పుట:Abaddhala veta revised.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణాఫ్రికాలో వుండదలచిన గాంధీజీ కావాలని పార్లమెంటుకు దరఖాస్తు సమర్పించడంలో జాప్యంచేశాడు. సమయానికి దరఖాస్తు యిస్తే పార్లమెంటులో ఓటుహక్కు బిల్లుఆగేదే, అప్పుడు గాంధీజీ చేసేది లేక, ఇండియా తిరిగి రావలసి వచ్చేది. అక్కడే వుండదలచి, జాప్యం చెయ్యాలని, బిల్లు వస్తుందని తెలిసి కూడా వూరుకున్నాడు. భారతీయులకు ఓటు హక్కు వున్నట్లే, నేటాల్ భారతీయులకు వుండాలని గాంధీ తన స్వీయ గాధలలో రాశారు. 1890లో భారతీయులకు ఓటు హక్కు లేదని తెలిసీ గాంధీ అలా వ్రాశారంటే, దీనిపై వ్యాఖ్య పాఠకులకే వదలేస్తున్నాను. 1893 సంవత్సరం గాంధీ జీవితంలో పెద్ద మలుపు అని ఇంతకు ముందే పేర్కొన్నాం. అంతకుముందూ అ తరువాత ఓడ ప్రయాణాలు, అనుభవాలు క్షుణ్ణంగా పూసగుచ్చినట్లు రాసిన గాంధీ, 1893 ఓడ ప్రయాణం మాత్రం అంటి అంటనట్లు రాశాడు. ఆయన జీవిత చరిత్ర పరిశోధకులు ఆ విషయం పట్టించుకోలేదు.

గాంధీ మార్గ్ త్రైమాస పత్రిక సంపాదకుడు, గాంధేయ అధ్యయనంలో నిపుణుడు టి.కె. మహదేవన్ ప్రత్యేక పరిశోధనచేస్తే అనేక నగ్న సత్యాలు బయటపడ్డాయి. (చూడండి: ది ఇయర్ ఆప్ ది ఫెనిక్స్ 1982 అర్నాల్డ్ హానిమన్, డిల్లీ (ప్రచురణ) వృత్తి రీత్యా తనకు సంబంధించిన విషయమై గాంధి రహస్యంగా వ్యవహరించడంకద్దు (చూడు: టి.కె.మహదేవన్ రాసిన ద్విజ:ఎ ప్రాఫెట్ అన్ ఆర్మ్‌డ్ 1977) గాంధీ తన జీవిత చరిత్రను గుజరాత్‌లో రాసి, వారం వారం నవజీవన్ పత్రికకు పంపాడు. 1922 నుండే జైలులో వుంటూ కేవలం జ్ణాపకశక్తిపై ఆధారపడి గాంధీ రాశాడు. తన సత్య శోధన రచనలో చాలా తప్పులు దొర్లినట్లు మగన్‌లాల్ గాంధీకి రాసిన లేఖలో అంగీకరించారు. కాని దక్షిణాఫ్రికాకు చెందిన విషయాలు రాసిన తరువాత గాంధీ ఎన్నడూ దిద్దలేదు. పుస్తక రూపంలో జీవిత చరిత్రను వేస్తున్నప్పుడు కూడా గాంధీ మళ్లీ దిద్దలేదు. కనుక, దొర్లిన దోషాలు అలాగే వున్నాయి. చరిత్రలు రాసిన గాంధేయులుగాని, అభిమానులుగాని ఆయన రచనలలో నిజానిజాలు పరిశీలించలేదు. గోవింద బాబు కొన్ని విషయాలు గాంధి తన జీవిత చరిత్రలో ఎలా వదిలేసిందే ప్రస్తావించగా, సత్యాన్వేషణకు రాశాకగాని, కార్యకర్తలకు ధృవపత్రాలివ్వడానికి కాదని గాంధీ యంగ్ ఇండియాలో బదులిచ్చారు(జనవరి 31-1929) గాంధీ తన సత్యశోధనలో కావాలని నిజాల్ని దాచేస్తే ఎవరేం చేస్తారు? దక్షిణాఫ్రికాలో తాను ప్లీడరుగా దాదా అబ్దుల్లా కేసు చేబట్టినా, అతడు దొంగ సరుకు రవాణా చేస్తుండేవాడనే సత్యాన్ని గాంధీజీ దాచేశారు. కాని తన కుటుంబ మిత్రుడైన రుస్తుంజీ మాత్రం దొంగ సరుకు రవాణాలో పట్టుబడ్డాడని రాశాడు ఆయనమీద ప్రేమతోనే అలా రాశానని, జీవితగాధ వున్నంతవరకు రుస్తుంజీ పేరు చిరస్తాయిగా వుండాలని తన ఉద్దేశమని, అందుకే ఇతరుల పేర్లు వదలేశానని, తన కుమారుడు మణిలాల్ అభ్యంతరానికి సమాధానమిచ్చారు(1928 జూలై 15)

వివేకానంద శిష్యురాలు నివేదితను కలసినవిషయమై గాంధీ ప్రస్తావనను వివరిస్తూ 1927 జులై మోడరన్ రివ్యూ విమర్శించగా, గాంధీ తప్పడు కూడా కేవలం జ్ఞాపకశక్తిపై ఆధారపడి రాశానని, సత్యశోధనకై ఉద్దేశించాను గనుక మనస్సుపై పడిన ముద్ర దృష్టానే యిది చూడాలన్నారు!