పుట:Abaddhala veta revised.pdf/226

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఎవిలిన్ 1925 జులై 30న అమెరికా వెళ్లిపోయింది. ఆంస్టర్ డాంలో జరిగిన కమ్యూనిస్టు వలస రాజ్యాల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె హఠాత్తుగా స్వదేశం వెళ్ళింది. అంతకుముందు స్విట్జర్లాండ్ లో రాయ్ దంపతులు "రెండవ ప్రేమయాత్ర" వంటిది అనుభవించారు. అక్కడే ఎవిలిన్ ను వెళ్ళిపొమ్మని రాయ్, పిడుగువంటి ఉత్తరవులు యిచ్చాడు. ఎందుకో చెప్పమని ఎవిలిన్ అడిగింది. ఉంటానని బ్రతిమాలింది. రాయ్ తన నిర్ణయం మార్చుకోలేదు. కారణాలు ఏవీ చెప్పలేదు.

ఎవిలిన్ తన వ్యక్తిత్వం చంపుకోకుండా వుండదలచినప్పుడు, రాయ్ అలాంటి నిర్ణయానికి వచ్చినట్లు అభిప్రాయపడింది. అనేక సందర్భాలలో ఘర్షణలు వచ్చినా, తాను వ్యక్తిత్వం అణచుకొని, భార్యగా అణకువతో వున్నందున 9 ఏళ్ళు వుండగలిగానని, సింహావలోకనంలో ఎవిలిన్ తెలిపింది. 1921లోనే రాయ్ అలా ప్రవర్తించినప్పటికీ, తనపట్ల అలాంటి అభిప్రాయం వెల్లడించి వుంటే, అప్పుడే వెళ్ళిపోయే దానినని పేర్కొన్నది. రాయ్ తో కేవలం భార్యగానే గాక, అతని ఉద్యమ కృషిలో భాగం పంచుకున్న ఎవిలిన్ కు, విడిపోవాలనే రాయ్ నిర్ణయం షాక్ నిచ్చింది.

రాయ్ తనను ఒక విలాస వస్తువుగా వాడుకున్నట్లు వెనక్కు తిరిగి చూచుకున్నప్పుడు, అవగాహనకు వచ్చింది ఎవిలిన్. బహుభార్యాత్వ విధానంలో తాను ఒకత్తెగా వున్నాననే అభిప్రాయం కూడా ఎవిలిన్ వెల్లడించింది. నిష్కర్షగా చర్చచేయకుండా, దాచిపెట్టి, గుంభనగా విషయాలు వుంచడం బహుశ తూర్పు దేశాల సంస్కృతి కావచ్చునని ఎవిలిన్ నిర్ధారణకు వచ్చింది. ఏ ఘట్టంలోనైనా తాను పొరపాటు చేసినట్లు 9 సంవత్సరాలలో రాయ్ ఎన్నడూ దెప్పిపొడవ లేదు. అలాంటప్పుడు యీ హఠాత్తు నిర్ణయం ఎలా చేస్తాడని ఎవిలిన్ ఆశ్చర్యపోయింది.

1925 ఆగష్టు నుండీ అమెరికాలో వున్న ఎవిలిన్ అనేక ఉత్తరాలు రాసినా రాయ్ నుండి సమాధానం రాలేదు. ఉభయులకూ కుటుంబ, ఉద్యమ మిత్రుడుగా వున్న స్నీవ్ లైట్ కు విషయాలు రాసింది. కారణాలు కనుక్కోమన్నది. ఒకవేళ రాయ్ తిరిగి రమ్మన్నా, పూర్వంవలె వుండడం కుదరదని భావించింది. అయినా రమ్మంటాడేమో కనుక్కోమనికోరింది. వెళ్ళిపొమ్మనడానికి కారణాలు కావాలని తరచి అడిగింది. భారతదేశంలో పనిచేయాలని తూర్పుదేశాల ఉద్యమాలలో పాల్గొనాలని ఆశించిన ఎవిలిన్, మళ్ళీ కమ్యూనిస్టు పార్టీ కోరితేనో, రాయ్ పిలిస్తేనో రాగలననుకున్నది.

మాతృదేశం అయిన అమెరికాలో అడుగు పెట్టిన ఎవిలిన్, నోరు విప్పినా, అక్కడ కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినా దేశం నుండి పంపించేవారే. అప్పటికే 1926లో చికాగోలో జరిగిన అమెరికా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో పాల్గొన్నది. కాని ముఠా తగాదాలు, నీచంగా వదంతులు వ్యాపించడం, రాయ్ ను వదిలేసి వచ్చిందని తనపై నీలాపనిందలు, గూఢచారి అని, డబ్బు కాజేసిందని, మరెన్నోనిందలు విని విసుగుచెంది వారందరికీ దూరంగా వుండాలని నిర్ణయించుకున్నది.