పుట:Abaddhala veta revised.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎట్టకేలకు తన ఉత్తరాలకు రాయ్ సమాధానం యిస్తూ, అమెరికాలోనే వుండిపొమ్మని, తన దగ్గరకు రానక్కరలేదని తెలియజేశాడు.

క్రమేణా షాక్ నుండి తేరుకొని, జర్నలిస్ట్ గా అమెరికాలో ఎవిలిన్ స్థిరపడింది. 1930లో ఇండియా తిరిగి వచ్చిన రాయ్ ను బ్రిటిష్ పోలీస్ అరెస్టు చేయగా ఎవిలిన్ ఖండిస్తూ వ్యాసం రాసింది.

రాయ్ తన స్మృతులను రాడికల్ హ్యూమనిస్ట్ లో ప్రతివారం రాస్తున్నప్పుడు తన పేరు ప్రస్తావిస్తాడేమోనని ఎదురు చూచింది. డెహ్రాడూన్ లో చివరిదశలో రెండవ భార్య ఎలెన్ కు చెప్పి రాయించిన రాయ్ ఏకోశానా ఎవిలిన్ గురించి నిజం చెప్పలేదు.

రాయ్ చనిపోయిన అనంతరం ఎలెన్ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఎవిలిన్ తో సంబంధం పెట్టుకున్నది. కొందరు స్వదేశీ విదేశీ రాజకీయ పరిశోధకుల్ని ప్రోత్సహించి ఎవిలిన్ దగ్గరకు పంపించింది. రాయ్ ను గురించి చెడుగా రాసిన వారిని ఎవిలిన్ ఖండించింది. రాబర్ట్ నార్త్ అనే రాజకీయ శాస్త్రజ్ఞుడికి రాయ్ గురించి అనేక విషయాలు ఎవిలిన్ చెప్పింది. చివరి వరకూ రాయ్ పట్ల ఎవిలిన్ ఉదాత్తంగా ప్రవర్తించింది. కమ్యూనిస్టుగా ఎం.ఎన్.రాయ్ మాత్రం ఎవిలిన్ పట్ల మానవ ధర్మంతో వ్యవహరించలేదు.

ఎవిలిన్-రాయ్ మధ్య సయోధ్యకై స్నీవ్ లైట్ ప్రయత్నించకపోలేదు. ఎవిలిన్ అమెరికా వెళ్ళిన అనంతరం ఎం.ఎన్.రాయ్ స్నీవ్ లైట్ యింట్లో కొన్నాళ్ళునాడు. అప్పుడు ఎంత చెప్పి చూచినా,రాయ్ రాజీకి ఒప్పుకున్నట్లు లేదు. ఈలోగా రాయ్ ని తొందరపడి ఏమీ అనవద్దని,మళ్ళీ తూర్పుదేశాలలో ఉభయులూ కలిసే అవకాశం వుందనీ స్నీవ్ లైట్ రాశాడు. బహుశ అప్పుడు విషయాలన్నీ రాయ్ విడమరచి, మనస్సు విప్పి చెప్పవచ్చునని కూడా ఎవిలిన్ ను ఓదార్చాడు. కాని అలాంటిదేమీ జరగలేదు. ఎవిలిన్ యూరోప్ నుండి వెళ్ళిపోయిన సంవత్సరంన్నరకు గాని రాయ్ చైనా వెళ్ళలేదు. ఈలోగా ఆయనకు లూసీగీస్లర్ అనే స్విస్ కమ్యూనిస్టు యువతితో సన్నిహిత పరిచయం ఏర్పడింది. ఆమెను అంతరంగిక కార్యదర్శిగా చైనా తీసుకువెళ్ళాడు. ఎవిలిన్-రాయ్ 9 ఏళ్ళ దాంపత్యం అలా ముగిసింది.

అమెరికాలో ఎం.ఎన్.రాయ్
(ఎవిలిన్ పై నూతన అంశాల వెల్లడి)

ఎం.ఎన్.రాయ్ మానవవాదిగా మారక ముందు, ఆ మాటకొస్తే కమ్యూనిస్టుగా పరిణమించక పూర్వం, అమెరికాలో అడుగుపెట్టాడు. అప్పటికి ఆయన ఎం.ఎన్.రాయ్ కూడా కాదు. తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య మాత్రమే. అమెరికాలో ఎం.ఎన్. రాయ్ ఏం చేశాడు, ఎలా ఆవిర్భవించాడనే విషయం పరిశోధించి యిక్కడ చారిత్రక ఆధారాలతో