పుట:Abaddhala veta revised.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీజీ జీవితంలో మలుపుతిప్పిన సంఘటన 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళడమే, అక్కడ ప్లీడరుగా ప్రాక్టీసుపెట్టి సంపాదించుకోవాలని, ఇండియాలో అలాంటి అవకాశం లేదని గాంధీజీ భావించి ప్రయాణం కట్టారు. కాని, ఆ విషయం దాచిపెట్టి, 1893 ప్రయాణం గురించి పట్టీపట్టనట్లు రాశారు. ఇండియాలో పొందిన వైఫల్యానికి బదులు, దక్షిణాఫ్రికాలో పట్టుపట్టి సాధించాలని గాంధీజీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సాధించారుకూడా. కాని ఆ విషయం తన రచనలో దాచారు. దక్షిణాఫ్రికాలో గాంధీజి రాసిన పబ్లిక్‌ పిటిషన్ ప్రచురించిన సంపుటాలలో చేర్చలేదు. 1893 సంవత్సరం గాంధీజి జీవితంలో ఎంత మలుపు తిప్పిందో, అంతగా ఆవిషయాన్ని ఆయన దాచారు. దాదా అబ్దుల్లా కేసు కోసమే ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళలేదు. వెళ్ళి అక్కడ పట్టంగట్టి, ప్లీడరీగా కుదురుకోవాలనే నిశ్చయంతోనే వెళ్ళారు. అది సాధించారు కూడా.

గాంధీ జీవిత రచన చేసిన ప్యారిలాల్, దక్షిణాఫ్రికాలో గాంధీజీ వెళ్ళకముందు జాతి విచక్షణ పట్టించుకున్నవారే లేరని మనల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కాని అప్పటికే ప్రిటోరియాలో సి.ఎం.పిళ్ళె కింబర్లీలో దొరస్వామి పిళ్ళె, ఎ.ఒ.అల్లె వున్నారన్న సంగతి ఆయన పరిశోధించనేలేదు. మునుస్వామి అనే మరోవ్యక్తి కూడా యధాశక్తి జాతి విచక్షణకు వ్యతిరేకంగా, తమ హక్కులకోసం పోరాడిన వారిలో వున్నారు. ఇదంతా గాంధీయులు దాచారు. గాంధీకూడా దాచాడు. అదేబాధ, దక్షిణాఫ్రికాకు కేవలం కేసునిమిత్తం, అది పూర్తికాగానే గాంధీజీ వచ్చివుండేవారు. ఆయనకు వీడ్కోలు సభకూడా జరిగింది. అయినా గాంధీజీ అక్కడ వుండాలని భావించినందున, అందుకు తగిన పోరాట కారణాలుకూడా ఆయనకు లభించాయి. అలా చెబితే బాగుండేది. సత్యంకోసమే పుట్టినట్లు చెప్పిన గాంధీ, యీ విషయాన్ని దాచనక్కరలేదు, పైగా భారతీయులు సంతోషించేవారు. గాంధీజీ అబద్దాలతో దక్షిణాఫ్రికా జీవితం ఆరంభించీ, సఫలీకృతులయ్యారు. వీడ్కోలు సమావేశంనాటికే గాంధీజీ దక్షిణాఫ్రికాలో కొనసాగడానికి, భారతీయుల పక్షాన ఒక విజ్ణాన పత్రం సిద్ధంచేశారు. కొందరి సంతకాలు సేకరించారు. భారతీయులకు ఓటు హక్కు నిరాకరించే బిల్లును వ్యతిరేకించడానికి ఉద్యమించారు. అదంతా బాగానే వుంది, కాని స్వీయ చరిత్రలో, ఓటుహక్కు బిల్లు గురించి తనకు తెలియనే తెలియదని గాంధీజీ పచ్చి అబద్దంఆడారు. సత్యశోధనకై అంకితమైన వ్యక్తి అలా ఎందుకు చేశారు?

దక్షిణాఫ్రికాలో వుండదలచలేదు గనుక, వచ్చినపని పూర్తి అయింది గనుక, ఇండియాకు వెళ్ళదలచానని గాంధీజీ రాశారు. ఇదికూడా దారుణ అబద్దం. ప్రిటోరియాలో కేసు విషయం చూస్తూనే, మరోపక్క దక్షిణాఫ్రికా సాంఘిక రాజకీయ పరిస్థితిని గురించి నోట్స్ రాసుకున్నారు. నేటాల్ భారతీయుల నిమిత్తం, వారి ప్లీడరుగా అక్కడే వుండదలచి గాంధీజీ తన కృషి అంతా కేంద్రీకరించారు. నేను ఇండియా వెళ్ళాలనుకుంటే, దైవం మరో విధంగా తలంచింది. అని గాంధీ రాశారు. కాని గాంధి చేసిన కృషి అంతా ఒక పధకం ప్రకారమేనని సాక్ష్యాధారాలు, ఆయన ఉపన్యాసాలు, భారతీయుల సమావేశాలు తెలుపుతున్నాయి.