పుట:Abaddhala veta revised.pdf/245

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బెంగాల్ లో రాయ్ రక్షణ సమితి ఏర్పడింది. సుభాష్ చంద్రబోసు, ఆర్.ఎస్.రూయికర్, ఎస్.ముకుందలాల్, సత్యవతిదేవి, అసఫాలి, బ్రజేష్ సింగ్, కమలాదేవి చటోపాధ్యాయ వున్నారు.

బొంబాయిలో రాయ్ పక్షాన పోరాట సమితిలో జి.వై.ఛట్నీస్, గడ్కారి, మణిబెన్ కారా, వి.బి.కర్నిక్, జి.ఎల్.ఖండాల్కర్, ఉషా బాయిడాంగే, లాల్ జి పాండే,జుల్సారాం ఛౌదరి, ఎల్.డి.పాఠక్, పురుషోత్తమదాస్ త్రికందాస్, జయశంకర్ భట్, లోట్వాలా, ఎం.ఆర్.షెట్టి వున్నారు.

అదే సందర్భంలో ఎవిలిన్ వ్యాసం కూడా రివల్యూషనరీ ఏజ్ ప్రచురించింది. అయితే ఇ.ఆర్. అని మాత్రమే ఆమె రాసింది.తిరిగి అమెరికా వచ్చిన తరువాత ఎవిలిన్ ట్రెంట్ అని మాత్రమే ఆమె పత్రికలలో రాసుకున్నది.

రాయ్ పక్షాన ఇంగ్లండ్ పార్లమెంట్ లో

ఫెన్నర్ బ్రాక్ వే,ఇండిపెండెంట్ లేబర్ పార్టీ నాయకుడుగా హౌస్ ఆఫ్ కామన్స్ లో రాయ్ అరెస్టును ప్రస్తావించాడు. అప్పీలుకు సిద్ధమౌతున్న అంశం కూడా పేర్కొన్నాడు. రాయ్ పక్షాన పోరాడునున్నట్లు చెప్పాడు.

రాయ్ పక్షాన పోరాటం తీవ్రతరం చేస్తున్న దృష్ట్యా డబ్బు సహాయం చేసేవారు. పుస్తకాలు యివ్వదలచినవారు వర్కర్స్ ఏజ్ పత్రికకు అందజేయమని ఫిబ్రరి 27న 1932న విజ్ఞప్తి చేశారు.

రాయ్ కేసును హైకోర్టులో అప్పీలు చేసిన వార్తల్ని, ధనసహాయాన్ని యీ పత్రిక ప్రచురించింది. 20 పౌండ్ల బరువు కోల్పోయిన రాయ్, ఇన్ ఫ్లూయంజాతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

రాయ్ పక్షాన అమెరికన్లు డబ్బు పంపగా రాయ్ స్వీకరించడానికి అంగీకరించలేదని పోస్టల్ శాఖవారు త్రిప్పి పంపారు. కాని యీ విషయం రాయ్ కు తెలియదు. అమెరికా కమ్యూనిస్టు పార్టీ రాయ్ నిమిత్తం వసూలు చేసిన డబ్బు అలా వృధా అయింది.

ఎవిలిన్ మళ్ళీ వివాహం

రాయ్ తో విడిపోయి అమెరికా 1925 చివరిలోవచ్చిన ఎవిలిన్ తన పత్రికా వ్యాసంగాలలో మిస్ అని వ్రాసుకున్నది. రాయ్ ను అరెస్టు చేసినప్పుడే ఇ.ఆర్.అని పాడి అక్షరాలు పెట్టడం మినహాయింపు. 1931లో తల్లి చనిపోయిన తరువాత ఆబ్నర్ లో తండ్రికి శుశ్రూష చేస్తూ వుండిపోయింది.

1935 మార్చి 9న ఎవిలిన్ తండ్రి లామార్టిన్ ఆబర్న్ లో 86వ ఏట చనిపోయాడు. స్థానిక పత్రికలు ఆయన గొప్పతనాన్ని శ్లాఘిస్తూ రాశాయి. ఆయనకు 7 గురు సంతానం,15 మంది మనుమలు అప్పటికి వున్నారు. ఎవిలిన్ కు సంతానం లేదు.