పుట:Abaddhala veta revised.pdf/256

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కేవలం జ్ణాపక శక్తిపై ఆధారపడి సత్య శోధన చేస్తే వచ్చిన దోషాలు గాంధి జీవితంలో యిన్నీ అన్నికాదు. అయితే 30 సంవత్సరాల తరువాత జీవిత చరిత్ర ధారావాహికంగా రాసినా, కొన్ని సంగతులు ఫోటో తీసినట్లేరాశారు. తన జీవిత చరిత్ర ప్రభావం చాలామందిపై వుంటుందని తెలిసిన గాంధీ నిజాలు చెప్పడంలో జాగ్రత్త వహిస్తే, సత్య శోధన బాగుండేది! ప్యారిలాల్, పెయిన్, హటన్‌బాక్‌తో సహా జీవితచరిత్ర రాసిన వారంతా గాంధీ రాసిన దానినే యధాతధంగా మనకు చెప్పడం వలన, శాస్త్రీయ పరిశోధన జరగ లేదని తేలింది. గాంధీ అబద్దాలు రాస్తే, ఆయన చరిత్రకారులు అనే చిలక పలుకుల్లాగా మనకు తిప్పి చెప్పారు. దక్షిణాఫ్రికాలో గాంధీ వీడ్కోలు సమావేశం అందుకు మచ్చుతునక! గాంధీజీ తన సత్యశోధనలో తన బాల్య ముస్లిం మిత్రుడు షేక్‌మెహతాబ్ గురించిన అనేక వాస్తవాలు వదలేశానన్నారు. వాళ్ళిద్దరి మధ్య స్వలింగ సంపర్క సంబంధం వుందని ఎరిక్ ఎరిక్‌సన్ తన గాంధీస్ ట్రూత్‌లో అంటాడు. షేక్ మెహతాబ్ చిన్నప్పటినుండే మిత్రుడుగా గాంధీచేత చేయించని పాపం అంటూ లేదు. చివరకు దక్షిణాఫ్రికాకు సైతం షేక్ మెహతాబ్‌ను పిలిపించుకున్నాడు, అయినా సత్యశోధన రచనలో చాలా వాస్తవాలు వదలేశారు.

దక్షిణాఫ్రికాలో గాంధీజీ చాలా పరిశోధనలు చేశారు. అయన కీర్తి ఇండియాలో వ్యాపించింది. భారతీయుల కోసం పోరాడి, దెబ్బలుతిని, నిలిచిన దైర్యశాలి గాంధీ. దక్షిణాఫ్రికా అనుభవాలే గాంధీని భారతదేశంలో నాయకుడిగా రూపొందించడానికి పునాదులు వేశాయి. దక్షిణాఫ్రికాలో తన భార్య కస్తూరిబాను ఒక దశలో ఇంట్లోనుంచి గెంటశాడు యువతతో టాల్‌స్టాయ్‌ఫాంలో పరిశోధనలు చేశాడు. చెరువులో స్నానాలు చేస్తున్న యువతీ యువకులు చిలిపి చేష్టలు చేయగా, వారిని నగ్నంగా నడిపించి, ఆడపిల్లల జుట్టు కత్తిరించిన పరిశోధనకూడా యిందులో ఒకటి. నలుగురు పిల్లలు పుట్టిన తరువాత, ఇక లైంగిక సంబంధం వద్దని ఒట్లు పెట్టుకున్నదికూడా దక్షిణాఫ్రికాలోనే. గాంధీ బాల్య వివాహం చేసుకొని, విపరీతంగా లైంగిక కార్యకలాపంలో మునిగి తేలిన విషయం విస్మరించారు. అది గ్రహిస్తే ఆయన పెళ్ళి అయిన వారికి బ్రహ్మచర్యం పాటించమని సలహా యివ్వడంలో విజ్ణతను గమనించవచ్చు. లైంగిక వాంఛలు ఆగాయో లేదోనని వృద్దాప్యంలో కూడా కలకత్తా-నౌఖాళిలో ఇద్దరు యువతులమధ్య నగ్నంగా పడుకుంటే, ఆయన కార్యదర్శి నిర్మలకుమార్ బోసు అభ్యంతరపెట్టి రాజీనామా యిచ్చిన విషయం గుర్తుంచుకోవాలి.

గాంధీ జీవితంలో స్వాతంత్ర పోరాటం ఆయనకు గొప్పతనాన్ని తెచ్చిపెట్టింది. అంతవరకే స్వీకరించకుండా ఇతర విషయాలు కూడా ప్రభావితం చేయడంతో మనం పరిశీలించి, అర్హతలు గమనించవలసి వచ్చింది. గాంధీ అభిప్రాయాలు ఆయుర్వేదం మొదలు ఆవుల వరకూ అనేక అంశాలపై వున్నాయి. అవన్నీ సత్యశోధన అనలేం. గాంధీ సైన్స్ బొత్తిగా చదువుకోలేదు. శాస్త్రీయ ధోరణిలో చూస్తే గాంధీ భావాలు అసలే నిలబడవు. అశాస్త్రీయమైన భావాలు వదిలేద్దాం. బీహారులో భూకంపం వస్తే ప్రజలు పాపం చేశారు గనుక దేవుడు ఆగ్రహించాడని గాంధీ