పుట:Abaddhala veta revised.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎం.ఎన్.రాయ్ కు 12 సంవత్సరాల జైలుశిక్ష విధించడాన్నివర్కర్స్ ఏజ్ జనవరి 23-1932 పతాక శీర్షిక ప్రచురించింది. ఆటవిక పాశవిక శిక్షగా చిత్రించి, విమోచనోద్యమానికి యిది దెబ్బ అని పేర్కొన్నది. రాయ్ విడుదలకుద్యమించాలని విజ్ఞప్తి చేసింది.

రాయ్ పోరాటాలను యీ పత్రిక మరోసారి ప్రకటించి, రాయ్ విడుదలకు కృషి చేయాల్సిన అవశ్యకతను వివరించింది. రాయ్ పక్షాన వాదిస్తున్న ఎక్బాల్ కృష్ణ కపూర్ కేసును అలహాబాద్ కోర్టులో చేబట్టనున్నట్లు తెలిపారు. గాంధీని అరెస్టు చేసి గౌరవంగా చూడడాన్ని, భారత కార్మికులకై పోరాడిన రాయ్ ను అవమానకరంగా జైల్లో చూడడాన్ని పోల్చి, యీ పత్రిక విమర్శించింది. (జూన్ 4,1932 వర్కర్స్ ఏజ్,న్యూయార్క్)

కాన్పూరు జైలు నుండి అర్థరాత్రి రాయ్ ను తరలించి తీసుకుపోగా, లక్నోలో యీ వార్త తెలిసిన రైల్వే కార్మికులు 5 వేల మంది స్టేషన్ లో రైలు రాగానే బ్రిటిష్ సామ్రాజ్యం నశించాలి, రాయ్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు యిచ్చారు. అయితే రాయ్ రైలులో లేడని కనుగొన్నారు. అయినా నినాదాలు కొనసాగించారు.

రాయ్ ను బెరెల్లీ జైలులో పెట్టారు. అక్కడ స్థితిగతులు దారుణంగా వున్నాయి. భారతదేశం నుండి ఒక విలేఖరి పంపిన సమాచారాన్ని వర్కర్స్ ఏజ్ పత్రిక ప్రకటించింది.(ఏప్రిల్ 9,1932)

రాయ్ విచారణ వివరాలను అజయ్ కుమార్ ఘోష్ వివరంగా రాయగా 1932 జనవరి 30న(శనివారం) వర్కర్స్ ఏజ్ పూర్తి వ్యాసరూపంలో ప్రచురించింది. రాయ్ ను నిర్బంధించిన జైలు ముందు 50 వేల మంది నిరసన ప్రదర్శన చేశారు. అప్పుడు కాన్పూరుకు తరలించారు. దేశవ్యాప్తంగా నిరసన వెల్లువలు వచ్చాయి. మాజిస్ట్రేట్ జైలు గదిలో రాయ్ ను విచారించాడు. బయటవారిని చూడడానికి రాయ్ కు అనుమతి యివ్వలేదు. స్థానిక బార్ అసోసియేషన్ కు విజ్ఞప్తి చేయనిస్తే, అప్పుడు కొందరు న్యాయవాదులు రాయ్ పక్షాన నిలిచి పోరాడారు. రాయ్ పక్షాన ప్రదర్శనలు చేసినవారిపై పోలీస్ దారుణంగా ప్రవర్తించారు. (ఫిబ్రవరి 6,1932 వర్కర్స్ ఏజ్)

రాయ్ పక్షాన పోరాడిన వివిధ సంఘాల గురించి ఇండిపెండెంట్ ఇండియా ప్రచురించగా రివల్యూషనరీ ఏజ్ ఆ వార్తల్ని ప్రచురించింది.(డిశంబరు 26,1931)

రాయ్ రక్షణ సంఘంలో వున్నవారు:జవహర్ లాల్ నెహ్రూ, పండిట్ నారాయణ ప్రసాద్, అరోరా మౌలానా, హజ్రత్ మోహాని, అజిత్ కుమార్ ఘోష్, గోపీనాధ్ సింగ్. రాయ్ పక్షాన వాదించడానికి జర్మనీ నుండి హర్ ఫెల్డ్ ను రమ్మని కోరారు. అతడు సుప్రసిద్ధ న్యాయవాది. కాశీలో నవజవాన్ భారతసభ రాయ్ పక్షాన ఆందోళన చేబట్టింది. పొరబాటున రాయ్ అనుకొని పృధ్విరాజ్ గంజ్ రాజాను పోలీస్ అరెస్టు కూడా చేశారు.