట్ల సానుభూతి చెబుతూ చేసిన ప్రసంగాలు, రాసిన రాతలు ఒక ఎత్తుకాగా, అందుకు విరుద్ధంగా పేదల్ని రైతుల్ని దారుణంగా అణచివేసిన స్వదేశీ సంస్థానాధిపతుల్ని పల్లెత్తు మాట అనకపోగా, వారిని ఆకాశానికెత్తారు. కనీసం సంస్థానాలలో సామాన్యులు ఎలా వున్నారని కూడా విచారించలేదు. ఫ్యూడల్ పాలనకు మతపరమైన మద్దత్తు లభించడంతో, జమిందార్లు వివేకానందకు డబ్బు గుప్పించారు. అంతటితో ఆగక ఆయన్ను ప్రపంచ మత మహాసభకు పంపడానికి సిద్ధపడ్డారు. వివేకానంద కూడా అదొక సదవకాశంగా భావించారు.

అమెరికా పోవడానికి ముందు ఖెత్రి మహారాజా బహిరంగ దర్బారు నిర్వహించి, "వివేకానంద" అని కొత్త సన్యాసి పేరు పెట్టారు. 1893 వేసవి నుండే వివేకానంద పేరు ప్రచారంలోకి వచ్చింది. అదీ వివేకానంద పేరుకు మూలం. వివేకానంద వెంట జగ్ మోహన్ లాల్(ఖెత్రి మహారాజా దివాన్) రాగా బొంబాయి వెళ్ళి అమెరికా ప్రయాణానికి సన్నద్ధమయ్యారు. స్వామీజీకి కావలసినవన్నీ సమకూర్చిపెట్టి, స్టీమర్ లో మొదటి తరగతి టిక్కెట్ కొనిచ్చారు. ప్రయాణపు ఖర్చుల నిమిత్తం కొంత సొమ్ము యిచ్చారు. అంతేకాదు వివేకానందకు ఒక సిల్కు తలపాగా తయారుచెసి తొలుత యిచ్చింది కూడా ఖెత్రి మహారాజానే. అదే వివేకానందకు చిహ్నంగా మారింది. అప్పటికి రామకృష్ణ భార్య శారదామణి బ్రతికేవుంది. ఆమె ఆశీర్వచనం పొంది, 1893 మే 31న బొంబాయిలో పెనిన్సులా అనే స్టీమర్ లో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణంచేసి జులై 25న కెనడాలోని వాంకోవర్ చేరుకున్నారు. బొంబాయిలోనే స్వామీజీకి జమిందార్లిచ్చిన ధనాన్ని సర్క్యులర్ నోట్లుగా మార్చి ఇచ్చారు. అమెరికా చేరుకునేనాటికి వివేకానంద ఆ నోట్లు