పుట:Abaddhala veta revised.pdf/222

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

జర్మనీలో తలెత్తిన నాజీవాదం, హిట్లర్ పెత్తందారీ తనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఫ్రామ్, ఉత్తరోత్తరా తన "అనాటమీ ఆఫ్ హ్యూమన్ డిస్ట్రక్టివ్ నెస్" లో అటు హిట్లర్, యిటు స్టాలిన్ మానవ వినాశకర రీతుల్ని ఎందుకు చేబట్టారో విడమరచాడు.

ఫ్రాయిడ్ అనుచరుడుగా కొన్నాళ్ళున్న ఫ్రామ్ క్రమేణా నిశిత పరిశీలకుడుగా మారి, ఫ్రాయిడ్ లో నిలిచేది,నిలవనిది వేరు చేయగలిగాడు. మనోవిశ్లేషణ శిక్షణ పొంది ఆచరించాడు.

1931 నాటికే క్షయ వ్యాధి సోకగా,స్విట్జర్లాండ్ లోని దావాస్ లో వుంటూ, తన భార్యకు ఎడమయ్యాడు. తరువాత అమెరికాకు వలస వెళ్ళి కారెన్ హర్నేతో సన్నిహితుడయ్యాడు. పదేళ్ళపాటు వారి మిత్రత్వం సాగింది. అమెరికాలో స్థిరపడిన ఎరిక్ ఫ్రామ్ పౌరసత్వం స్వీకరించాడు. అంతవరకూ జర్మన్ లో రచనలు సాగించిన ఫ్రాం, 1939నుండీ ఇంగ్లీషు రచనలు మొదలుపెట్టాడు.

ఎస్కేప్ ఫ్రం ఫ్రీడం రచన 1941లో రాగా, ఫ్రామ్ సిద్ధాంతకారుడుగా వెలుగులోకి వచ్చాడు. అది అతడి మూల సిద్ధాంతం. మానవుడు వైమనస్తతతో, బాధ్యతల్ని తప్పించుకొని,ఏదొక పెత్తందారీ వ్యవస్తకు లొంగిపోయి, అటు నియంతలనో, యిటు దేవుడినో కొలుస్తూ తన బాధ్యత నుండి తప్పుకుంటా డన్నారు.

1944లో హెన్నీ గుర్ లాండ్ ను పెళ్ళి చేసుకున్నాడు.

1947లో మాన్ ఫర్ హింసెల్ఫ్ ప్రచురించాడు. అప్పటికి మానవవాదిగా ఆవిర్భవించి మానవుడు తన బాధ్యతల్ని తానే స్వీకరించాలని, మానవుడు కేంద్రస్థానంలోకి రావాలన్నాడు.

1950 నుండీ ఫ్రామ్ మెక్సికోలో వుంటూ అక్కడ సుప్రసిద్ధుడయ్యాడు. 1952లో రెండో భార్య చనిపోగా, ఆనిస్ ఫ్రీమాస్ ను పెళ్ళాడాడు.

1955లో సుప్రసిద్ధ రచన సేన్ సొసైటి వచ్చింది. సామాజిక రీతుల్లో సోషలిస్టు వ్యవస్త ఎలా అమలులోకి తేగలమనే సిద్ధాంత గ్రంథం అది.

నేటి ప్రపంచాన్ని ఆకర్షించినది ఆర్ట్ ఆఫ్ లవింగ్ 1956లో ఫ్రామ్ ప్రచురించారు. ప్రేమను భిన్న కోణాల నుండి శాస్త్రీయంగా చూడగలగడం అందలి విశేషం. 1959లో ఫ్రాయిడ్ పై విశ్లేషణను స్వతంత్ర ధోరణిలో రాశారు. మరోపక్క ఫ్రామ్ సోషలిస్ట్ పార్టీలో అమెరికాలో ప్రముఖ పాత్ర వహించారు. ఆ దశలోనే 1961లో మార్క్స్ కాన్ సెప్ట్ ఆఫ్ మాన్ రాశారు.

ప్రపంచ శాంతి సమావేశాల్లో పాల్గొనడానికి 1962లో మాస్కో వెళ్ళారు. బియాండ్ ది చైన్సు ఆఫ్ ఇల్యూజన్ 1962లో ప్రచురించారు. ఆతరువాతనే ది హార్ట్ ఆఫ్ మాన్ కూడా రాశారు.

అమెరికా విధానాన్ని వియత్నాం యుద్ధంలో పాల్గొనడాన్ని ఫ్రామ్ తీవ్రంగా నిరశించారు.