పుట:Abaddhala veta revised.pdf/257

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకటించాడు. ఆయన సన్నిహిత అనుచరులే-పండిట్ నెహ్రూతో సహా యీ అశాస్త్రీయ ధోరణిని బాహాటంగా ఖండించారు. దేశీయ దుస్తులే ధరించాలంటూ, రవీంద్రనాధ్ ఠాగూర్ ను సిల్కుబట్టలు వదలేయమంటే ఆయన నిర్మొహమాటంగా నిరాకరించారు. దేవాలయాలపై బూతుబొమ్మలున్నచోట, తనకు పెత్తనం వుంటే కూలగొడతానని గాంధీ అంటే, ఖొజరాహో దేవాలయ శిల్ప సంపద అభినందించిన వారు నవ్వుకున్నారు (అగేహానంద భారతి) కనుక స్వాతంత్రపోరాటం మినహా మిగిలిన విషయాలలో గాంధీ భావాలు అట్టే పట్టించుకుంటే మనం నవ్వులపాలవుతాం. రాజకీయాలలో మాత్రం గాంధీ గారి చిత్తశుద్ధిని కొన్ని సందర్భాలలో శంకించినవారు లేకపోలేదు. అదికూడా ఆషామాషీగా కాదు, ఆధారాలతోనే అందులో అంబేద్కర్ పేర్కొనదగిన వ్యక్తి, ఆయన అడిగిన ప్రశ్నలు, చూపిన ఆధారాలు తిరుగులేనివి. గాంధీజీ అబద్ధాలకు మరోనిదర్శనంగా యీ విషయాలు నేటికీ మనముందున్నాయి. అటు గాంధీని ఇటు అంబేద్కర్ ను ఒకే వేదికపై నిలబెట్టి పొగిడే రాజకీయ వాదులను విస్మరించి యీ విషయాలు పరిశీలించాలి. ఓట్లకోసం పడే పాట్లు వున్నంతకాలం రాజకీయ వాదులు ఎవరినైనా వాడుకుంటారు. శాస్త్రీయ పరిశీలనకు వారి ప్రవర్తన అడ్డురాకూడదు.

అంటరాని తనం పోవాలని గాంధీ పదే పదే అంటుండేవాడు. దీనికి గాను ఆయన దేవాలయలలో హరిజనులకు ప్రవేశం వుండాలన్నారు. హరిజన అనే పదంకూడా ప్రచారంలోకి తెచ్చారు. ఈ రంగంలో గాంధీ చిత్తశుద్ధిని అంబేద్కర్ ప్రశ్నించారు. గాంధీ అబద్ధాలను బయటపెట్టారు.

ఎన్నో సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు ఎన్నో కారణాలకై చేసిన గాంధీ, కనీసం ఒక్కసారైనా అంటరానితనం పోవడానికి నిరాహార దీక్ష పూనలేదేమని అడిగారు. గాంధీ సమాధానం చెప్పలేదు. అలాగే, అంటరాని వారి పక్షాన ఒక్క సత్యాగ్రహమైనా ఎందుకు చేయలేదని అంబేద్కర్ ప్రశ్నిస్తే గాంధీ మౌనం వహించారు. స్వరాజ్యం రావడానికి అంటరానితనం పోవాలని ఉపన్యాసాలిచ్చిన గాంధీ, ఖద్దరు ధరించాలన్నారే గాని, కాంగ్రెసు సభ్యత్వానికి అంటరానితనం పాటించబోమని ప్రతిన చేయమనలేదు. గాంధీ చేయకపోతేమానె అంటరానితనం పోగొట్టడానికి నాందిగా 1929లో బావులు వాడుకోడానికి, దేవాలయ ప్రవేశానికి సత్యాగ్రహం తలపెట్టారు కొందరు హరిజనులు. దీనిని సమర్ధించకపోగా, గాంధీ ఖండించడం అంబేద్కర్ కు ఆశ్చర్యం వేసింది. కేరళలో గురువాయూర్ గుడి హరిజనులకు తెరవకపోతే ఆమరణ నిరాహారదీక్ష పూనుతానని బెదిరించిన గాంధీ, ఆ మాట ఎన్నడూ పాటించలేదు. హరిజనుల దేవాలయ ప్రవేశబిల్లును రంగ అయ్యర్ కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టినా, ఎన్నికలు దగ్గరపడుతుంటే కాంగ్రెసుపార్టీ ఆ బిల్లుకు మద్దతు ఉపసంహరిస్తే, గాంధీ కనీసం అభ్యంతరమన్నా తెలుపలేదేమి? హరిజన సేవా సంఘంలో హరిజనులు లేకపోగా వారిపై దాడులు జరిగితే పౌరహక్కులు కాపాడుకునే నిబంధన కూడా సంఘ నియమావళిలో చేర్చలేదు.