పుట:Abaddhala veta revised.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గమనార్హం. ఉత్తరోత్తరా నరేన్ రాజయోగంగా ప్రచారం చేసిన యోగాభ్యాసం అదేనన్నమాట. రామకృష్ణను అవతారంగా వివేకానంద గుర్తించలేదు. ఆశ్రమనాసుల నిమిత్తం ఆయన ఒక కరపత్రం వ్రాసి, రామకృష్ణను ఎవరు ఎలాగైనా భావించవచ్చని స్పష్తంగా రాశాడు. రామకృష్ణ మరణానంతరం ఆశ్రమాన్ని పోషించాల్సిన శిష్యులు, భిక్షాటన చేద్దామని తలపెట్టారు. వివేకానంద ఆ విధంగా దేశమంతా తిరగవలసి వచ్చింది. ఎవరు డబ్బిచ్చినా ఆయన స్వీకరించేవారు కాదని, పచ్చి అబద్దాలు యింకా రాస్తూనే వున్నారు. (చూడు: స్వామి లోకేశ్వరానంద, స్టేట్స్ మన్ సెప్టెంబరు 16, 1993) అసలు బయలుదేరిందే డబ్బు కోసం.

వివేకానందపై బ్రహ్మసమాజ్, కొంత మేరకు క్రైస్తవ మిషనరీల సేవల ప్రభావం చూపెట్టాయని ఉదహరించాం. తన గురువు రామకృష్ణ చెప్పిన వేదాంతానికీ, సమాజంలో పేదరికానికి పొత్తు కుదరకపోవడం వివేకానంద గమనించక పోలేదు. హిందూ ఆశ్రమ ధర్మానుసారం ఎవరికి వారు వ్యక్తిగతంగా మోక్షసాధన కోసం కృషి చెయాల్సిందే. వ్యక్తి బాధలు, పేదరికం అలాంటివన్నీ కర్మ ప్రకారం వచ్చినవే. కనుక ఒకరు మరొకరికి సహాయపడేదేమీ లేదు. అందుకే సేవాధర్మం హిందూ సంప్రదాయం కాదు. ఇందుకు భిన్నంగా వివేకానంద సేవాధర్మాన్ని ప్రవేశపెట్టాడు. ఒక వైపు రామకృష్ణ ఆశ్రమం వారే వివేకానంద ప్రయత్నాన్ని వ్యతిరేకించారు. అయినా వినకుండా సేవాధర్మాన్ని ఆయన ప్రచారం చేశారు. అది వివేకానంద విశిష్టత. గోసంరక్షకులు వచ్చి చందాలు అడిగితే, ముందు మలమలమాడే పేదల సంగతి చూడండి అని చెప్పడం వివేకానంద గొప్పతనం. ఈనాడు వివేకానందుని శ్లాఘించే వారిలో చాలా మంది గోసంరక్షకులే వుండడం కూడా గమనార్హం. వివేకానందను వాడుకోవాలనుకునే వారే యీ మత ఛాందసులనే సంగతి గుర్తుచేయడానికే యీ ఉదాహరణ తెచ్చాను. మాటలెన్ని చెప్పినా, వాదనలు ఎలా మలచినా, చివరకు అద్వైత వేదాంతాన్నే వివేకానంద ధ్యేయం అని కూడా మరో ప్రక్క మరచిపోరాదు! సన్యాసిగా పర్యటించిన వివేకానంద దేశమంతటా స్వదేశీ సంస్థానాలలోనూ, జమీందార్ల వద్దకూ వెళ్ళాడు. వాళ్ళ అతిథిగా వున్నాడు. డబ్బు వసూళ్లకు వెళ్ళాడు గనుక వారి ఆతిథ్యం స్వీకరించాడు. రామకృష్ణ ఆశ్రమం గుక్కతిప్పుకొని నిలవడానికి వివేకానంద ఆదుకోవడమే ఆదిలో తోడ్పడింది. పనిలో పనిగా తన కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేసుకోవడానికి వివేకానంద భిక్షాటన తోడ్పడింది. కష్టాల్లో వున్న తన కుటుంబానికి నెలకు వంద రూపాయల చొప్పున యిప్పించడంలో వివేకానందుడు కృతకృత్యుడయ్యాడు. ఖెత్రి మహరాజా అందుకు ఒప్పుకొని, ప్రతి నెలా వివేకానంద తల్లికి, సోదరులకు వంద రూపాయలు పంపేవాడు. 1890 ప్రాంతంలో 100 రూపాయలంటే ఇప్పుడు లక్షరూపాయల విలువ! తన తల్లికి సొంత యిల్లు కట్టించి పెట్టాలని సన్యాసిగా వివేకానంద ప్రయత్నించి విఫలుడయ్యాడు. బేలూరు మఠం నుండి 3 వేల రూపాయలు రుణంగా తీసుకున్నాడు. మహారాజాలను అడిగినా ఎందుకోగాని డబ్బు రాలేదు. చివరకు గృహనిర్మాణ తలంపు విరమించాడు. తన పేరిట మఠం స్థలాన్ని కొనుగోలు చేస్తే అది కోర్టు కేసుగా మారింది. తన పేరిట స్థలం కొనమని అమెరికా నుండి కూడా