పుట:Abaddhala veta revised.pdf/199

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సంఘానికి మతసంస్థలపై పెత్తనం ఏర్పడింది. ఈ సంఘానికి వున్న పెత్తనం దృష్ట్యా సిక్కులలో కలహాలు సంభవిస్తున్నాయి.

1920 డిసెంబరు 14న శిరోమణి అకాలీదళ్ ఏర్పడింది. అప్పటి నుంచీ సిక్కులు మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చారు. పంజాబ్ లో సిక్కు జనాభా శాతం 13 మాత్రమే. అయినా శాసనసభలలో వీరికి జనాభాకు మించిన ప్రాతినిధ్యం లభిస్తూనే వున్నది. జాతీయోద్యమం ముమ్మరంగా సాగిపోతుండగా సిక్కులలో కొందరు ఉద్దాంసింగ్ నాగోకీ నాయకత్వాన దేశ స్వాతంత్ర్యానికి కృషిచేశారు. ఇందుకు భిన్నంగా జ్ఞాని కర్తార్ సింగ్ ఆధ్వర్యాన సిక్కులు కాంగ్రెసును ప్రతిఘటించారు. 1942 క్విట్ ఇండియా సందర్భంగా సిక్కుల చీలిక బయటపడింది. సిక్కిస్తాన్ కావాలనే ధోరణి వెల్లడైంది. సిక్కులు పాంథిక్ పార్టీని ఏర్పరచి, కాంగ్రెసును వ్యతిరేకించారు. (1946) వల్లభాయి పటేల్ వంటివారు సిక్కుల ప్రత్యేక సిక్కిస్తాన్ కోర్కెను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ స్వాతంత్ర్యం నాటికి పాకిస్తాన్ చీలినా, సిక్కుల కోర్కె తీరలేదు.

సిక్కిస్తాన్ కావాలంటూ స్వాతంత్ర్యానంతరం మాస్టర్ తారాసింగ్ ఆందోళనకు పూనుకున్నారు. 1949లో ఆయన్ను నిర్భంధించారు. అఖిలభారత అకాలీ మహాసభ 1951 మార్చిలో లూధియానోలో జరిపారు. సెక్యులర్ ప్రజాస్వామ్యం కావాలంటూనే సిక్కులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని సర్దార్ హుకుంసింగ్ నాయకత్వాన తీర్మానించారు.

సిక్కులలో కాంగ్రెసు,కమ్యూనిస్టు, అకాలీ పార్టీలకు చెందినవారున్నారు. అందరూ గురుద్వారాలపై పెత్తనం చలాయించే ప్రబంధక సంఘ ఎన్నికలలో తలపడుతూ వచ్చారు. మాస్టర్ తారాసింగ్ 1954లో యీ సంఘాధిపతిగా ఎన్నికయ్యారు. సిక్కుల మతం-రాజకీయాలు విడదీయరానివని ఆయన చాటారు. కాంగ్రెసును వ్యతిరేకిస్తూ సిక్కులకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. హిందువులు పంజాబులో సిక్కులను అంతం చేయదలచారన్నారు. అలాంటి తారాసింగ్ రెండేళ్ళలో మాట మార్చి కాంగ్రెస్ లో విలీనం అయ్యారు! (1956 అక్టోబరు 2) మతపరంగా సిక్కుల ఆసక్తిని కాపాడుతూనే, రాజకీయంగా కాంగ్రెస్ లో వుండాలన్నారు.

ప్రబంధక సంఘ ఎన్నికలలో మాస్టర్ తారాసింగ్ 1958లో ఓడిపోయారు. ఆ తరువాత ప్రబంధక సంఘంలో నామినేటెడ్ సభ్యులను నియమించడానికి,సిక్కులు కానివారిని ఓటర్లుగా చేర్చడానికి చట్టాన్ని 1959లో మార్చారు. అమరణ నిరాహారదీక్ష బూనిన తారాసింగ్ ను శాంతింపజేయడానికి నెహ్రూ ఒక సంఘాన్ని నియమిస్తామన్నారు. పంజాబీ రాష్ట్రం కావాలని తారాసింగ్ నినదించారు. 1960 ఎన్నికలలో తారాసింగ్ ప్రబంధక సంఘంలో గెలిచారు. పంజాబీ సుబాకై ఆందోళన చేబట్టారు. అప్పుడే సంత్ ఫతేసింగ్ ను తారాసింగ్ రంగంలోకి దింపారు. తారాసింగ్ కు వ్యతిరేకంగా మరోవర్గం బయలుదేరింది. రాజకీయ పార్టీలు శిరోమణి ప్రబంధక సంఘంలో వుండరాదని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ కైరాన్ 1959 లో సూచించారు.

1962 అక్టోబరులో జరిగిన ఎన్నికలలో తారాసింగ్ నెగ్గారు. అప్పటి నుండే చీలిపోయిన