పుట:Abaddhala veta revised.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
నవ్య మానవుడు ఎరిక్ ఫ్రామ్

ఏమి చెబుతున్నామనేది ఎంత ముఖ్యమో,ఎలా చెబుతున్నామనేది అంతకంటే ప్రధానమైన అంశం. ఎరిక్ ఫ్రామ్ నుండి అందరూ నేర్వదగిన అంశంలో-ఎంత క్లిష్టమైన, జటిలమైన ఇనుప గుగ్గిళ్ళు కూడా ఆయన కలానికి లొంగి, కావలసినట్లు మైనం వలె ఒంపుసొంపులు తొడుగుకుంటాయి-అనేది చూడవచ్చు.

మార్క్సిజంతో ప్రారంభించి సైకో ఎనాలసిస్ వరకూ, ప్రేమ నుండి మానవ వాదం దాకా ఎరిక్ ఫ్రామ్ ప్రస్తావించాడు. అన్నిటినీ చదివించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎరిక్ ఫ్రామ్ అభిమానులు, శిష్యులు, అనుచరులు సగర్వంగా "మా గురువు" అని చాటుకునే వారున్నారు.

1975లో ఎరిక్ ఫ్రామ్ కు ఉత్తరం రాసి,ఆయన రచన "ది సేన్ సొసైటి" అనువాదానికి అనుమతి కోరాను. ఆయన నుండి వెంటనే సమాధానం వచ్చింది. కాపీరైట్ వున్న గ్రంథం గనుక,ప్రచురణకర్తలు అనుమతి యివ్వాలని, తన సెక్రటరీ ఆ విషయంలో సహకరించగలడనీ రాశారు. చాలా సంతోషించారు. 1980లో ఆయన చనిపోవడం నాకు చాలా విచారాన్ని మిగిల్చింది.

1964లో కీ॥శే॥ఆవుల గోపాల కృష్ణమూర్తి అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై అమెరికాలో పర్యటించబోతుండగా, ఎరిక్ ఫ్రామ్ ను తప్పనిసరిగా కలుసుకోమని కోరాను. ఆ ప్రకారమే ఎ.జి.కె. ప్రయత్నించి, నిర్ణీత సమయంలో కలవాలని నిర్ణయించారు. ఎరిక్ ఫ్రామ్ యిచ్చిన సమయానికి వెళ్ళలేక,ప్రయాణం దూరాన్ని, కాలాన్ని, అంచనా వేయడంలో పొరబడి కలుసుకోలేకపోయారు.

1955లో సేన్ సొసైటి ప్రచురితమైంది. అందులో తొలి అధ్యాయంలోనే ఎరిక్ ఫ్రాం ప్రత్యేకంగా ఎం.ఎన్.రాయ్. "రీజన్, రొమాంటిసిజం, రివల్యూషన్" గ్రంథాన్ని ప్రస్తావించారు. యూరోప్ పునర్వికాసం అవగహన చేసుకోడానికి ఆ పుస్తకం చదవాలని పాఠకులకు సిఫారసు చేశారు. అంతకు ముందు సంవత్సరం క్రితమే రాయ్ చనిపోయారు. రాయ్ గ్రంథం 2 సంపుటాలు అప్పుడే వెలువడ్డాయి. అంటే ఎరిక్ ఫ్రామ్ ప్రచురణ జరిగిన కొద్ది రోజులకే రాయ్ పుస్తకం చదివారన్నమాట. రాయ్-ఫ్రామ్ లకు ఎంత పరిచయం వుందో తెలియదు. 1952లో తొలుత ఏర్పడిన అంతర్జాతీయ హ్యూమనిస్టు సంఘానికి రాయ్ వైస్ ప్రెసిడెంట్ గావడం, హ్యూమనిస్ట్ వే అనే త్రైమాస పత్రికను నడిపే రాయ్ బహుశ ఫ్రామ్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి వుండొచ్చు.

అమెరికా హ్యూమనిస్ట్ అసొసియేషన్ 1966 సంవత్సరంలో ఎరిక్ ఫ్రామ్ ను హ్యూమనిస్ట్ గా సత్కరించింది. తాను మానవ సహజవాదినని, రాడికల్ హ్యూమనిస్ట్ నని ఫ్రామ్ స్పష్టీకరించాడు. అనేక పర్యాయాలు హ్యూమనిస్ట్ సంఘ సమావేశాలలో మాట్లాడి, సంఘం, సంస్కృతి ప్రభావం