పుట:Abaddhala veta revised.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యక్తిపై వుంటుందన్నాడు. ఆ విధంగా చూస్తే పారిశ్రామిక సమాజాలలో వున్న వ్యక్తి వైమనస్యతకు గురౌతాడన్నారు. దీనిని Alienation చెప్పిన ఫ్రామ్ ధోరణి ఆనాడు కొలంబియా యూనివర్శిటీ, న్యూయార్క్ జనాలకు నచ్చలేదు.

హేతువాదంతో విశ్వాసం గనుక పొందికగా యిమడలేకపోతే, పాత సంస్కృతి ప్రభావాలు లక్షణంగా భావించి, విశ్వాసానికి తిలోదకాలివ్వాలని ఎరిక్ ఫ్రామ్ రాశాడు. (మేన్ ఫర్ హింసెల్ఫ్) విశ్వాసంస్థానంలో సైన్స్ చోటుచేసుకోవాలన్నాడు.

ఎరిక్ ఫ్రామ్ పూర్వాపరాలు

ప్రపంచ వ్యాప్తంగా ఎరిక్ ఫ్రామ్ పేరెత్తగా, ఆర్ట్ ఆఫ్ లవింగ్ పుస్తకం జ్ఞాపకం చెసుకుంటారు. మొదలుపెడితే చివరి దాకా చదివించే లక్షణం గల ఫ్రాం, అతి జటిలమైన విషయాలను సులభంగా చెప్పడంలో ఆరితేరిన సామాజిక మనోవిజ్ఞాన మానవవాది.

జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ నగరంలో యూదు పురోహిత(రాబై) కుటుంబంలో 1900 మార్చి 23న ఎరిక్ ఫ్రామ్ పుట్టాడు. తన తల్లిదండ్రులు చపలచిత్తురనీ, తనకూ కొస వెర్రి లేకపోలేదనీ రాసుకున్నాడు. తన 26వ ఏట వరకూ ఫ్రామ్ కూడా యూదు మత సంప్రదాయాలను పాటించి, బయటపడ్డాడు. ఫ్రామ్ యువకుడుగా సాల్మన్ రబిన్ కోవ్ సోషలిస్టు భావాలకు, నెహెమియా నోబల్ మార్మిక ధోరణిక గురయ్యాడు.

రైనర్ ఫ్రంక్ కొన్ని ఆసక్తికర విషాయాలు వెల్లడిస్తూ ఫ్రామ్ జీవిత విశేషాలు రాశాడు. ఫ్రామ్ కుటుంబంలో 20 ఏళ్ళ యువతి ఆత్మహత్య చేసుకోవడం,ఆమెను తన తండ్రి సమాధి పక్కనే పెట్టడం కొంత ప్రభావాన్ని కలిగించిందనీ, ఫ్రాయిడ్ సిద్ధాంతాల పట్ల శ్రద్ధ చూపడానికి యీ సంఘటన కారణమని అంటాడు.

విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలు శాంతియుత సహజీవనం గడపవచ్చనే ఫ్రామ్ విశ్వాసం, మొదటి ప్రపంచ యుద్ధంతో పటాపంచలైంది. మానవుడిలో హేతు విరుద్ధ భావాల్ని, ధోరణుల్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాడు.

చరిత్రను లోతుగా అవగహన చేసుకోడానికి మార్క్స్ రచనలు ఫ్రామ్ కు ఉపకరించాయి. మార్క్స్ తొలి రచనలు మానవవాదంతో వున్నాయని చెప్పాడు. ఫ్రాంక్ ఫర్ట్, హైడల్ బర్గ్ లో చదివి 1922 నాటికే డాక్టరేట్ పట్టం స్వీకరించిన ఫ్రామ్, 1926లో ఫ్రెడారైక్ మన్ ను పెళ్ళాడాడు. మ్యూనిక్ లో మనోవిశ్లేషణ అధ్యయనం గావించాడు.

ఆనాడు ఫ్రాంక్ ఫర్ట్ మేధావి వర్గాలు ఆలోచనారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టాయి. అందులో కొంతకాలం ఫ్రామ్ కూడా వున్నాడు. సామాజిక శాస్త్రాలకూ, మానసిక విజ్ఞానానికీ సన్నిహిత సంబంధం వుండాలని ఫ్రామ్ ఉద్దేశ్యం.