పుట:Abaddhala veta revised.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిజనులకు ప్రత్యేక రాజకీయ హక్కులు ప్రసాదించే ఒప్పందాన్ని వ్యతిరేకించడానికి ఆమరణ నిరాహార దీక్ష పూనిన గాంధీ, ముస్లింలకు అలాంటి హక్కులిస్తుంటే కాదనలేదు. అంటరాని వారిపై ప్రేమవున్న గాంధీ కాంగ్రెసు మంత్రి వర్గాలలో వారికి ప్రాతినిధ్యం వుండాలని సూచన చేయలేదు. మద్యపరగణాలలో అగ్ని భోజ్ అనే హరిజనుడ్ని మంత్రిగా నియమిస్తే గాంధీ వ్యతిరేకించారు. ఇలాంటి విషయాలన్నీ బాధతో ఆవేదనతో అంబేద్కర్ తన పుస్తకంలో వివరంగా రాశారు. (చూడు: వాట్ కాంగ్రెస్ అండ్ గాంధి వేవ్ డన్ టు ది అన్ టచ్ బుల్స్ 1945 థాకర్ అండ్ కో బాబ్)

గాంధీ ముఖ్యంగా హిందువు. ప్రార్థనా సమావేశాలలో గీతా పారాయణం చేసేవారు. వర్ణాశ్రమ ధర్మాలను సమర్ధించారు. వర్ణాలు కావాలంటే కులాలు కావాలనడమే, అంటరానితనం హిందూ మత పుత్రికే, అంటరానితనం పోవాలంటే హిందూమతంలో సాధ్యంగాదు. గాంధీకి యీ విషయం బాగా తెలుసు. రాజకీయాలలో ప్రాబల్యంకోసం, స్వాతంత్రోద్యమం బలహీన పడకుండా చూడడానికి హరిజనుల్ని గాంధీ ఆకర్షించారు, వాడుకున్నారు. అంతకు మించి ఆచరణ కార్యక్రమం ఏదీ లేదు. చివరి దశలో కులం పోవాలని గాంధీ రాశారు. కాని అప్పటికే ఆయన హరిజనులకు చాలా అన్యాయం చేశారు. అంబేద్కర్ యీ విషయం గ్రహించి హెచ్చరించినా హరిజనులు గ్రహించలేదు. హిందూ మతం పట్టు వారిని వదలలేదు. ఆ మతంలోనే వుంటూ అంటరానితనం పోగొట్టుకోవడం సాధ్యంకాదని వారూహించలేదు. గాంధీ తెలివిగా హరిజనుల్ని మోసగించగలిగారు.

ఆధునిక భారతదేశం గాంధీని వదలేసి ఎం.ఎన్.రాయ్ ను అనుసరించి వుంటే యెంతో ముందుకు పోయేది, బాగుపడేది అని కీ॥శే॥నార్ల వెంకటేశ్వరరావు ఆవేదనతో రాశారు. కాని అది యెదురీత. ఎం.ఎన్. రాయ్ శాస్త్రీయ పరిశీలకుడు. ఆయన్ను అనుసరించడం నమ్మకస్తులకు చాలా దుర్లభం. గాంధీ ఆకర్షిత వ్యక్తి. ప్రజలలోవున్న మూఢనమ్మకాలను పాటించి, రాజకీయాలకు వాడుకున్న నాయకుడు. కనుక ఆయనకువున్న పలుకుబడి ప్రచారం ఎం.ఎన్.రాయ్ కు వూహించలేం. గాంధీ భావాలపట్ల నమ్మకంలేని నెహ్రూ, సైతం రాజకీయాలలో నాయకత్వంకోసం గాంధీజీకి శిరస్సు వంచక తప్పలేదు. యెదురు తిరిగిన సుభాస్ చంద్రబోసు, అంబేద్కర్ దెబ్బతిన్నారు.

భారతీయ జనతాపార్టీ సైతం గాంధీని పొగడాల్సిన పరిస్థితి మన దేశంలో వుంది. ఓట్లు కావాలంటే ప్రజా బాహుళ్యంలో సెంటిమెంటు వ్యతిరేకంగా పోకూడదన్నమాట. ప్రజలకు శాస్త్రీయ ధోరణి చెప్పాలని గాంధీవంటి వారు తలపెడితే యెలావుండేదో! కాని గాంధీ గోవధ నిషేధం, ఆయుర్వేదం, ప్రకృతి చికిత్స, శాఖాహారం, ఉపవాసాలు, ఖద్దరు వంటి అనేక విషయాలలో ప్రవాహానికి అనుకూలంగా వెళ్ళారు. అందుకే స్వాతంత్రోద్యమంలో ఆయన మతాన్ని తెలివిగా రాజకీయాల్లోకి తెచ్చారు. చివరిదశలో మతాన్ని రాజకీయాలకు దూరంగా